Saturday, April 17, 2021

దేశంలో వ్యాక్సిన్ల‌ కొరత.. కేంద్రం మాటేంటి?

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజు లక్షకుపైగా కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా, మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తెలంగాణ, అంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రల్లో మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45 ఏళ్లుపై బడిన వారికి వాక్సిన్ వేస్తున్నారు. అయితే, కరోనా వ్యాక్సిన్‌పై రాజకీయ దుమారం రేగుతోంది. టీకా కొరతతో ఇబ్బందులు పడుతున్నామని మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాలుపై కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

కొన్ని చోట్ల ఇప్పటికే కోవిడ్ టీకా కేంద్రాలు మూతపడ్డాయి. మహారాష్ట్రలోని పన్వేల్, పుణె పరిధిలో పలు వ్యాక్సినేషన్ కేంద్రాలు మూతపడ్డాయి. వ్యాక్సిన్ వేసుకునేందుకు చాలా మంది ముందుకు వస్తున్నా.. టీకాలు అందుబాటులో లేవు. ప్రధాని సొంత నియోజవకర్గం అయిన వారణాసిలోనూ వ్యాక్సిన్ ల కొరత ఏర్పడింది. దీంతో 41 ఆస్పత్రులను మూసివేశారు. ఢిల్లీ శివారులోని ఘజియాబాద్, నోయిడాలోనూ పలు వ్యాక్సినేషన్ కేంద్రాలు మూతపడ్డాయి. వ్యాక్సిన్ కొరతతోనే మూసివేసినట్లు అధికారులు చెప్పారు. ఒడిశాలోనూ 600 వ్యాక్సిన్ కేంద్రాలను మూసివేశారు.

దేశంలో నమోదు అవుతున్న కొత్త కేసుల్లో అధిక శాతం మహారాష్ట్రకు చెందినవే ఉన్నాయి. మహారాష్ట్రలో రోజుకు 50- 60వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇండియాలో మరెక్కడా ఇన్ని కేసులు లేవు. ఈ క్రమంలో తమకే ఎక్కువ వ్యాక్సిన్‌లు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు గుప్పిస్తోంది. మహారాష్ట్రలో ప్రస్తుతం 14 లక్షల డోస్‌ల స్టాక్ మాత్రమే ఉందని.. మరో మూడు రోజుల్లో ఇదంతా అయిపోతుందని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్‌ల పంపిణీ నిలిచిపోవడంతో రాబోయే రోజుల్లో ఎవరికీ కరోనా వేసే పరిస్థితులు ఉండవని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు తమకు ప్రతి వారం 40 లక్షల డోసుల వ్యాక్సిన్‌లు కావాలని మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేష్ కేంద్రాన్ని కోరారు. ఇతర దేశాలకు ఎగుమతి చేసే బదులు మనదేశ ప్రజలకే వినియోగించాలన్నారు. కేంద్రం రాష్ట్రాలకు సహకరించడం లేదని ఆరోపించారు.

అయితే, రాష్ట్రాలు చేస్తున్న విమర్శలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తిప్పికొట్టారు. అన్ని రాష్ట్రాలకు అవసరమైన మేరకు టీకాలు పంపుతున్నామని.. ఎలాంటి పక్షపాతం లేదని స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో అనవసర రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. వారి దగ్గర స్టాక్‌ ఉన్నా..అయిపోతోందన్న ఆందోళనతో వారు కొరత ఉందని అంటున్నారని తెలిపారు. ఉత్పత్తిని బట్టి ఎప్పటికపుడు తాము పరిస్థితి అంచనా వేసి వ్యాక్సిన్‌ సరఫరా చేస్తున్నామని చెప్పారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో విఫలమైన మహారాష్ట్ర ప్రభుత్వం తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు టీకాల కొరత అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్, క్వారంటైన్‌పై రాష్ట్ర ప్రభుత్వం అసలు దృష్టి పెట్టడం లేదని హర్షవర్ధన్‌ మండిపడ్డారు.

18 ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలన్న డిమాండ్‌తో మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు కేంద్రాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నంచేస్తుంటే.. ఇప్పటివరకూ ఈ రెండు రాష్ట్రాలూ దాదాపు 80 శాతంమంది ఆరోగ్యకార్యకర్తలకు మొదటిడోసు మాత్రమే ఇవ్వగలిగిన విషయాన్ని కేంద్రమంత్రి గుర్తు చేస్తున్నారు. ఈ నెల 11 నుంచి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పనిప్రదేశాలకూ విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దానిని ఎదుర్కొనేందుకు వీలైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్‌ అందజేయాలన్నది కేంద్రం ఆలోచన. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ అందుతోంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News