Thursday, April 18, 2024

పీయూష్ గోయల్ సర్పంచ్ గా కూడా పనికిరాడు: మంత్రి వేముల ఘాటు వ్యాఖ్య

తెలంగాణలో రైతులు బాగుపడితే బిజెపికి కండ్లు మండిపోతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో పండిన యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కేటీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో “నిరసన దీక్ష” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఎన్నో ప్రభుత్వాలు మారినా.. రాజ్యాంగ బద్దంగా కేంద్ర ప్రభుత్వమే వరి ధాన్యం సేకరిస్తుందని అన్నారు. రెండేళ్లుగా మోడీ కావాలని రాజకీయంగా ధాన్యం సేకరణలో వివక్ష చూపుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు కరెంట్ ఇబ్బందులు లేకుండా 28వేల కోట్ల విద్యుత్ లైన్లు,సబ్ స్టేషన్లు,ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. 24 గంటల కరెంట్ కోసం 10 వేల కోట్లు ఏడాదికి ఖర్చు చేస్తున్నారని చెప్పారు. రైతు బంధు ద్వారా ఏడాదికి రూ. 14 వేల కోట్లు ఇస్తున్నారని చెప్పారు. రైతులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చి వారి జీవితాల్లో ఆనందం నింపారని గుర్తు చేసారు. దీంతో రైతులంతా కేసీఆర్ వెంటే ఉంటున్నారని కక్ష్యపూరిత వైఖరితో కేంద్రం తెలంగాణలో యాసంగి వడ్లు కొనమనే డ్రామాకు తెరలేపిందని ఆరోపించారు.

తెలంగాణలో రైతులు బాగుపడితే బిజెపికి కండ్లు మండి రైతులను కేసీఆర్ నుండి దూరం చేసేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మెడలు వంచైనా కేంద్రంతో ధాన్యం కొనిపించే వరకు పోరాటం ఆపకూడదని పిలుపునిచ్చారు.ఇది తెలంగాణ రైతులకు జీవన్మరణ సమస్య కానుందన్నారు. ప్రతీ యాసంగి ఇదే సమస్య పునరావృతం అయ్యే ప్రమాదమున్నదని తెలిపారు. మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్తే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అవమానకరంగా మాట్లాడారని గుర్తు చేశారు. తెలంగాణ రైతులకు నూకలు అలవాటు చేయాలని కండకావరంతో మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీయూష్ గోయల్ ఆయన స్థాయి మరిచి ఫక్తు వ్యాపారవేత్తల వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఆయన కనీసం సర్పంచ్ పదవికి కూడా పనికిరాడని ఎద్దేవా చేశారు. కేంద్రం దురుద్దేశం సీఎం కేసీఆర్ ముందే గ్రహించి రైతులకు వరి వేయద్దని చెప్తే, రాష్ట్ర బిజెపి నేతలు రెచ్చగొట్టి వరి వేయించారని ఆరోపించారు. అపుడు మాట ఇచ్చిన బండి సంజయ్,కిషన్ రెడ్డి బిజెపి నేతలు ఇపుడు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. కేంద్రంతో వడ్లు కొనిపించాలని డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణకు ఒక్కరూపాయి ఇవ్వను అన్న కిరణ్ కుమార్ రెడ్డి కాలగర్భంలో కలిసినట్లు తెలంగాణ రైతుల ఉసురు తగిలి బిజెపి నేతలకు కూడా అదే గతే పడుతుందని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement