Tuesday, April 30, 2024

వెనక్కి తగ్గేది లే.. మే 5 నుంచే ఇంటర్ పరీక్షలు

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నా.. ప్రభుత్వం మాత్రం పరీక్షలు నిర్వహణపైనే దృష్టి పెట్టింది. మే 5 నుంచి ఇంట‌ర్ ప‌రీక్షలు నిర్వహించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. మ‌రో రెండ్రోజుల్లో వెబ్‌ సైట్‌ లో ఇంట‌ర్ హాల్‌ టిక్కెట్లను అందుబాటులో ఉంచనున్నారు. కరోనా ప్రతాపం క్రమంలో పరీక్షలను వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీల నుంచి డిమాండ్లు వస్తున్నా.. పరీక్షలు నిర్వహించేందుకే ప్రభుత్వం ముందడుగు వేసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ప్రత్యేక కోవిడ్ ప్రొటోకాల్ ఆఫీసర్‌ ను నియమించనుంది. అలాగే ఐసోలేషన్ వార్డు ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు పరీక్షల కేంద్రాల వద్ద విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.పరీక్షలు జరిగే తేదీల్లో ఉదయం 6.30 గంటల నుంచి బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల‌ ఆర్టీసీ అధికారులకు క‌లెక్టర్ల నుంచి ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు జ‌రుగుతాయ‌ని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్ప‌ష్టం చేశారు. మే 5 నుంచి షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షల నిర్వహణ ఉంటుంద‌ని చెప్పారు. అన్ని జిల్లాల్లో అధికారులు కొవిడ్ పై జాగ్రత్తలు తీసుకొని పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు అనివార్యం అని గుర్తించాలన్నారు. మే 5 నుంచి 23 వరకు జరిగే పరీక్షలు కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పూర్తి చేస్తామ‌ని మంత్రి సురేష్ స్ప‌ష్టం చేశారు. కోవిడ్‌ మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద కోవిడ్‌ ప్రొటోకాల్‌ ఆఫీసర్‌ను నియమించినట్లు వివ‌రించారు.

కాగా, విద్యార్థుల భవిష్యత్‌ కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్‌ గురించి తన కంటే ఎవరూ ఎక్కువగా ఆలోచించరన్నారు. పరీక్షలు నిర్వహించకుండా సర్టిఫికెట్లలో కేవలం పాస్‌ అని ఇస్తే.. భవిష్యత్‌లో విద్యార్థులు నష్టపోతారన్నారు. పరీక్షలు నిర్వహించాలో వద్దో కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని జగన్ పేర్కొన్నారు. పాస్‌ సర్టిఫికెట్లతో విద్యార్థులకు మంచి సంస్థల్లో సీట్లు వస్తాయా? అని ప్రశ్నించారు. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై విమర్శలు చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణకు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం లేదన్నారు. పరీక్షలు రద్దు చేయాలని అడగడం సులభమే.. కానీ విద్యార్థులకే నష్టమని జగన్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement