Thursday, April 25, 2024

దోపిడీని అంతం చేద్దాం, ఊరూరా పీఎల్‌జీఏ వార్షికోత్స‌వాలు నిర్వ‌హించండి.. మావోయిస్టు నేత జ‌గ‌న్ పిలుపు

హిందూత్వ ఫాసిస్టు రాజ్యాన్ని నిర్మించడానికి బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూనుకుంటోంద‌ని, నిరంకుశ పాలనను కొనసాగిస్తుంద‌ని మావోయిస్టు నేత, తెలంగాణ అధికార ప్ర‌తినిధి జ‌గ‌న్ అన్నారు. ఈ మేర‌కు ఇవ్వాల మీడియాకు ఓ లేఖ విడుద‌ల చేశారు. దేశంలోని పిడికెడుమంది దోపిడీ వర్గాల ప్ర‌యోజ‌నం కోసం బీజేపీ ప‌నిచేస్తోంద‌ని మండిప‌డ్డారు. రాజకీయ బలహీనతతో సామ్రాజ్యవాద, పెట్టుబడి దారీ, దోపిడీ వ‌ర్గాల‌ పీడనలు ఎంత తీవ్రతరం అయితే.. ప్రజా జీవితం కూడా అంతే దర్భరమవుతుంద‌న్నారు. దీంతో ప్రజా పోరాటాలు వెల్లువెత్తడం తప్పనిసరి జరుగుతుందన్నారు. ఆ పోరాటాలు క్రమంగా ఒక నూతన సమాజం నిర్మాణం కోసం, సాయుధ పోరాటం వైపు త‌ప్ప‌కుండా మారాల్సి వ‌స్తుంద‌ని జ‌గ‌న్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం ఏర్పడి 22 ఏళ్లు నిండుతున్న సంద‌ర్భంగా డిసెంబర్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 22వ వార్షికోత్సవాలను తెలంగాణ‌లోని గ్రామాలు, పట్టణాల్లో ఉత్సాహంగా జ‌రుపుకోవాల‌ని, విప్లవోత్సహాతం, దృఢ సంకల్పంతో పీఎల్‌జీఏ (పీపుల్స్ లిబ‌రేష‌న్ గెరిల్లా ఆర్మీ) వార్షికోత్స‌వాలు ఘ‌నంగా జ‌ర‌పాల‌ని పార్టీ శ్రేణులకు, పీఎల్ ఏ యూనిట్లకు, విప్లవ ప్రజా నిర్మాణాలకు, ప్రజలకు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈమేర‌కు అధికార ప్రతినిధి జగన్ పేరిట ఓ లేఖ విడుద‌ల అయ్యింది.

ఈ ఏడాది విప్లవ ప్రతిఘాతుక ఫాసిస్టు సమాధాన్- ప్రహార్ దాడి మన పార్టీ, పీఎల్ ఏ, ప్రజలపై తీవ్రంగానే కొనసాగింద‌ని, ఈ దాడిని తిప్పికొట్టడానికి సాహసోపేతంగా ప్రతిఘటిస్తూ అనేక మంది వీర గెరిల్లాలు అమరులయ్యారని మావోయిస్టు లీడ‌ర్ జ‌గ‌న్ పేర్కొన్నారు. పీఎల్ ఏపై చేసినా దాడులలో శతృవు చేతిలో చిక్కి బూటకపు ఎన్ కౌంటర్లలో, విద్రోహుల చేత కొద్ది మంది అమరులు కాగా, మరి కొంత మంది అనారోగ్యాలతో చ‌నిపోయార‌న్నారు.

ఈ సంవత్సర కాలంలో దేశ వ్యాప్తంగా 130 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. ఇందులో 36 మంది మహిళలు ఉన్నారు. తెలంగాణలో కర్రె గుట్టపై తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు చేసినా దాడిలో కామ్రేడ్స్‌ శాంత, బుచ్చన్న, కైలాశ్, దామాల్, కల్లు, సంతోష్.. పెసల్ పాడు గ్రామం వద్ద కామ్రేడ్ వెన్నెలతో పాటు ఆరుగురు అమరులయ్యారు. అసువులు బాసిన వారంద‌రికీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున తలవంచి వినమ్రంగా జోహార్లు అర్పిస్తున్న‌ట్టు ఆ లేఖ‌లో పేర్కొన్నారు.

- Advertisement -

2022 నాటికి విప్లవోద్యమాన్ని సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో గడువు విధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాత్మక సమాధాన్ పేరుతో విప్లవ ప్రతిఘాతుక దాడిని ప్రారంభించి ప్రజాయుద్ధాన్ని నిర్మూలించలేకపోయాయ‌ని. విప్లవ ప్రతి ఘాతుక యుద్దాన్ని ఓడించడానికి ప్రజలు, మిలిషియా, పీఎల్ ఏ వీరోచితంగా ప్రజా యుద్దాన్ని కొనసాగిస్తూ శతృవు దాడిని తిప్పికొట్టడంలో సఫలమైన‌ట్టు తెలిపారు. దోపిడి పాలక వర్గాలకు సిపిఐ (మావోయిస్టు)ల‌ను నిర్మూలించాలనే లక్ష్యం కలగానే మిగిలింద‌ని, విప్లవోద్యమాన్ని సమూలంగా నిర్మూలిండం ఎన్నటికీ సాధ్యం కాదనే చారిత్రక సత్యాన్ని ప్రజలు అనేక సార్లు రుజువు చేస్తూనే వున్నార‌న్నారు.

ఈ ఏడు శతృవు దాడిని ఓడించడానికి దేశ వ్యాప్తంగా అనేక గెరిల్లా చర్యలు చేపట్టి విజయాలు సాధించామ‌ని, ప్రజలు, మిలిషియా. పీఎల్ ఏ కలిసి 200లకు పైగా గెరిల్లా చర్యలు చేప‌ట్టిన‌ట్టు లేఖలో పేర్కొన్నారు. ఈ చర్యల్లో 31 మంది పోలీసులను మ‌ట్టి క‌రిపించామ‌ని, 154 మందిని గాయాలు చేసి… ఆధునిక ఆయుధాలను స్వాధీన పరుచుకున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. వేలాదిగా మందుగుండు సామ‌గ్రిని కూడా స్వాధీన చేసుకున్నామ‌ని, 70కి పైగా ప్రజా హంతకులను, ప్రజా ద్రోహులను ఖతం చేసిన‌ట్టు వెల్ల‌డించారు.

ఇక‌.. గ్రామాలపై దాడులకు వస్తున్న పోలీసులను అడ్డుకోవడానికి వేలాదిగా స్పైక్ హెూల్స్ (కొయ బొంగలు), సాంప్రదాయక ట్రాప్‌ల‌ను పెట్టి అనేక మంది పోలీసులను గాయపర్చి ప్రజలు తమ గ్రామాలను కాపాడుకుంటున్నార‌ని, ఈ గెరిల్లా చర్యలన్ని త‌మ‌ పార్టీని, ప్రజలను, గ్రామాలను, ప్రజా సంఘాలను, ప్రజా పోరాటాలను, విప్లవ ప్రజా ప్రభుత్వాలను కాపాడుకోవడానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement