Monday, April 29, 2024

ధాన్యం కొనకపోతే కొట్లాడుడే: కేంద్రానికి పువ్వాడ హెచ్చరిక

రాష్ట్రంలో పండిన ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే కొట్లాట తప్పదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కేంద్రాన్ని హెచ్చరించారు. అన్నదాతల జీవన్మరణ సమస్యగా మారిన ధాన్యం కొనుగోలుకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో ఉద్యమానికి పూనుకున్నారని తెలిపారు. సోమవారం ఖమ్మం నియోజకవర్గంలోని మంచుకొండ గ్రామంలో జరిగిన రైతు నిరసన దీక్షలో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనం కోసం ఢిల్లీపై సీఎం కేసిఆర్ దండయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారని మంత్రి అన్నారు. నాడు ఉద్యమనేతగా సమైక్య రాష్ట్రంలో కర్షకుల ఆత్మహత్యలను కండ్లారా చూసి చలించిపోయిన కేసీఆర్‌.. నేడు ఆ దుస్థితి నుంచి బయట పడేసేందుకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడమే కాదు, రైతు బంధు, రైతు బీమా, 24గంటల ఉచిత నాణ్యమైన కరెంట్‌ ఎన్నో పథకాలతో ఏడేళ్ల కాలంలోనే తెలంగాణను దేశానికే అన్నం పెట్టే స్థితికి తీసుకొచ్చారన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. బీజేపీ నాయకులు తలా తోకా లేకుండా మాట్లాడుతుండగా, కేంద్రం రోజుకో కొర్రీ పెడుతూ ప్రస్తుత యాసంగి వడ్ల కొనుగోలుపై దాటవేస్తూ వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. దీనిపై తాడోపేడో తేల్చకపోతే అన్నదాతలు మరింత నష్టపోయే ప్రమాదమున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న పోరుబాటకు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు సీఎం వెంట ఉంటారని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement