Thursday, April 25, 2024

Karnataka: లింగాయత్​ మఠాధిపతి సెక్స్​ స్కాండల్​.. రేపు భారీ ఊరేగింపు నిర్వహించనున్న స్వచ్ఛంద సంస్థ

కర్నాటక రాష్ట్రం చిత్రదుర్గ మురుఘా మఠం శివమూర్తి జరిపిన లైంగిక దాడులు, సెక్స్​ స్కాండల్​ని బయటపెట్టిన ఓడనాడి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మైనర్​ బాధితులకు సంఘీభావంగా రేపు (శనివారం) భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని, నిందితుడిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని కూడా ఈ ఊరేగింపు ద్వారా డిమాండ్​ చేయనున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఊరేగింపులో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని స్వచ్ఛంద సంస్థ ఓడనాడి వ్యవస్థాపకులు స్టాన్లీ, పరశులు శుక్రవారం కోరారు.

చిత్రదుర్గ నగరంలో ఊరేగింపు నిర్వహించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి మెమోరాండం సమర్పించనున్నట్టు వారు తెలిపారు. అయితే.. చిత్రదుర్గ మురుగ మఠం భక్తులతో ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు ముందస్తుగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. మురుగ మఠం సెక్స్ కుంభకోణం బహిర్గతమైన తర్వాత వందలాది మంది బాధితులు తమకు ఫోన్ చేసి తమ బాధలను చెప్పుకుంటున్నారని ఓడనాడి వ్యవస్థాపకులు స్టాన్లీ, పరశు తెలిపారు. 

సామాజిక, సాంస్కృతిక మార్పులకు ఇదే మంచి సమయమని.. మానవీయ విలువలను కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని వారు తెలిపారు. ఇక.. ఈ కేసులో నిందితుడు ప్రస్తుతం కటకటాల వెనుక ఉన్నాడు. మురుగ మఠంలోని ఒక శాఖకు చెందిన కొత్త పీఠాధిపతికి ప్రస్తుతం వ్యవహారాల బాధ్యతలు అప్పగించారు. మరోవైపు, నిందితుడి ఆరోగ్య స్థితికి సంబంధించి కోర్టును తప్పుదారి పట్టించడంపై లోకాయుక్తలో ఫిర్యాదు నమోదైంది.

కోర్టు అనుమతి లేకుండానే నిందితుడిని బెంగళూరుకు తరలించేందుకు యత్నించడంపై కోర్టు అభ్యంతరం తెలిపింఇ. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయమూర్తి అతడిని ఐసీయూ నుంచి కోర్టు ముందు హాజరుపరచాలని ప్రాసిక్యూషన్‌ను ఆదేశించారు. అతన్ని పోలీసు కస్టడీకి అప్పగించారు. బయటకు తరలించవద్దని, జిల్లాలో చికిత్స అందించాలని న్యాయమూర్తి అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement