Sunday, May 19, 2024

Breaking: సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోత ప్రాజెక్టుల‌కు శంకుస్థాపన చేసిన కేసీఆర్‌

ప్రభ న్యూస్​ బ్యూరో, ఉమ్మడి మెదక్​: సింగూరు ప్రాజెక్టుపై నిర్మించ‌నున్న‌ సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులకు సీఎం కేసీఆర్ ఇవ్వాల శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా నారాయణఖేడ్‌ చేరుకున్న ముఖ్య‌మంత్రి అనంతరం ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్ర‌సంగించ‌నున్నారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావుతో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ నియోజ‌క‌వ‌ర్గాల‌ పరిధిలో 3.84 లక్షల వ్యవసాయ భూములకు సాగు నీరు అందనున్నది.

కాగా, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు కావాల్సిన సర్వే పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. డీపీఆర్ ఆధారంగా జిల్లా నీటిపారుదల శాఖ అంచనాలు తయారు చేసి పరిపాలన అనుమతులు పొందింది. ఇటీవల రాష్ట్ర కేబినెట్‌ సైతం పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సింగూరు ప్రాజెక్ట్ నుంచి 8 టీఎంసీల నీటిని ఎత్తిపోసి సాగునీరు అందించాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. కాల్వలు, పంప్ హౌస్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం కోసం భూ సేకరణ కొనసాగుతోంది.

4 నియోజకవర్గాల్లో 3.84లక్షల ఎకరాలకు నీళ్లు..
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా సింగారెడ్డి జిల్లావ్యాప్తంగా మొత్తం 3.84 లక్షల ఎకరాలకు నీరు అందనున్నది. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో 57వేల ఎకరాలు, జహీరాబాద్‌లో 1.06 లక్షల ఎకరాలు, అంధోల్‌లో 56వేల ఎకరాలు, నారాయణఖేడ్ సెగ్మెంట్​పరిధిలో 1.65 లక్షల ఎకరాలకు రెండు లిఫ్టుల ద్వారా సాగు నీరు అందనున్నది. కాళేశ్వరం నీటిని సింగూరుకు తరలించి అక్కడి నుంచి లిఫ్టుల ద్వారా 4 నియోజకవర్గాలకు నీరందించే పనులు జరగనున్నాయి. దీని కోసం ప్రభుత్వం రూ.4,427కోట్లు ఖర్చు చేయనున్నది.

నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండలం బోరంచ వద్ద బసవేశ్వర ఎత్తిపోతలు.. అంధోల్ నియోజకవర్గ పరిధిలోని రాయికోడ్ మండలం ఐదులాపూర్ వద్ద సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. వీటి ద్వారా సంగారెడ్డి, జహీరాబాద్, అంధోల్ ​నియోజకవర్గాల్లోని 12 మండలాల్లోని 231 గ్రామాలకు సాగునీరందనుంది. బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా నారాయణఖేడ్, అందోల్​నియోజకవర్గాల్లో ఎనిమిది మండలాల పరిధిలో ఉన్న 166 గ్రామాలకు నీరందనున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement