Sunday, May 5, 2024

ఎమ్మెల్యేల ఎర కేసు – ద‌ర్యాప్తు ఎలా…?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రధానప్రతినిధి: ఎమ్మెల్యేల ఎర కేసు కీలక మలుపులు తిరిగే అవకా శాలు కనిపిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన దస్త్రాలను(ఫైళ్లను) సీబీఐకి వెనువెంటనే అంద జేయాలని #హకోర్టు తీర్పు వెలువరించి పది రోజులు కావొస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవ డంతో ఫైళ్ళతో సంబంధం లేకుండానే నేరుగా కదన రంగంలోకి దిగాలని సీబీఐ నిర్ణయించినట్టు అత్యం త విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. విచారణ లో భాగంగా తమను భాజపా అధినాయకత్వం కొనుగోలుకు ప్రయత్నించారంటూ ఆరోపించిన నలుగురు భారాస శాసన సభ్యులకు నోటీసులు అందజేసి విచారణకు పిలవాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే ఎమ్మెల్యేల ఎర కేసు విచారణ దస్త్రాలు తమకు అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీబీఐ హదరాబాద్‌ ఎస్పీ ఐదు దఫాలు లేఖలు రాశారు. అయినా ఆమె నుంచి ఎటువంటి ప్రత్యుత్తరం రాకపోవడంతో తదుపరి చర్యలకు ఉపక్రమించాలని సీబీఐ ప్రతిపాదించినట్టు తెలు స్తోంది. ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫైళ్ళతో సంబంధం లేకుండా ముందుకు వెళ్లాలని సీబీఐ ఢిల్లిలోని ప్రధాన కార్యాలయం ఉన్నతాధికారులు మౌఖిక ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకటి రెండు రోజులు వేచి చూసి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రానిపక్షంలో దూకుడుగా వ్యవహరించాలని సీబీఐ అధికారులు నిర్ణయించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఢిల్లిdలోని ఉన్నతాధికారులకు తాజా పరిణామాలతో కూడిన నివేదికను పంపగా అక్కడి అధికారులు కేసుకు సంబంధించి న్యాయ సలహా తీసుకున్నారని, ప్రభుత్వం ఇచ్చే ఫైళ్ళతో పని లేకుండా విచారణను శీఘ్రతరం చేసేందుకు రాష్ట్ర సీబీఐ అధికారులు అనుమతి పొందినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు పైలట్‌ రోహత్‌ రెడ్డి(తాండూరు), గువ్వల బాలరాజు(అచ్చంపేట), బీరం #హర్షవర్దన్‌ రెడ్డి(కొల్లాపూర్‌), రేగా కాంతారావు(పినపాక)లను కొనుగోలు చేసేందుకు భాజపాకు చెందిన కీలక వ్యక్తులను ఇక్కడికి రప్పించి నలుగురు ఎమ్మెల్యేలు భారాసను వీడితే భారీఎత్తున ముడుపులు ఇస్తామని బేరసారాలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారమంతా తాండూరు ఎమ్మెల్యే రోహత్‌రెడ్డికి చెందిన మొయినాబాద్‌ వ్యవసాయ క్షేత్రంలో జరగగా ఈ విషయం సైబరాబాద్‌ పోలీసులకు ముందు ఉప్పందించడంతో ప్రజాప్రతినిధుల కొనుగోలు కోసం వచ్చిన రామచంద్ర భారతి బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం కేసు నమోదు చేసిన సంగతి విదితమే.

అయితే ఎమ్మెల్యేలకు ఎరవేసేందుకు వచ్చిన వారి కదలికలను రికార్డు చేసేందుకు రోహత్‌రెడ్డి తన వ్యవసాయ క్షేత్రం చుట్టూ, గదుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలుకు చెందిన అన్ని అంశాలను ఈ కెమెరాల్లో బంధించారు. అయితే ఈ కేసు అత్యంత కీలంకంగా భావించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఎర కేసును విచారించేందుకు హదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ సిీవీ ఆనంద్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని (సిట్‌)ఏర్పాటు చేశారు. ఈ విచారణ బృందంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులను, విచారణాధికారులను నియమించారు. విచారణ కీలకు దశకు చేరుకున్న సమయంలో భాజపాకు చెందిన నేతలు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం భారీ కుట్రకు పాల్పడిందని, ఈ కేసు పారదర్శకంగా విచారించాలంటే ప్రభుత్వం నియమించిన సిట్‌ను రద్దు చేసి సీబీఐకి అప్పగించాలని #హకోర్టు తలుపు తట్టారు. సుదీర్ఘ వాదనలు ప్రతివాదనల అనంతరం హకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఎమ్మెల్యేల ఎర కేసు విచారణ సీబీఐకి బదలాయిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లను సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ హకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ వ్యవహారంలో తాము ఏ మాత్రం జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు తెలంగాణ హకోర్టులో పిటిషన్‌ వేసి తమ వాదన వినిపించాలని సూచించింది. ఈ విషయంలో ప్రభుత్వం హకోర్టు తలుపులు తట్టినా సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పు అంతిమం అని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సీబీఐ విచారణకు సంబంధించి ఎటువంటి అపోహలున్నా, సమస్యలు ఉత్పన్నమైనా తమ దృష్టికి తీసుకురావాలని అయితే సీబీఐ విచారణకు సహకరించి ప్రభుత్వం ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన ఫైళ్లన్నింటిని సీబీఐకి ఇచ్చి కేసు తదుపరి విచారణకు సహకరించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
ఫైళ్లు ఇవ్వక పోయినా ఎఫ్‌ఐఆర్‌?
హైకోర్టు ఆదేశం మేరకు ప్రభుత్వం ఎమ్మెల్యేల ఎర కేసు విచారణ జరిపిన ఫైళ్లను ఇవ్వక పోయినా సీబీఐ ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ప్రభుత్వం ఫైళ్లు ఇస్తే సరేసరి లేని పక్షంలో చివరి అస్త్రాన్ని ప్రయోగించాలన్న పట్టుదలతో సీబీఐ ఉన్నట్టు చెబుతున్నారు. అవసరమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ పిటీషన్‌ దాఖలు చేయాలన్న అంశంపై కూడా సీబీఐ సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement