Friday, May 3, 2024

ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం.. ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న సీఎం

ఒంటిమిట్ట , (ప్ర‌భ న్యూస్‌) : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం క‌డ‌ప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాట్లు పూర్త‌య్యాయి. 15వ తేదీ శుక్రవారం సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్టు టీటీడీ ఈవో డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి తెలిపారు. ఒంటిమిట్టలోని రామాలయం, కల్యాణవేదిక వద్ద జరుగుతున్న పనులను ఈవో, కలెక్టర్‌ విజయరామరాజు, ఎస్పీ అన్భురాజన్‌తో కలిసి ఆయ‌న పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో జవహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సాంప్రదాయ బద్ధంగా ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి సమర్పించనున్నట్లు తెలిపారు.

కలెక్టర్‌, ఎస్పీల పర్యవేక్షణలో టిటిడిలోని అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయ‌న వివరించారు. సీతారాముల కల్యాణానికి విచ్చేసే భక్తుల కోసం సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. శోభాయమానంగా కల్యాణవేదిక తీర్చిదిద్దుతున్నామన్నారు. లక్ష మందికి పైగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండటంతో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భక్తులందరికీ అక్షింతలు, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement