Friday, April 26, 2024

భాగ్య‌న‌గ‌రంపై కెటిఆర్ మార్క్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: భాగ్యనగరం విశ్వనగరంగా రూపాంతరం చెందుతోంది. ప్రత్యేక రాష్ట్రంలో ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. తెలంగాణ ఏర్పాటుతో హైదరాబాద్‌ బాగుపడదు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన నేతల ఇళ్లులే ఇప్పుడు ఇరుకుగా మారిపోయాయి. జూబ్లిహిల్స్‌, బంజారాహిల్స్‌ తప్పా మిగతా ప్రాం తాలు పెద్దగా అభివృద్ధి లేదన్న విధంగా 2014కు ముందు నగరంలో పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు సీన్‌ మారిపోయింది. ఎటూ చూసిన ఒకే విధంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. కొత్త ప్రాంతాలు ఇప్పుడు విశ్వనగరాల్లోని వసతులను కల్పించేలా మారిపోయాయి. హైదరా బాద్‌లో మెట్రో రాక ట్రాఫిక్‌ను భారీగా తగ్గించింది. వాహనాదారుల కష్టాలను తీర్చింది. శివారు ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రయాణాన్ని సులభతరం చేసింది. అటు ఐటీ ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగకరంగా మారింది. మొదట్లో కొంచెం అనుమానాలు వ్యక్తం అయినా ప్రస్తుతం మెట్రో ప్రయాణాన్ని నగర వాసులు ఇష్టపడుతున్నారు. ఉప్పల్‌, నాగోల్‌, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌ నగర్‌ లాంటి ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు మాదాపూర్‌, కొండాపూర్‌, మియాపూర్‌ లాంటి ఏరియాలకు సులభంగా ప్రయాణిస్తూ ఉద్యోగం చేసుకుంటున్నారు. తక్కువ టైమ్‌లో ప్రశాంతంగా ప్రయాణిస్తుండటాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. శంషాబాద్‌ ప్రాంతం నగరానికి శివారులో ఉంటుంది. ఔంటర్‌ రింగ్‌ రోడ్డుకు అనుకొని ఉంటుంది. కొన్ని ఏళ్ల వరకు శంషాబాద్‌ అంటే శివారు లాగానే ప్రజలు బావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. శంషాబాద్‌ సిటీలో భాగంగా కలిసిపోయినట్లుగా రూపురేఖలు మారిపోయాయి. కొత్తగా రాయదుర్గం నుంచి ఎయిర్‌ పోర్టుకు మెట్రో లైన్‌ రానుండటంతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రీసెంట్‌గా ఎల్బీ నగర్‌లో ఫ్లై ఓవర్‌ ఓపెనింగ్‌ సందర్భంగా మంత్రి కేటీఆర్‌.. ఎల్బీ నగర్‌ మెట్రోను హయత్‌ నగర్‌ వరకు విస్తరిస్తామని ప్రకటించారు. ఇదే ప్రాంతం నుంచి ఎయిర్‌ పోర్టుకు మరో లైన్‌ను తీసుకురానున్నట్లుగా స్పష్టం చేశారు. ఈ రెండు రూట్‌లలో మెట్రో పరుగులు పెట్టే అవకాశం ఉంది. దీంతో హయత్‌ నగర్‌, ఎల్బీ నగర్‌ నుంచి శంషాబాద్‌ ప్రాంతాలు మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్లనున్నాయి. వేగంగా డెవలప్‌మెంట్‌ జరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.

ట్రాఫిక్‌పై పనిచేసిన ఫ్లై ఓవర్ల ప్లాన్‌
మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో నగరంలో ట్రాఫిక్‌ తగ్గించేందుకు ప్రయత్నాలను చేశారు. కొన్ని వందల కోట్లు పెట్టి ఫ్లై ఓవర్లను నిర్మించారు. దాదాపు 32కు పైగా ఫ్లై ఓవర్లు పూర్తి అయ్యాయి. శిల్పా లే అవుట్‌, కేబుల్‌ బ్రిడ్జ్‌, ఎల్బీనగర్‌ ఫ్లై ఓవర్‌ లే కాకుండా ట్రాఫిక్‌ సమస్య ఎక్కువగా ఉన్న చోటల్లా మార్పులు చేశారు. ట్రాఫిక్‌ లేకుండా వాహనదారులకు ఇబ్బందులు రాకుండా అధికారులు.. పలు రూట్లలో మార్పులు చేశారు. సిగ్నల్‌ ఫ్రీ చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. డైవెర్షన్‌లు, యూటర్న్‌లు నగరంలో సక్సెస్‌ అయ్యాయి. అండర్‌ పాస్‌లు, కొత్త రూట్లలో రహదారులు అందుబాటులోకి తీసుకురావడం కూడా ఉపయోగపడింది. రోడ్ల విస్తరణతో నగరం రూపు రేఖలు చాలా వరకు మారిపోయాయి. మురుగు నీరు రోడ్లపై పారకుండా ఎప్పటికప్పుడు సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యాక నగరం విస్తరిస్తుందా.. నిదానిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కూకట్‌పల్లి నుంచి పటాన్‌చెరు వరకు కనిపిస్తున్న బిల్డింగులు, నివాస కేంద్రాలు ఉండేవి కావు. అటు ఉప్పల్‌, నాగోల్‌ ప్రాంతాలు అప్పుడప్పుడే నగరంలో పూర్తిగా కలుస్తున్నాయి. ఎల్బీనగర్‌ దాటితే.. అక్కడక్కడ కొన్ని నిర్మాణాలు ఉండేవి. కొండాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఈ ప్రాంతాలు నగరంలో ప్రధాన ఏరియాలుగా మారిపోయాయి. మౌలిక వసతులను కల్పిస్తూ అక్కడ అభివృద్ధి జరిగేలా మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో అధికారులు ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నారు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుండటంతో నగరం విస్తరిస్తూ పోయింది.

ఐటి కొలువుల‌కు నిల‌యం…
భాగ్యనగరంలో ఉద్యోగాల కల్పన అధికంగా ఉందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా ఐటీ కొలువులు ఎక్కువగా వస్తుండటంతో యువత నగరాన్ని శాశ్వత నివాస కేంద్రాలుగా మార్చుకుంటున్నారు. దేశంలోనే లక్షల కొద్దీ ఐటీ ఉద్యోగాలు నగరంలో ఉంటున్నాయి. దీంతో యువతీ, యువకలతో పాటు ఐటీ ఉద్యోగులు నగరానికి చేరుకుంటున్నారు. వీరంతా హైటెక్‌ సిటీకి ఒక 10 నుంచి 20 కిలోమీటర్లు లేదా ఒక గంట పాటు ప్రయాణం ఉండేలా చూసుకుంటున్నారు. వారికి సకల వసతులు ఉన్న ప్రాంతాలను ఎంచుకొని ఆయా ఏరియాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ రాష్ట్రానికి భారీగా ఐటీ పెట్టుబడులను ఆకర్షించడంతో తెలంగాణకు చెందిన ఎంతో మంది ఐటీ వైపు మళ్లారు. ఏపీకి చెందిన వాళ్లు కూడా హైదరాబాద్‌లోనే ఉండేందుకు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ వస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement