Sunday, April 28, 2024

‘భీమ్లా నాయక్’ తాట తీసిన మంత్రి కొడాలి నాని

పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాని ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందంటూ టీడీపీ సహా పలువురు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం భీమ్లానాయక్‌కు ప్రత్యేక షరతులు ఏం పెట్టలేదని, సినిమాలన్నింటికి ఒకే రకమైన షరతలుంటాయని స్పష్టం చేశారు. పుష్ప, అఖండ , బంగర్రాజు సినిమాలకు ఇవే నిబంధనలు ఉన్నాయని చెప్పారు. ఎవరి సినిమా అయినా ప్రభుత్వానికి ఒక్కటే అని, సీఎం జగన్ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అని పేర్కొన్నారు. సినిమాకో నిబంధన విధించే ప్రభుత్వం మాది కాదన్నారు.

సీఎం జగన్‌ దగ్గర చిరంజీవి విన్నపాన్ని ఉద్దేశించి పవన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. చిరంజీవి దండాలు పెడితే.. జగన్ ఇగో సంతృప్తి చెందుతుందని ఎలా అంటారు?అని ప్రశ్నించారు. సినీ పెద్దలతో సీఎంను కలిసేందుకు చిరంజీవి వచ్చారన్న మంత్రి కొడాలి… సినీ పరిశ్రమకు మేలు చేసేందుకు మీ సహాయం కావాలని కోరారని అన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డిని చిరంజీవి దండం పెట్టి కోరితే ఈ దుర్మార్గులు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌కు కుతంత్రాలు తెలీదన్నారు. సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించేందుకు స్వయంగా  చిరంజీవిని జగనే ఆహ్వానించారని గుర్తు చేశారు. జగన్ గౌరవించారని చిరంజీవి చెప్పిన విషయం పవన్ కల్యాణ్ కు తెలియదున్నారు.

సినీ పరిశ్రమ ఇలా ఉండడానికి చంద్రబాబే కారణమని కొడాలి నాని ఆరోపించారు. ప్రతి ఒక్కరిని గౌరవించే వ్యక్తి చిరంజీవి అని తెలిపారు. సీఎం అంటే రాష్ట్రానికి పెద్ద, సినిమా ఇండస్ట్రీకి తల్లిలాంటి వాళ్లు, ఆ ఉద్దేశంతోనే సీఎం జగన్ ను వినయంగా కోరారు అని చెప్పారు. పిల్లల్లో పిల్లాడిగా, పెద్దల్లో పెద్దవాడిగా చిరంజీవి ఉంటారన్నారు. అలాంటి వ్యక్తిని చంద్రబాబు కోసం సొంత తమ్ముడే అవమానిస్తారా? అని నిలదీశారు. తన కోసమే జీవో తేలేదని పవన్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఏం నష్టపోలేదన్న మంత్రి కొడాలి.. సినిమా ఆడినా ఆడకపోయినా పవన్ కు డబ్బులు వచ్చాయన్నారు. సినీ పరిశ్రమ తల్లిలాంటిదని పవన్ అంటారని, అలాంటి తల్లిని రాజకీయంగా ఎలా వాడుకుంటారని ప్రశ్నించారు. చంద్రబాబు దారిలోనే పవన్ నడుస్తున్నారన్నారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకునే దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. బ్లాక్‌ టికెట్ల పేరుతో దోచుకుంటామంటే కుదరదని స్పష్టం చేశారు.మీకు మీరుగా విడుదల చేసుకుని ప్రభుత్వంపై నిందలా..? అని ప్రశ్నించారు. జీఓ విడుదలకు సంబంధించి లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉందన్నారు. చిరంజీవిని కూడా పవన్ కల్యాణ్ విమర్శిస్తున్నారని చెప్పారు. చిరంజీవి, ఆయన సతీమణికి సీఎం దంపతులు భోజనం పెట్టి గౌరవించి పంపిన విషయం పవన్ కల్యాణ్ మరిచిపోయారా..? అని ప్రశ్నించారు. 420లు, పచ్చ బ్యాచ్‌ మరిచిపోతే మరిచిపోయి ఉండొచ్చు..పవన్ నీవు ఎలా మరిచిపోతావ్..? అని నిలదీశారు. చిరంజీవిని అనడానికి పవన్ కల్యాణ్ కు నోరు ఎలా వచ్చింది..? అని అడిగారు. పనికిరాని ఎల్లో బ్యాచ్, 420 గాళ్లతో కలిసి చిరంజీవిని అవమానించడానికి పవన్ నీకు మనసు ఎలా వచ్చింది..? అని మండిపడ్డారు. చిరంజీవిని సీఎం జగన్ ఎంతో గౌరవిస్తారని మంత్రి కొడాలి నాని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement