Monday, April 29, 2024

Health: ఇలా బాధపడేవారు.. అలా నిద్రిస్తే చ‌నిపోయే ప్రమాదం ఉంది..

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కావాల్సినంత నిద్ర ఉండాలి.. నిద్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని డాక్ట‌ర్లు చెబుతుంటారు. సరైన నిద్ర ఉంటేనే రోజంతా ఆరోగ్యంగా ఉంటార‌ని పెద్ద‌లు కూడా అంటారు. రోజుకు కంటికి సరిపడ నిద్ర ఉంటే మెదడుకు ప్రశాంతత ఉండడమే కాకుండా.. అనారోగ్య సమస్యలు దరిచేరవు.. అయితే కొంతమంది ఇష్టమున్నట్టు నిద్ర పోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని, చనిపోయే ప్రమాదమూ ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు..

చాలామంది తమ ఇష్టమున్న‌ట్టు నిద్రపోతుంటారు. కానీ, నిజానికి ఎడమ చేతిని తలకింద దిండుగా పెట్టి ఎడమవైపు పడుకోవడం ఆరోగ్యానికి మంచిది. అలాగే ఎడమవైపు పడుకోవడం వ‌ల్ల‌ ఎక్కువ సేపు నిద్రించడమే కాకుండా.. ఆరోగ్యంగా ఉంటారు. అయితే.. చాలామందికి బోర్లా పడుకునే అలవాటు కూడా ఉంటుంది. అలా పడుకోవడం వల్ల వెంటనే నిద్ర పడుతుందని కొందరి నమ్మకం. కానీ, అలా నిద్రించడం చాలా ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు.

మూర్ఛ వ్యాధితో బాధ‌ప‌డేవారు నిద్రించే సమయంలో బోర్లా ప‌డుకోవ‌ద్దంటున్నారు డాక్ట‌ర్లు. అలా ప‌డుకోవ‌డం వ‌ల్ల చ‌నిపోయే చాన్సెస్ ఎక్కువ‌గా ఉంటాయ‌ని చెబుతున్నారు. ప‌లు అధ్యయనాలు ఇదే స్ప‌ష్టం చేస్తున్నాయంటున్నారు. పిల్లల్లో చాలా మంది బోర్ల‌ పడుకోవడం వల్ల మరణాలు సంభవించినట్లు ప‌లు ఆధారాలున్నాయని వివ‌రిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50మిలియన్ల మంది మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారు. ఇల్లినాయిస్‌లోని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ జేమ్స్ టావో తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. అనియంత్రిత మూర్ఛ ఉన్న వారిలో మరణం అనేది సాధారణంగా నిద్ర పోతున్న‌ప్పుడే సంభవిస్తుంది. ఈ పరిశోధన కోసం 253 మంది వ్యాధిగ్రస్తులపై పరిశోధన చేశారు. ఈ అధ్యయనం ప్రకారం.. 73 శాతం మంది మూర్ఛ వ్యాధిగ్రస్తులు బోర్లా పడుకోవడం వల్ల చ‌నిపోయిన‌ట్టు ఆ అధ్యయనాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement