Sunday, April 28, 2024

New Discovery – ప‌క్షుల మెద‌ళ్ల‌లోనే జిపిఎస్ ….

న్యూఢిల్లి : భూగ్రహ అయస్కాంత క్షేత్రం ప్రమాదకరమైన కాస్మిక్‌ కిరణాలు, సూర్యుడి నుంచి వెలువడే ప్లాస్మా నుంచి మానవాళిని రక్షిస్తుందని మనందరికి తెలిసిన సైన్స్‌. కానీ, ఈ అయస్కాంత క్షేత్రాన్ని కొన్ని జంతువులు, పక్షులు నావిగేషన్‌ కోసం వినియోగిస్తాయన్న విషయం కొందరికే తెలుసు. జీపీఎస్‌ వంటి నావిగేషన్‌ కోసం మూగ జీవులు అయస్కాంత క్షేత్రాన్ని వినూత్నంగా ఉపయోగిస్తాయి. వాటి మెదళ్లలో జీపీఎస్‌ అంతర్గతంగా నిర్మితమై ఉంటుంది. సులువుగా ఆన్‌, ఆఫ్‌ చేసుకునే సామర్థ్యం పక్షుల సహజ లక్షణం అని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా వలస పక్షులకు అయస్కాంత సమాచారాన్ని ప్రాసెస్‌ చేయగల సామర్థ్యం ఉన్నట్లు నిర్ధారణ అయింది. కెనడాలోని వెస్ట్రన్‌ అంటారియో విశ్వవిద్యాలయం, యూఎస్‌లోని బౌలింగ్‌ గ్రీన్‌ స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు భూ అయస్కాంత క్షేత్రాన్ని గుర్తించడానికి, ప్రాసెస్‌ చేయడానికి పక్షులు ఉపయోగించే మెదడులోని క్లస్టర్‌ ఎన్‌ అనే భాగంపై ప్రయోగాలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన పరిశోధన ఫలితాలను యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ న్యూరోసైన్స్‌లో ప్రచురించారు.

పక్షులు వలస వెళ్లడానికి ప్రేరేపణగా వాటి అయస్కాంత దిక్సూచిని ఉపయోగించినప్పుడు మాత్రమే ఈ క్లస్టర్‌ ఎన్‌ యాక్టివేట్‌ అవుతుంది. పక్షులు వాటి రెటీనాలో ఉన్న క్రిఎ్టోక్రోమ్‌లు అని పిలువబడే సున్నితమైన అయస్కాంత ప్రొటీన్‌ను సక్రియం చేసుకోవడం ద్వారా సెన్సింగ్‌, సిగ్నలింగ్‌ ప్రక్రియల్ని ప్రారంభిస్తాయి. ఈ ప్రక్రియ సుదూర ప్రాంతాలను నావిగేట్‌ చేయడానికి సహాయపడతాయని మునుపటి పరిశోధనలు వెల్లడించాయి. మడేలిన్‌ బ్రాడ్‌బెక్‌ బృందం తెల్ల గొంతు పిచ్చుకలపై తాజాగా అధ్యయనం చేసింది. పగటి పూట విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు క్లస్టర్‌ ఎన్‌ని స్విచ్‌ ఆఫ్‌ చేసుకుంటాయని, అలాగే రాత్రివేళ వలస వెళ్లే సమయంలో ఈ క్లస్టర్‌ని సక్రియం చేసుకుంటాయని గుర్తించారు. సాధారణంగా పక్షులు అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించవని శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. బదులుగా అవి సూర్యుడు, నక్షత్రాల నుంచి సంకేతాలు అందుకుంటాయనే భావన ఉంది. తాజా పరిశోధనలో ఇందుకు భిన్నంగా కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement