Tuesday, April 30, 2024

500 కోట్ల పెట్టుబడులతో తెలంగాణకు లులూ గ్రూప్​.. మంత్రి కేటీఆర్​తో భేటీలో ఒప్పందం

తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు లూలు గ్రూప్ ముందుకు వచ్చింది. ఈ మేరకు దావోస్ లో మంత్రి కేటీఆర్ తో సంస్థ అధిపతి యూసుఫ్ అలీతో జరిగిన సమావేశంలో ఈ పెట్టుబడిని ప్రకటించింది. 500 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపారు. సంస్థ ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు తెలంగాణ ప్రభుత్వం తరఫున అవసరమైన అనుమతి పత్రాలను యూసుఫ్ అలీ కి మంత్రి కేటీఆర్ అందించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి తెలంగాణలో మరో ప్రాంతంలోనూ తమ యూనిట్ ప్రారంభించే లక్ష్యంతో పని చేస్తున్నామని, ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు యూసుఫ్ అలీ తెలిపారు.

తమ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లకు సంబంధించి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని లులూ గ్రూప్​ కంపెనీ అధినేత తెలిపారు. తెలంగాణ ప్రాంతం నుంచి యూరప్ వంటి విదేశాలకు ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయిలో తమ యూనిట్ ఉండబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి అని, ఇక్కడ లూలు గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు , వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులకు డిమాండ్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పని చేస్తుందని, ఈ దిశగా లూలు గ్రూప్ అంతర్జాతీయ స్థాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు దోహదపడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఐదు వందలo కోట్ల భారీ పెట్టుబడి పెడుతున్న లూలూ గ్రూప్ కి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement