Friday, May 17, 2024

Minister Kishan Reddy: ఇదిగో.. తెలంగాణ‌కు ఇంత డ‌బ్బు తెచ్చాం…

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇదిగో తెలంగాణ‌కు ఇంత డ‌బ్బు తెచ్చామంటూ ‘‘రిపోర్టు టూ పీపుల్‌’’ పేరుతో వివరించారు. కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, తద్వారా తెలంగాణ ప్రజలకు చేకూరిన లబ్ధి గురించి ఆయన వివరించారు. ఈసంద‌ర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఇది రాజకీయ పార్టీ కార్యక్రమం కాదన్నారు. గత 9 ఏళ్లుగా తెలంగాణకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలను తెలియజేయడమే ఈ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఉద్దేశ్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా, ఏజెన్సీల ద్వారా ఎంత అప్పులు ఇచ్చామో ప్రజల ముందు పెడుతున్నట్లు చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోడీ సర్కార్‌ నిరంతరం సహకరించిందని కిషన్‌ రెడ్డి తెలిపారు. గతంతో పోలిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల శాతం పెరిగిందన్నారు. రాష్ట్రాలకు సంపూర్ణ సహకారంలో భాగంగా తెలంగాణకు కేంద్రం రూ. 1.78 లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పారు. రోడ్ల కోసం రూ.1.08 లక్షల కోట్లు, రైల్వేల కోసం రూ. 32,823 కోట్లు కేటాయించిందని చెప్పారు.

ప్రస్తుతం దేశంలో నడుస్తున్న 18 వందేభారత్ రైళ్లలో రెండు తెలంగాణలో నడుస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో అనేక రైల్వే స్టేషన్ల అబివృద్ధి చేస్తున్నామని చెప్పారు. భూ సేకరణ కారణంగా వరంగల్, కొత్తగూడెం విమానాశ్రయాల ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. 2014 తర్వాత తెలంగాణలో 11 సాగునీటి ప్రాజెక్ట్ లకు ప్రత్యేక నిధులను కేంద్రం మంజూరు చేసిందని చెప్పారు. రోడ్ల నిర్మాణంలో గుజరాత్ కంటే తెలంగాణకే ఎక్కువ నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ప్రారంభించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వని కారణంగా ఎంఎంటీఎస్ రెండవ దశ చాలా రోజులు ఆలస్యమైంద‌ని చెప్పారు. చివరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం ఖర్చు భరించనుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొంత భూమి ఇవ్వాల్సి ఉందని తెలిపారు. కాజీపేటలో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి కేంద్రం అనుమతి ఇచ్చిందని.. త్వరలోనే పనులు ప్రారంభమ‌వుతాయని చెప్పారు. దీంతో 3వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement