Saturday, May 4, 2024

తెలంగాణలో ’పీకే‘ రహస్య సర్వే.. మల్లన్నసాగర్‌, గజ్వేల్‌లో ప్రకాశ్​రాజ్​తో కలిసి పర్యటన

ఉమ్మడి మెదక్‌, ప్రభ న్యూస్‌ బ్యూరో: రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్‌ కిషోర్‌ తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుపై రహస్యంగా సర్వేచేస్తున్నారా.. అంటే అవుననే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పీకే తెలంగాణలో జనాల నాడి పట్టేందుకు తన టీంను దింపారనే సమాచారం అన్నివర్గాల్లో కోడైకూస్తున్నది. ఇది సత్యమనని చెప్పే సంకేతాలు పీకే తెలంగాణ టూర్‌ ద్వారా బహిర్గతమైంది. శనివారం గప్‌చుప్‌గా ప్రశాంత్‌కిషోర్‌ సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌తో కలిసి సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ వద్ద పర్యటించారు. ఆయనకు ఇరిగేషన్‌ అధికారులు మల్లన్నసాగర్‌ పనితీరును వివరించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లో పీకే రహస్య సర్వే నిర్వహించారనే టాక్‌ వినిపిస్తోంది. జనాల నాడి పట్టుకునేందుకు తానే ఒంటరిగా బరిలో దిగి గప్‌చుప్‌గా సర్వే నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం. గజ్వేల్‌లోని పలు ప్రాంతాల్లో జనాలను కలిసి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో జీవధారగా పొంగి ప్రవహిస్తున్న గోదావరి జలాలపై అడిగి తెలసుకున్నట్లు స్పష్టమవుతోంది. పీకే తెలంగాణలో దర్శనమివ్వడంతో ఆ పార్టీ శ్రేణులు నివ్వరపోతుండగా, సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలకు ఎంట్రీ పై క్లారిటీ వచ్చిందని స్పష్టమవుతోంది. ఇందులో భాగంగానే పీకే తెలంగాణ పర్యటన అని స్పష్టమైన సంకేతాలు కనబడుతున్నాయని ఆ పార్టీ శ్రేణులు గుసగుసలాడుతుండగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చాంశనీయంగా మారింది.

మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ వద్ద పీకే దర్శనం
సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ వద్ద ప్రశాంత్‌ కిషోర్‌, సినీనటుడు ప్రకాశ్‌రాజులు శనివారం దర్శనమిచ్చారు. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ పనితీరును ఇరిగేషన్‌ అధికారులు వివరించినట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌కిషోర్‌ , ప్రకాశ్‌రాజ్‌ల వెంట ఇరిగేషన్‌ అధికారి హరిరాం, గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌రెడ్డిలు ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ ప్రారంభోత్సవ సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లో 600 ఎకరాల ఐలాండ్‌ను టూరిజం, షూటింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. హాలీవుడ్‌, బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌లన్నీ ఇక్కడ జరిగేలా పోటీపడుతాయని అదే రోజు తేల్చారు. గజ్వేల్‌ సమీపం నుండే ఆర్‌ఆర్‌ఆర్‌ వెళ్తుండటంతో అక్కడి నుండి మల్లన్నసాగర్‌కు రెండు ఫోర్‌ లైన్ల రోడ్డును చేపడుతామన్నారు. వంద కోట్లతో ఇరిగేషన్‌ కాంప్లెక్స్‌, బూర్జ్‌ కలీఫాను తలపించేలా వాటర్‌ ఫౌంటేన్లు నిర్మిస్తామని వెల్లడించారు. ఆ మరునాడే సీఎం కేసీఆర్‌ టూరిజం, స్పోర్ట్సు, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఇతరత్రా అధికారులతో భేటీ అయ్యి మల్లన్నసాగర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, అందుకు అవసమైన ప్రతిపాధనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే పీకే మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను సందర్శించి దాని పనితీరు వాస్తవ పరిస్థితులను ప్రకాశ్‌రాజ్‌తో కలిసి తెలుసుకునే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.

ప్రధానంగా కాళేశ్వరం పైనే ఫోకస్‌
ప్రశాంత్‌ కిషోర్‌ ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైనే ఫోకస్‌ చేసినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు తెలంగాణ నలుమూలలా ఎలా ప్రవహిస్తున్నాయి, తెలంగాణలో ఎత్తిపోతల పథకం సాధ్యం కాదన్న దానిని సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ద్వారా ఎలా సుసాధ్యం చేశారు, ప్రాజెక్టు పనితీరు, ప్రపంచం మెచ్చిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ఎలా సస్యశ్యామలంగా మారింది, గత ప్రభుత్వాల హయాంలో తెలంగాణ రైతాంగం పరిస్థితి ఏమిటి, కాళేశ్వరం జలాలతో భీడుభూములు పంటభూములుగా మారినతర్వాత రైతుల అభిప్రాయం ఎట్లుంది అనే దాని పై సమగ్రంగా నివేదిక తయారుచేస్తున్నట్లు , దీనిని హైలెట్‌ చేస్తూ జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ పనితీరు, చిత్తశుద్ధిని చాటనున్నట్లు అవగతమవుతోంది.

జనాల నాడి తెలుసుకునేందుకు ఒంటరిగా పీకే సర్వే
సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజవకర్గంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి అనే కోణంలో పీకే ఒంటరిగా సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. దీని కోసం శనివారం పీకే గజ్వేల్‌లో తానొక్కడే పర్యటించి ప్రజల్లో కలిసిపోయి గప్‌చుప్‌గా సర్వే నిర్వహించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రైతు బంధు, రైతు భీమా, విద్యా-వైద్యం అందుతున్న తీరు, ఫించన్లు, అన్నివర్గాల సంక్షేమంపై పీకే ఒంటరిగా సర్వేచేసి వెళ్లినట్లు సమాచారం.

గజ్వేల్‌ అభివృద్ధి పరిశీలించిన ప్రకాశ్‌రాజ్‌
మహారాష్ట్ర టూర్‌లో సీఎం కేసీఆర్‌ వెంట మెరిసిన సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ గజ్వేల్‌ అభివృద్ధిని పరిశీలించారు. శనివారం గజ్వేల్‌ పట్టణంలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, ఎడ్యూకేషన్‌ హబ్‌, అర్బన్‌ పార్కు, మహతి ఆడిటోరియం తదితర అభివృద్ధి పనులను ప్రకాశ్‌ రాజ్‌ స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రకాశ్‌ రాజ్‌ వచ్చివెళ్లాడని ఆయనతో పాటు రాజకీయ వ్యూహాకర్త పీకే ఉన్నాడన్న వార్త పొలిటికల్‌ సర్కిళ్లలో ఆసక్తిగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement