Friday, April 26, 2024

ముగిసిన మంత్రి కేటీఆర్ దావోస్ టూర్​.. తెలంగాణకు 4,200 కోట్ల పెట్టుబడులు

తెలంగాణ మంత్రి కే. తారకరామారావు వరల్డ్ ఎకనామిక్ ఫోరం పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈనెల 18 లండన్ కు చేరుకున్న ఆయన యూ కే తో పాటు స్విట్జర్లాండ్లోని దావోస్​లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అనేక ప్రముఖ కంపెనీల ప్రతినిధి బృందాలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. కాగా, తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలతో పాటు ప్రభుత్వ విధానాలను, పారిశ్రామిక విధానాలను వారికి వివరించారు. ఈ పర్యటనలో 45కంపెనీల ప్రతినిధి బృందాలతో సమావేశమయ్యారు కేటీఆర్. ఆయన కృషి ఫలితంగా సుమారు 4,200 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. ఈ మేరకు పలు కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలతో పాటు పెట్టుబడి ప్రకటనలను ప్రకటించాయి.

ఈసారి దేశం నుంచి దావోస్ లో పాల్గొన్న పలు రాష్ట్రాల పెవిలియన్ లతో పోల్చినపుడు తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశానికి చెందిన అనేక కంపెనీల ప్రతినిధులతో పాటు పలు అంతర్జాతీయ మల్టీ నేషనల్ కంపెనీల ప్రతినిధులు తెలంగాణ పెవిలియన్ ను ప్రశంసించారు. తెలంగాణ పెవీలియన్ మంత్రి కేటీఆర్ సమావేశాలతో పాటు పలు చర్చ గోష్ఠిలకి వేదికగా మారింది. ముఖ్యంగా మంత్రి కే. తారకరామారావు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ ప్రధాన సమావేశ మందిరం, ఇండియా పెవిలియన్, సిఐఐ పెవిలియన్ లలో జరిగిన చర్చలు, తెలంగాణ పెవిలియన్ లో జరిగిన ఫార్మా లైఫ్ సైన్స్, దేశంలోని ప్రముఖ యూనికార్న్ వ్యవస్థాపకులలో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. ఆయా చర్చల్లో మంత్రి కేటీఆర్ తన ప్రసంగాల్లో వెలిబుచ్చిన అభిప్రాయాలకు ప్రశంసలు లభించాయి.

ప్రపంచ వేదిక పైన తెలంగాణ ప్రభుత్వ విధానాలతో పాటు, పెట్టుబడి అవకాశాలను చాటడంలో ఈ పర్యటన ఎంతగానో దోహదపడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటన విజయవంతానికి కృషి చేసిన ప్రభుత్వ అధికారులు, పలు వ్యాపార వాణిజ్య సంస్థలు, ముఖ్యంగా యూకే, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన ఎన్నారైలకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

జ్యురిక్ నగరంలో ZF కంపెనీ తో భేటీ..
మంత్రి కేటీఆర్​ స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నగరంలో ZF కంపెనీతో సమావేశమయ్యారు. ZF కంపెనీ తెలంగాణలో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్న కార్యకలాపాలను విస్తరించనున్నట్లు తెలిపింది. సుమారు 3 వేల మంది ఉద్యోగులతో హైదరాబాద్లో అతిపెద్ద కార్యాలయంగా మారుతుందని ప్రకటించింది. తమ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 ప్రాంతాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నదని, అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రారంభించబోతున్న నూతన క్యాంపస్ తో తన అతిపెద్ద కార్యాలయంగా హైదరాబాద్ నగరం ఉండబోతుందని తెలిపింది. ఈ మేరకు జూన్ 1వ తేదీన తన కార్యాలయాన్ని నానక్​రామ్​ గూడలో ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ కి తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement