Thursday, April 25, 2024

సింగపూర్ వేదిక‌గా వ‌ర‌ల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫ‌రెన్స్‌.. లోగో ఆవిష్క‌రించిన మంత్రి కేటీఆర్

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలంగాణ టెక్నాల‌జీ నిపుణులంద‌రినీ ఒక‌తాటిపైకి తెచ్చేందుకు సింగపూర్ వేదిక‌గా వ‌ర‌ల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫ‌రెన్స్ జ‌ర‌గ‌నుంది. తెలంగాణ ప్ర‌భుత్వం, తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) ఆధ్వ‌ర్యంలో 2023 ఏప్రిల్ లో దీన్ని సంయుక్తంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు వ‌ర‌ల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫ‌రెన్స్ (WTITC) లోగోను మంత్రి కేటీఆర్ ఇవ్వాల (ఆదివారం) టీహ‌బ్‌లో జ‌రిగిన కార్య‌క్రమంలో ఆవిష్క‌రించారు. సింగ‌పూర్ వేదిక‌గా ప్ర‌పంచంలోని తెలంగాణ టెక్కీలు ఒకే వేదిక‌పై రానున్న ఈ విశిష్ట స‌ద‌స్సులో టెక్నాల‌జీ ఎక్సేంజ్ , ఇన్నోవేష‌న్స్‌పై ప్ర‌ధానంగా దృష్టి సారించ‌నున్నారు. టీటా ద‌శాబ్ది వార్షికోత్స‌వాల్లో భాగంగా వ‌ర‌ల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫ‌రెన్స్ (WTITC) నిర్వ‌హ‌ణ‌కు ముందుకు వ‌చ్చిన టీటా చొర‌వ‌ను ప్ర‌శంసించిన మంత్రి కేటీఆర్ టీటా కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వ‌ర‌ల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హ‌ణ విజ‌య‌వంతంగా కావాల‌ని ఆకాంక్షించారు. అంత‌ర్జాతీయ స్థాయిలో టీటా ఇలాంటి మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు చేయాల‌ను కోరుకుంటున్నట్లు పేర్కొన్న మంత్రి కేటీఆర్ వాటికి ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు ఉంటుందని తెలిపారు. వ‌ర‌ల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హ‌ణ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ వ‌చ్చే అవకాశం ఉంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించే ఈ కాన్ఫ‌రెన్స్‌లో తెలుగు టెకీలు పాల్గొనాల‌ని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement