Sunday, May 5, 2024

Train Accident | వాస్తవాలు దాచేందుకు సీబీఐ డ్రామా.. రైలు ప్రమాదంపై నిజాలు తెలియాలి: మమతా

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదానికి గల కారణాలను దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని, బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నందున లోపాలను కప్పి పుచ్చుకోవడానికి కేంద్రం సీబీఐని వాడుకుంటోంది బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే, దీనికి గల కారణాలను తెలయజేయకుండా.. లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సర్వం కోల్పోయిన కుటుంబాలు ఇప్పుడు సమాధానాలు కావాలని కోరుకుంటున్నాయి. నిజమైన సమాచారం ఏంటో బయటకు రావాలి అని మమత మండిపడ్డారు.

ప్రమాదం ఎందుకు జరిగింది? ఇంత మంది ఎలా చనిపోయారు? అన్నదానిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని, ఇది ఈ శతాబ్దపు అతిపెద్ద ప్రమాద ఘటనగా మమతా చెప్పారు. దీనిపై సీబీఐ ఏం చేస్తుంది? క్రిమినల్ కేసు అయితే, సీబీఐ ఏదైనా చేయగలదు. మనం ఇంతకుముందు చూశాం కదా.. పుల్వామా ఘటన విషయంలో ఏం జరిగిందో దేశమంతా తెలుసు. అప్పటి గవర్నర్‌ను ఏం చేశారన్నది? కళ్లారా చూశాం.. అంటూ మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జూన్ 2న జరిగిన మూడు రైళ్లు గుద్దుకున్న ప్రమాదంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేస్తోంది. అయితే.. అసలు ప్రమాదంపై దర్యాప్తు జరగడం లేదని, ఇక్కడ ప్రతిదీ క్లియర్ చేస్తున్నారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా చేస్తున్నారని, అసలు నిజం బయటకు రావాలని తాను కోరుకుంటున్నా అన్నారు. ఈ ప్రమాదంలో 288 మంది మరణించారు. బాధితుల్లో ఎక్కువ మంది హౌరాలోని షాలిమార్ స్టేషన్‌లో రైలు ఎక్కిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారే ఉన్నారని సీఎం మమతా చెప్పారు. ప్రమాదంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన 103 మంది చనిపోయారని, మరో 40-50 మంది గల్లంతయ్యారని మమతా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement