Friday, May 3, 2024

తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ ఆపేయండి: సీఎం పళని

తమిళనాడు నుంచి ఏపీ, తెలంగాణకు వెళ్తున్న 80 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సరఫరాను వెంటనే నిలిపివేయాలని కోరుతూ సీఎం పళనిస్వామి.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని, ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత వేధిస్తోందని అందువల్ల తమ రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్న ఆక్సిజన్ ను తక్షణమే నిలిపివేయాలని కోరారు. రాష్ట్రంలో 400 మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ ను ఉత్పత్తి చేస్తుండగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 310 మెట్రిక్‌ టన్నులు ఖర్చవుతోందని లేఖలో పర్కొన్నారు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్‌ లో 450 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్ అవసరయ్యే అవకాశాలున్నాయని చెప్పారు.

గత ఏడాదితో పోల్చుకుంటే ప్రస్తుతం 58 వేల కేసులు అధికంగా నమోదవుతున్నాయని పళని వివరించారు. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి అవసరమైనంత ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించలేదని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలుగురాష్ట్రాలకు సరఫరా అవుతున్న 80 మెట్రిక్‌టన్నుల సరఫరాను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని సీఎం పళనిస్వామి లేఖలో కోరారు. తమిళనాడులో ప్రస్తుతం 310 మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ ఖర్చవుతోందని తెలిపారు. కానీ కేంద్రం మాత్రం 220 మెట్రిక్‌ టన్నులు మాత్రమే కేటాయించిందన్నారు. శ్రీపెరంబదూర్‌ లో ఉత్పత్తి అవుతున్న 80 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ తెలుగు రాష్ట్రాలకు వెళ్లిపోతోందని సీఎం పళనిస్వామి లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement