Saturday, April 27, 2024

ప్ర‌ధాని మోడీ జ‌న్ ధ‌న్ ఖాతాల‌కు బ్యాంకులు మంగ‌ళం…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: దాదాపు తొమ్మిదేళ్ళ క్రితం అద్భుతమైన ప్రాయోజిత పథకంగా పేరున్న ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన (పీఎంజేడీవై) పథకం క్రమక్రమంగా నిర్వీర్యమవుతోంది. 2014 ఆగస్టులో తన మాసన పుత్రికగా ఆవిష్కరించిన ఈ ప్రతిష్టాత్మక పథకం ఇప్పుడు జనాదరణ కోల్పోతోంది. ఏడాది కాలంగా ఆర్థిక లావాదేవీలు స్తంభించడంతో జన్‌ధన్‌ ఖాతాలన్నీ అప్రకటితంగా బ్యాంకులు మూసివేత కు సిద్ధపడుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా 52,23,218 పీఎంజేడీవై ఖాతాలున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 1,18,55,426 ఖాతాదారులున్నారు. వీటిలో 80శాతానికి పైగా ఖాతాల్లో ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయి చాలా కాలమైంది. బ్యాంకులు పలుసార్లు మెసేజ్‌ల రూపంలో అల్టిమేటం ఇచ్చినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. దీంతో మెజారిటీ ఖాతాలను బ్లాక్‌ లిస్టులో పెట్టేశారు.

2023 మార్చి నెల వరకు అందుబాటు-లో ఉన్న సమాచారం ప్రకారం, దేశంలో ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన బ్యాంకు ఖాతాల సంఖ్య 48.65 కోట్లు-. ప్రస్తుతం ఈ బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.1,98,844.34 కోట్లు- జమ అయ్యాయి. దాదాపు 4.03 కోట్ల ప్రధానమంత్రి జన్‌ ధన్‌ యోజన బ్యాంకు ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేదు. నో క్యాష్‌.. నో ట్రాన్సాక్షన్స్‌.. సాకుతో వివిధ జాతీయ, షెడ్యూల్‌ బ్యాంకులు ఇప్పటికే ఖాతాలను బ్లాక్‌ లిస్టులో పెట్టేశాయి. ఆర్థిక లావాదేవీలే ఆధారంగా ఖాతాల కొనసాగింపునకు బ్యాంకులు అల్టిమేటంతో సంప్రదించిన వారందరికీ సేవింగ్‌ ఖాతాలుగా మార్చుకోవాలని అధికారులు సెలవిస్తున్నారు. ఇది ప్రభుత్వాదేశాలు ఏమాత్రం కావని, స్తంభించిన ఖాతాలను సేవింగ్‌ కోసం మార్చుకోవాలని మౌఖిక సూచనలు మాత్రమేనని చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రుణ ఖాతాలు కావడంతో డబ్బులు జమ చేసేందుకు ఆసక్తి చూపని ఖాతాదారులు ఆశించిన ప్రయోజనాలేమీ కనిపించకపోవడంతో ఇక మాకొద్దులే.. అని వదిలేస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ ప్రతిష్టాత్మక పథకానికి రెండు కోణాల్లో ముప్పు వాటిల్లుతోంది. కేంద్రం ఆదరణ తగ్గిపోవడం ఒకటైతే.. ఖాతాదారుల్లో అవగాహన లోపం మరొకటిగా పీఎంజేడీవై పథకం నిర్వీర్యానికి గురవుతోంది.

బీమా క్లెయిమ్స్‌ పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం
ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం.. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో, ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన కింద 647 బీమా క్లెయిమ్‌లు కేంద్రానికి అందాయి. వాటిలో 329 క్లెయిమ్‌లను మాత్రమే పరిష్కరించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 341 క్లెయిమ్‌లు వచ్చాయి. వాటిలో 182 క్లెయిమ్స్‌ సెటిల్‌ చేయగా, 48 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన 111 క్లెయిమ్‌లు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాయో ప్రభుత్వానికి కూడా తెలియదు. సెటిల్‌ చేసిన క్లెయిమ్‌ల కోసం రూ.2.27 కోట్లు- చెల్లించారు. అదేవిధంగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 306 క్లెయిమ్‌లలో 147 క్లెయిమ్‌లను పరిష్కరించారు. 10 క్లెయిమ్‌లు తిరస్కరించారు. మిగిలిన 149 దరఖాస్తుల ప్రస్తుత పరిస్థితి ఏంటో గవర్నమెంట్‌ వారికి సైతం తెలియదు. గత ఆర్థిక సంవత్సరంలో సెటిల్‌ అయిన కేసుల కోసం రూ.1.88 కోట్లు- చెల్లించారు.

క్లెయిమ్స్‌ నిరాకరణ నిర్వీర్యానికి కారణం
పథకం కింద ఖాతాదార్లకు ప్రమాద బీమా రక్షణ లభిస్తుంది. గతంలో ఈ కవరేజీ రూ.1 లక్షగా ఉండగా, ఇప్పుడు రూ.2 లక్షలకు పెంచారు. ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ యోజన ఖాతాదార్లు బ్యాంక్‌ ఖాతాతో పాటు- రూపే డెబిట్‌ కార్డును పొందుతారు. ప్రమాద బీమా పరంగా ఇది చాలా ముఖ్యమైనది. ప్రమాదం జరిగిన రోజుకు ముందు 90 రోజుల లోపు, ఆ ఖాతాదారు తన రూపే కార్డును ఉపయోగించి ఏదైనా లావాదేవీ జరిపినట్లయితే, అతను మాత్రమే క్లెయిమ్‌ చేసుకోవడానికి అర్హుడు అన్న షరతు ఉంది. చాలా సందర్భాలలో క్లెయిమ్‌ తిరస్కరణకు ఈ షరతే కారణం.

- Advertisement -

అందరికీ బ్యాంకింగ్‌ సేవలే జన్‌ ధన్‌ లక్ష్యం
మోడీ ప్రభుత్వం ప్రకటించిన మొదటి పెద్ద పథకంగా ప్రధానమంత్రి జన్‌ ధన్‌ యోజనకు పేరుంది. దేశంలోని బ్యాంకింగ్‌ సేవలకు దూరంగా ఉన్న ప్రజలకు ఆ సౌకర్యాలను దగ్గర చేయడం దీని లక్ష్యం. 2014 ఆగస్టులో, తన మొదటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో జన్‌ ధన్‌ యోజన గురించి ప్రధాని నరేంద్ర మోడీ హింట్‌ ఇచ్చారు. ఆ తర్వాత, 28 ఆగస్టు 2014న ఈ పథకం ప్రారంభమైంది. ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ యోజన ఖాతాదార్లు బ్యాంక్‌ ఖాతాతో పాటు- రూపే డెబిట్‌ కార్డ్‌ను పొందుతారు. ప్రమాద బీమా పరంగా ఇది చాలా ముఖ్యమైనది.

ఖాతా ప్రయోజనాలెన్నో…
ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ యోజన పథకం కింద ఖాతాదారులకు ప్రతియేటా కేంద్ర ప్రభుత్వం రూ.10,000ని ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం కల్పించింది. ఈ సదుపాయం కింద, మీ ఖాతాలో ఒక్క రూపాయి లేకపోయినా కూడా మీరు రూ.10,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందు కోసం మీరు బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement