Wednesday, May 1, 2024

మహారాష్ట్రలో కరోనా కాటు!

దేశంవ్యాప్తంగా కరోనా మహమ్మారి అలజడి సృష్టిస్తోంది. రోజు రోజుకు కరోనా బాధిత సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 81,466 కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు మహారాష్ట్రలో సెకండ్‌ వేవ్‌ అల్లకల్లోలం రేపుతోంది. కొత్త కేసులు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 43,183 పాజిటివ్ కేసులు నమోదు కాగా… మరో 249 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 28,56,163కు చేరుకుంది. ఇప్పటి వరకు కరోనాతో 54,898 మంది మృతి చెందారు.

ఇక, ముంబైలో 8,646 కరోనా కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 3.6 లక్షలు దాటింది. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో లాక్‌డౌన్‌ దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. పూర్తి స్థాయిలో కాకుండా పాక్షికంగా లాక్‌డౌన్‌ విధించాలని భావిస్తోంది. ఇప్పటికే పలు నగరాల్లో పాక్షికంగా లాక్ డౌన్ అమలు చేస్తోంది. కరోనా ఉద్ధృతిపై సీఎం ఉద్దవ్ ఠాక్రే ఈ రోజు అధికారులతో ఉన్నతస్థాయి  సమావేశం నిర్వహించనున్నారు. కరోనా నియంత్రణ చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు కరోనా కొత్త నిబంధనలను మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పట్టణాల్లో 5 కేసులు, గ్రామీణ ప్రాంతాల్లో 15 కేసులు నమోదు అయితే.. వెంటనే వాటిని కంటెన్ మెంట్ జోన్ గా ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశిచింది. ప్రజలు తప్పని సరిగా మాస్కలు ధరించాలని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement