Friday, May 10, 2024

రైత‌న్న రుణ‌మాఫి స‌ర్దుబాటు – ఓ ర‌ణ‌మే.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఇప్పుడున్న పరిస్థితు ల్లో ఇటు కేసీఆర్‌ ప్రభుత్వానికి, అటు రైతాంగానికి అవశ్యంగా మారుతున్న రుణమాఫీ అంశంపై లోతుగా కసరత్తు జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ రూ.లక్ష వరకు పంట రుణాల మాఫీని ఇప్పటివరకు పూర్తిచేయలేదన్న ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టి, ఈ ఎన్నికల బహుమతి గా ఇవ్వాలనుకుంటున్న రూ.90 వేల వరకు రుణమాఫీని ఎలా అమలు చేయాలన్న కోణంలో సీఎం కేసీఆర్‌ మధోమథనం జరుపుతున్నారు. దాదాపు 70లక్షల రైతు కుటుంబాలతో ముడిపెట్టుకుని ఉన్న ఈ అంశంపై తొందరపాటు తగదని, అదే సమయంలో అమలు చేయక తప్పదని సీఎం కేసీఆర్‌ భావిస్తు న్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్నది దేశం హర్షించదగ్గ పథకాలే అయినా, నిధుల వ్యయం తడిసి మోపెడు అవుతుం డడంతో సర్దుబాటు సమస్య ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. ఇప్పటివరకు ఎన్ని రకాలుగా గ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చినా.. ఎన్నికల్లో ఏదో ఒక కొత్త తాయితం ఉంటే తప్ప ప్రజల్లోకి దూసుకుపోలేమన్నది కేసీఆర్‌ మనసులో మాట. మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా అదే. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి హరీష్‌రావు ప్రకటన విన్న రైతులంతా గంపెడాశతో ఉన్నారు.

సంక్షేమ పథకాల వ్యయం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో రూ.90 వేల లోపు రైతు రుణాల మాఫీ అమలు సాధ్యమేనా.. అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కానీ అమలు చేసి తీరుతామన్న పట్టుదల ప్రభుత్వంలో కనిపిస్తోంది. ఇదివరకు ప్రకటించిన రుణమాఫీ పథకంలో ఐదు విడతలుగా బ్యాంకులకు నిధులు విడుదల చేసి, అర్హులైన రైతులను రుణ విముక్తుల్ని చేయాలన్న లక్ష్యం 40శాతం మాత్రమే నెరవేరింది. మిగతా 60శాతం పూర్తి కావాలంటే ఇంకా రూ.12 వేల కోట్లకు పైగా నిధులివ్వాల్సి ఉంది. కొత్తగా అమలు చేయబోయే పథకానికి ఎంతలేదన్నా రూ.7 వేల కోట్ల వరకు నిధుల అవసరమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది రూ.90 వేల లోపు గల రైతుల పంట రుణాలను మాఫీ చేయనున్నట్టు- ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్వయంగా ప్రకటించారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.6,385 కోట్లు- కేటాయించారు. గత బడ్జెట్‌లో రైతు రుణమాఫీ కోసం రూ.4,000 కోట్లు- కేటాయించిన ప్రభుత్వం ఈసారి రూ.2,385 కోట్లు- అధికంగా కేటాయించింది.

మరోవైపు లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తామన్న సర్కారు ఇందుకు రూ.19,198 కోట్లు- లెక్కగట్టగా ఇప్పటివరకు రూ.37 వేల లోపు రుణాలున్న రైతులకు రూ.1,207 కోట్లు- మాత్రమే చెల్లించింది. ఇంకా రూ.17,991 కోట్లు- చెల్లించాల్సి ఉంటు-ందని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ పదవీ కాలం ఈ ఏడాదితో ముగుస్తుంది. కానీ రుణమాఫీకి ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో రూ.6,380 కోట్లే కేటాయించడంతో పూర్తిస్థాయిలో అమలు సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవు తోంది. అంటే అవసరమైన సొమ్ములో దాదాపు మూడో వంతు మాత్రమే కేటాయించారు. మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ.19,198.38 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 5.66 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయగా మరో 31 లక్షల మంది వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం.. పాతవి, కొత్తవి కలుపుకుని మొత్తంగా ఈ పథకానికి కావాల్సింది రూ.21,557 కోట్లు-. వెచ్చించింది మాత్రం రూ.1,206 కోట్లే. బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం రూ.6,385 కోట్లు-.. కాగా మిగతా రూ.13,966 కోట్ల విడుదల ఇప్పట్లో సాధ్యమా? అన్న సందేహం కనిపిస్తోంది. అయితే, ఈ ప్రశ్నకు సమాధానాన్ని సీఎం కేసీఆర్‌ త్వరలోనే ఇస్తారని పార్టీ వర్గాలు, కొందరు మంత్రులు, అనేక మంది ఎమ్మెల్యేలు ధీమాతో చెబుతున్నారు.

ఏదేమైనా క్షేత్రస్థాయిలో మాత్రం రుణమాఫీ పథకం అమలుపై అంతా అయోమయం నెలకొంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి చెబుతున్న లెక్కలకు.. వాస్తవ లెక్కలకు పొంతన కుదరడం లేదు. తాజా బడ్జెట్‌లో కేటాయించిన నిధులు రూ.90 వేల వరకు ఉన్న రుణాల మాఫీకి సరిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో 2023-24 బడ్జెట్‌లో రుణమాఫీకి రూ.20 వేల కోట్ల పైచిలుకు నిధులు కేటాయిస్తారని, నాలుగేళ్లుగా పెండింగ్‌ పడుతూ వస్తున్న రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తారని రైతులతోపాటు- వ్యవసాయ శాఖ అధికారులూ ఆశించారు. కానీ, తాజా బడ్జెట్‌లో రుణమాఫీకి రూ.6,385 కోట్లు- కేటాయించిన విషయం విదితమే. సాధారణంగా పంట రుణాలకు సంబం ధించి రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు తీసుకునే రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా రూ.37 వేల వరకు రుణమాఫీ ప్రక్రియ పూర్తికాగా, లబ్ధిపొందిన రైతుల సంఖ్య 5,42,609 మాత్రమే. ఇందుకోసం వెచ్చించింది కేవలం రూ.1,206 కోట్లేనన్నది వాస్తవం. వ్యవసాయ మంత్రి అసెంబ్లీలో వెల్లడించిన లెక్కల ప్రకారమే.. రుణమాఫీ పథకానికి రూ.21,557 కోట్లు- అవసరమవుతాయి. ఇందులో రూ.1,206 కోట్లు- మినహాయిసే,్త ఇంకా రూ.20,351 కోట్లు- కావాలి. ఈ బడ్జెట్‌లో కేటాయించిన నిధులను మినహాయిస్తే, ఇంకా రూ.13,966 కోట్లు- లోటు కనిపిస్తోంది.

- Advertisement -

అమలు చేయకుంటే తీవ్రమైన వ్యతిరేకత
ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రుణమాఫీ హామీని అమలు చేయకపోతే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనడంలో సందేహం లేదు. చివరి కేటగిరీలో ఉండే రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటు-ంది. గత టర్మ్‌లో రుణమాఫీ పొందిన రైతుల సంఖ్య 35.32 లక్షలు. ఆ లెక్కలనే పరిగణనలోకి తీసుకొని చూసినా… ఇప్పటికీ 30 లక్షల మంది పాత ఖాతాదారులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement