Sunday, May 5, 2024

Special Story: తెలంగాణ కుంభమేళా- మేడారం మహా జాతర

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేర్కొనబడిన మేడారం సమ్మక్క -సారలమ్మ జాతర. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ పౌర్ణమి రోజుల్లో ఈ జాతర జరగనుంది. ఈ జాతర ఆసియాలోనే జరిగే అతి పెద్ద జాతర. మేడారం జాతర దశాబ్దాల కాలం నుండి బుధ ,గురు, శుక్ర వారాల్లో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నఆచారం. హనుమకొండ జిల్లాకు 110 కిలోమీటర్ల దూరంలో మేడారం అనే గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. ఈ జాతరను తెలంగాణ మహా కుంభమేళగా అభివర్ణిస్తారు. ఈ మహా జాతరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్ఘడ్ లో నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

జాతర పూర్తిగా భిన్న సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనంగా కనిపిస్తుంది. గిరిజనులు, ఆదివాసీలు, ఆదీవాసేతరులు, ప్రకృతి జీవన విధానాలను ఈ జాతరలో తెలుసుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ జాతర మినీ భారతాన్ని ఆవిష్కరిస్తుంది. జాతర పూర్తిగా ఆదివాసి సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది. వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తరతరాల నుండి వస్తున్న ఆచారాలకు లోటు రాకుండా సమ్మక్క సారలమ్మ కొలవడం జరుగుతుంది. జాతరలో కోటి యాభై లక్షల మందికి పైగా ఆదివాసి, ఆదివాసి ఇతరులు ఒక దగ్గరకు చేరి మొక్కులు చెల్లించుకుంటారు. మేడారంకి వచ్చే భక్తులు జంపన్నవాగులో స్నానాలు చేసి దర్శనానికి వెళ్తారు. జంపన్నవాగులో స్నానాలు చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. వాగు ఒడ్డున తల నీలాలు సమర్పించడం సంప్రదాయం.

కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పరిపాలించిన కాలంలో గిరిజనులు స్వేచ్చా స్వాతంత్య్రాల కొరకు పోరాటం చేసి తమ ప్రాణాలను ఫణంగా పెట్టి గిరిజనుల హక్కులను కాపాడిన వీరవనితలుగా సమ్మక్క-సారలమ్మలు.. చరిత్రలో గుర్తింపు పొందారు. కాకతీయుల పరిపాలన కాలం క్రీ.శ 1000-1323 వరకు పరిపాలించిన కాకతీయ రాజులు.. తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఏకం చేసి మూడు వందల సంవత్సరాలు పరిపాలించిన ఘనత కాకతీయులకు చెందుతుంది. తెలుగు జాతి చరిత్రలో కాకతీయ సామ్రాజ్యాన్ని స్వర్ణ యుగంగాను,మహోజ్వలఘట్టం గాను పేర్కొంటారు. అలాంటి కాకతీయుల ఆగ్రహానికి మేడారం సామంత రాజుల బలయ్యారు.

మేడారాన్ని పాలించే కోయరాజు “పగిడిద్దరాజు” కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు. అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కాని సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది.ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది, వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాప రుద్రుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కానీ ఆ ప్రాంతములో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి జాతరను జరుపుకుంటున్నారు.

జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగి పోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యద స్థానానికి తరలిస్తారు. మేడారంలో ఈ తల్లి బిడ్డల విగ్రహాలు లేని ఆదివాసి జాతర ఎంతో గొప్పదని చెప్పవచ్చును. ఈ జాతరలో భక్తులు బెల్లాన్ని( బంగారాన్ని) నైవేద్యంగా భక్తిశ్రద్ధలతో సమర్పిస్తారు.బెల్లాన్ని బంగారాన్ని నైవేద్యంగా పెడితే అమ్మవారు వారి కోరికలు తీరుస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తులు నిలువెత్తు బంగారాన్ని సమర్పించడం బంగారంతో పాటు పసుపు, కుంకుమ ,చీర ,సారలను సమర్పించేందుకు పోటీపడతారు. భక్తులు, అధికార యంత్రాంగం మధుర జ్ఞాపకాలతో తిరుగు ప్రయాణం అవుతారు. కేవలం జాతర సమయంలోనే కాకుండా ప్రతిరోజు భక్తులతో కిటకిటలాడే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.. జాతీయ స్థాయి జాతరగా గుర్తింపు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు జాతరలకు 332 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ సంవత్సరం 750 కోట్ల రూపాయలును రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయగా, జాతర కోసం చేపట్టిన పనులలో ఇప్పటికే 90 శాతం పూర్తి అయ్యాయి. ఈ సారి శాశ్వత నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారు. గత జాతరలో 4 రోజుల్లో ఒక కోటి రెండు లక్షల మంది భక్తులు జాతర ను సందర్శించారని అధికారులు తెలిపారు. జాతరకు ముందుగానే భక్తులు ముందు నుంచే లక్షల్లో సందర్శిస్తున్నారు. ములుగు జిల్లా యంత్రాగం జాతర పటిష్ట నిర్వహణ కోసం మొత్తం ప్రాంతాన్ని 8 జోన్లుగా, 34 సెక్టర్లుగా విభజించారు. 1100 ఎకరాల్లో 30 పార్కింగ్ కేంద్రాలు,10,300 మంది పోలీస్ సిబ్బంది పహారా కాస్తారు. ప్రతి 4 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంప్, పస్రా నుంచి ప్రతి 2 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంప్, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.జాతరలో భక్తుల ఆరోగ్య పరిరక్షణ కోసం 50 బెడ్లతో సమ్మక్క – సారలమ్మ వైద్యశాల ఏర్పాటు చేశారు. భక్తుల రవాణా సదుపాయాల కొసం 3,845 బస్సులు ఏర్పాటు చేశారు. జాతరలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని మంత్రుల బృందం ప్రారంభించింది. ముఖ్యమైన శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి భక్తులకు ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రభుత్వం ఈసారి జాతరను“ప్లాస్టిక్ రహిత జాతర నిర్వహించేందుకు పలు చర్యలు చేపడుతుంది.

వరంగల్ ఉమ్మడి జిల్లా కు చెందిన సుమారు వెయ్యి మందికిపైగా అధికారులకు విధుల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఇందులో నియమింపబడిన అధికారులు అందరూ గతంలో మేడారం జాతరలో పని చేసిన అనుభవం ఉన్న వారినే నియమించారు. సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో పనిచేసే అవకాశాన్ని అదృష్టంగా జిల్లా అధికారులు భావించి సేవలు అందిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే జాతర జరిగే మేడారంకి కారుణ్యంతో భక్తులకు ఆధునిక ప్రపంచంలో ఉంటే సకల సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి వారికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు ఇనుమడించేల రాష్ట్ర ప్రభుత్వం జాతర నిర్వహణకు చర్యలు తీసుకుంటుంది. దీని కొరకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయవలసిన అవసరం ఉంది. భక్తితో పాటు విందు,వినోదాలు కలిగిన సంస్కృతి మేడారం జాతర ప్రత్యేకత. ఈ జాతర జరిగే నాలుగు రోజులు ప్రజలు భక్తిపారవశ్యంతో మునిగి తేలుతారు. కోరిన కోరికలు తీర్చే దయగల తల్లులని భక్తులు తమ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు. సమ్మక్క సారలమ్మ లైన్లో నిల్చొని గద్దెలను దర్శించుకుంటారు. ముఖ్యంగా మొదట మొక్కుల తల్లి “సమ్మక్క కు వెళ్లేదారిలో గట్టమ్మ” కొలువై ఉంటుంది. గట్టమ్మను దర్శించుకున్న తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తరలివెళ్లడం జరుగుతుంది. ఇది గత కొన్ని దశాబ్దాలుగా వస్తున్న ఆచారం అని చెప్పవచ్చు. 1996లో రాష్ట్ర ఉత్సవంగా గుర్తింపు పొందిన మేడారం జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి అద్భుతంగా కొనసాగుతుంది. ఈ జాతరకు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు జాతరలో పాల్గొనడం గొప్ప విశేషం..

మనదేశములో లెక్కలేనన్ని జాతరలు జరుగుతూ ఉన్నప్పటికినీ మేడారం జాతర ప్రత్యేకతనే వేరు. రెండేళ్ళకోసారి జరిగే ఈ ఉత్సవంను తిలకించేందుకు ఎందరో భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకొనేందుకు దేశనలుమూలల నుంచి భక్తులు రావడం ఆనవాయితి. ఆ భక్తులను నిరుత్సాహపరచకూడదనే ఉద్దేశ్యంతో పాటు ,భక్తుల మనోభావాలను గౌరవిస్తూప్రభుత్వం జాతరను నిర్వహిస్తుంది. గత రెండు సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసిరింది. ఫస్ట్ వేవ్ ,సెకండ్ వేవ్ లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితంగా కరోనా వైరస్ ను నియంత్రించగలిగారు. ప్రస్తుతం ప్రాణాంతక కరోనా, ఒమిక్రాన్ లు స్వైరవిహారం చేస్తున్న నేపథ్యంలో భక్తుల సంరక్షణ ప్రభుత్వానికి కత్తి మీద సాములా పరిణమించింది. ఇందుకుగాను ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపట్టింది. అయినప్పటికీ ప్రజలు ఎవరికివారు భాద్యతయుతంగా స్వీయరక్షణ చర్యలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. ఈ జాతర నిస్సందేహంగా భక్తుల ఆధ్యాత్మిక యాత్ర.

Advertisement

తాజా వార్తలు

Advertisement