Friday, May 3, 2024

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆసుపత్రి ఒక్క‌ హిందువులకేనా? గడ్కరీని ప్రశ్నించిన రతన్ టాటా

ఆర్‌ఎస్‌ఎస్ హాస్పిట‌ల్ ఒక్క‌ హిందువులకేనా? అని ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రశ్నించారు. అయితే మతం ఆధారంగా ఆర్‌ఎస్‌ఎస్‌ వివక్ష చూపదని తాను చెప్పిన‌ట్టు గ‌డ్క‌రీ అన్నారు. మహారాష్ట్ర పూణేలోని సింహగడ్ ప్రాంతంలో స్వచ్ఛంద ఆసుపత్రిని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఇవ్వాల (గురువారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా గతంలో రతన్‌ టాటా, ఆయనకు మధ్య జరిగిన ఒక సంభాషణను గుర్తు చేశారు.

శివసేన-బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ఔరంగాబాద్‌లో దివంగత ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ కేబీ హెడ్గేవార్ ఆస్ప‌త్రిని రతన్‌ టాటాతో కలిసి ప్రారంభించానని నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఈ ఆసుపత్రి కేవలం హిందువులకేనా అని ఈ సందర్భంగా ఆయన తనను అడిగారన్నారు. అయితే మీరు ఎందుకు అలా అనుకున్నారు అని తాను అడిగినట్లు గడ్కరీ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందినది కావడంతో తనకు ఆ సందేహం కలిగిందని రతన్‌ టాటా వెంటనే బదులిచ్చారని అన్నారు.

అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ ఆసుపత్రి అన్ని వర్గాల కోసమని, ఆర్‌ఎస్‌ఎస్‌లో ఎలాంటి వివక్షలు ఉండవని తాను చెప్పానన్నారు. దీని గురించి మరింతగా వివరించడంతో రతన్‌ టాటా చాలా సంతోషించారని అప్ప‌ట్లో జ‌రిగిన స‌న్నివేశాన్ని నితిన్‌ గడ్కరీ గుర్తు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement