Friday, May 10, 2024

మెట్రో వేళల్లో మార్పులు.. లాస్ట్ రైలు ఎప్పుడంటే?

కరోనా ఉద్ధృతితో తెలంగాణ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్న నేపథ్యంలో మెట్రో రైలు సర్వీసు వేళల్లో మార్పులు చేశారు. కర్ఫ్యూ అమల్లోకి ఉండటంతో రాత్రి 7.40 గంటల వరకే మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని.. అవి గమ్యస్థానాలకు రాత్రి 8.45 గంటల్లోపు చేరుకుంటాయని మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి ప్రకటించారు. ప్రతి రోజూ ఉదయం ఎప్పటిలాగే 6.30గంటలకు తిరిగి సర్వీసులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ప్రయాణికులు మాస్కు, శానిటైజర్లు వాడాలని మెట్రో సూచించారు. కోవిడ్ 19 సేఫ్టీ గైడ్‌లైన్స్ ప్రకారం భౌతిక దూరం పాటించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు అందుబాటులో ఉంచామని ఎన్‌వీఎస్‌ రెడ్డి తెలిపారు. 

కాగా, లాక్‌ డౌన్ తర్వాత క్రమంగా ప్రయాణికులను పెంచుకుంటూ వస్తోంది. రోజుకు 2లక్షల వరకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేలా చర్యలు చేపట్టింది. మెట్రోలో పాటిస్తున్న రక్షణ చర్యలపై ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేయడంతో వేసవి సీజన్‌లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని ఎల్‌ అండ్‌ టీ మెట్రో ఆశలు పెట్టుకుంది. సరిగ్గా ఇదే సమయంలో కరోనా సెకండ్ వేవ్ నగరాన్ని చుట్టేసింది. ప్రజలు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను అమలు చేయనుంది. నేటి నుంచి మే 1 వరకు నైట్‌ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. అత్యసవర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిస్తున్నట్లు తెలిపింది. ఇక రాత్రి 8 గంటల వరకే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్స్‌ నిర్వహణకు అనుమతినిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement