Monday, February 19, 2024

Paddy Scame – బియ్యాన్ని మింగేస్తున్న …. మిల్ల‌ర్లా… మ‌జాకా?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో కస్టమ్‌ మిల్లింగ్‌ సిస్టమ్‌ అస్తవ్యస్తంగా మారుతోంది. తామే ప్రత్యామ్నాయ మన్న ధీమాతో రైస్‌ మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్నారు. చెమటోడ్చి కష్టపడ్డ రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రతియేటా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రైవేటు వ్యక్తులకు వరంగా మారుతున్నాయి. అంచనాకు మించి ఉత్పత్తి అయిన ధాన్యాన్ని నిల్వచేసే గిడ్డంగులు అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో రైస్‌ మిల్లర్లకు అప్పగించింది. ఇదే అదునుగా తెరవెనక చీకటి వ్యాపారానికి మిల్లుల యజమానులు అలవాటు పడ్డారు. గడిచిన నాలుగైదేళ్ళ కాలంగా జరుగు తున్న ఈ వ్యవహారం ఈ ఏడాది అధికార యంత్రాంగానికే సవాలుగా తయారైంది. అడిగిన సమయాల్లో, అవసరమైన సందర్భాల్లో బియ్యాన్ని సరఫరా చేయకుండా మిల్లర్లంతా ఏకమై పౌర సరఫరాల శాఖకు చుక్కలు చూపిస్తున్నారు.

పదుల సంఖ్యలో ఆర్థిక సంస్థల వద్ద అప్పులు చేసి మరీ ధాన్యం కొనుగోలు చేసిన కార్పొరేషన్‌ ఇప్పుడు బియ్యాన్ని అమ్మి చెల్లింపులు చేయాలనుకుంటే అది సాధ్యమయ్యే పనిగా కనిపించడంలేదు. అనధికార నోడల్‌ ఏజెన్సీగా నియమిస్తూ ఎలాంటి పూచీకత్తు లేకుండానే వేల కోట్ల రూపాయల విలువైన ధాన్యం నిల్వలను మిల్లర్లకు అప్పగించిన ప్రభుత్వం ఇప్పుడు అయోమయంలో పడింది. నిల్వ సామర్థ్యమే ప్రధాన సమస్యగా గడిచిన రెండేళ్ళ కాలంగా సకాలంలో కొనుగోలు చేయలేకపోయిన పౌర సరఫరాల సంస్థ, నిల్వలను మిల్లర్ల వద్దే ఉంచింది. ఇదే అదునుగా ఆ ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసిన యజమానులు యధేచ్చగా వ్యాపారం చేసి సంపాదించుకు న్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై ఇప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకోవాలో తెలియక సివిల్‌ సప్లయ్‌ కార్పొ రేషన్‌ అధికారులు అయోమయం చెందు తున్నారు. ఎన్నిసార్లు నోటీసులు పంపిం చినా.. కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)ను ప్రభుత్వానికి ఇవ్వడంలో మిల్లర్లు తాత్సారం చేస్తూనే ఉన్నారు.

రాష్ట్రంలో మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయడంలో అధికార యంత్రాంగం తీవ్రంగా విఫలమవుతోంది. సర్కారు ఇచ్చిన వడ్లను మిల్లర్లు మిల్లింగ్‌ చేసి అమ్ముకుని, తిరిగి ఇవ్వడానికి మాత్రం ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్నారు. దీంతో పౌర సరఫరాల శాఖ రూ.వేల కోట్ల అప్పులు చేసి వాటికి వడ్డీలు కట్టడానికి తంటాలు పడాల్సి వస్తోంది. మిల్లర్లు మాత్రం పైసా పెట్టుబడి లేకుండా అక్రమంగా కోట్లు- కొల్లగొడుతు న్నారు. కొన్ని జిల్లాల్లో అక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా స్థాయి అధికారులు మిల్లర్లతో కుమ్మక్కవడంతోనే ఈ వ్యవహారం కొనసాగుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మిల్లర్లలో అక్రమార్కులపై అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లవుతోంది. దీంతో ఏండ్ల తరబడి మిల్లింగ్‌, సరఫరాలో జాప్యం జరుగుతోంది. గత ఏడాది వానాకాలం, యాసంగి సీజన్‌లకు సంబంధించి వడ్లకు ఇప్పటి వరకూ మిల్లింగ్‌ పూర్తిచేయలేదు.

ప్రతి సీజన్‌లో పెద్దమొత్తంలో ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు కేటాయిస్తున్నా.. బియ్యం మాత్రం తిరిగి పౌరసరఫరాల శాఖకు చేరడం లేదు. దీనిని తీవ్రంగా పరిగణించాల్సి ఉన్నా.. అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు-గానే వ్యవహరిస్తున్నారు. ఒక సీజన్‌లో కేటాయించిన ధాన్యానికి సంబంధించిన బియ్యం ఇచ్చిన తర్వాతే.. మరో సీజన్‌లో కేటాయించాల్సి ఉంటు-ంది. కానీ, రైస్‌ మిల్లులకు కేటాయించిన ధాన్యం తిరిగి ఇవ్వకపోయినా.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయంగా మారింది.

ఎఫ్‌సీఐ వద్ద డిఫాల్టర్‌గా…
ఒకవైపు రైస్‌ మిల్లర్లు సతాయించడం, మరోవైపు సకాలంలో బియ్యాన్ని కేకరించి కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేయడంలో వైఫల్యం జరగడం.. తదితర కారణాల వల్ల తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎఫ్‌సీఐ వద్ధ డిఫాల్టర్‌గా మారింది. ఇంత జరుగుతున్నా మిల్లర్లు మాత్రం కిమ్మనడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మధ్యలో అధికారులు బలి!
క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రాజకీయ వ్యవస్థతో, జోక్యంతో ముడిపెట్టుకుని ఉన్న రైస్‌ మిల్లింగ్‌ వ్యవహారం నిరాటంకంగా సాగుతూనే ఉంది. పైస్థాయి నుంచి ఫోన్లు వస్తుండడంతో అధికారులు చేసేదేమీలేక మళ్లీ మళ్ళీ ధాన్యాన్ని వారికి అప్పగిస్తూనే ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement