Saturday, April 27, 2024

మెటర్నిటీకి బీమా భరోసా.. ఆర్థికంగా ఎంతో తోడ్పాటు

మాతృత్వం అనేది చాలా గొప్ప అనుభూతి. తల్లిదండ్రులు అవుతున్నప్పుడు కలిగే ఆనందం.. సంతృప్తి.. చెప్పాల్సిన అవసరం లేదు. దీనికితోడు మాతృత్వం అనేది గొప్ప బాధ్యత. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆరోగ్య సంరక్షణ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. డెలివరీ తరువాత ఈ ఖర్చులు మరింత పెరుగుతాయి. దీంతో తల్లిదండ్రులు అవడానికి ముందు సరైన ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఆర్థిక పరిస్థితుల గురించి చింతించకుండా.. అమ్మ అవడంలోని మాధుర్యాన్ని చవిచూడొచ్చు. ఆర్థిక ప్రణాళికలో ప్రధానంగా ఉండాల్సింది మెటర్నిటీ ఇన్సూరెన్స్‌. శిశు జననంలోని ఆర్థిక భారాన్ని తగ్గించడంలో ఇది ఎంతో తోడ్పాటును అందిస్తుంది. మెటర్నిటీ కవర్‌ అనేది బేస్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్యాకేజీలో భాగం. ప్రస్తుత కాలంలో ఇండియాలో ఇది ఒక స్టాండ్‌ అలోన్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ కాదు. అన్ని హెల్త్‌ ప్లాన్‌లు మెటర్నిటీ ప్రయోజనాలను అందజేయవు అనేది గమనించాలి. అందుకే.. మీరు బేస్‌ హెల్త్ ప్లాన్‌లోని షరతులను, నిబంధనలను క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది. సదరు ప్లాన్‌లో మెటర్నిటీ కవర్‌ ఉందా..? లేదా..? అన్నది అర్థం చేసుకోవాలి. రీటెయిల్‌ పాలసీలే గాక.. చాలా మట్టుకు గ్రూప్‌ మెడికల్‌ పాలసీలు కూడా మెటర్నిటీ ప్రయోజనాలను అందజేస్తాయి.

ప్రసవం ముందు ఖర్చులూ..

మెటర్నిటీ ఇన్సూరెన్స్‌ శిశు జననానికి సంబంధించిన అన్ని ఖర్చులనూ కవర్‌ చేస్తుంది. ఆస్పత్రిలో చేరడం, ఆస్పత్రికి సంబంధించిన వైద్య చికిత్స, ఇన్సూరెన్స్‌ చేయబడిన మహిళకు ప్రసవానికి ముందు, తరువాత అయ్యే ఖర్చులు కవర్‌ అవుతాయి. అదనంగా.. ప్రసవం తరువాత 90 రోజుల్లోగా జరిగే సమస్య ఏమైనా ఉంటే.. అవి కూడా కవర్‌ చేయబడుతాయి. ఈ కవర్‌, నార్మల్‌ (సాధారణ), సిజేరియన్‌ ప్రసవానికి కూడా లభ్యం అవుతాయి. వైద్య పరంగా సిఫార్సు చేయబడిన, చట్టబద్ధంగా జరిగిన గర్భ శ్రావానికి సంబంధించిన ఖర్చులను కూడా కవర్‌ చేస్తుంది. దీనికి అదనంగా న్యూ బార్న్‌ బేబీ (నవజాత శిశువు) కవర్‌ కూడా లభిస్తుంది. నవజాత శిశువుకు వైద్య చికిత్సకు సంబంధించిన ఖర్చులను ఇది కవర్‌ చేస్తుంది.

శిశువుకు సమస్యలు వచ్చినా..

ఒకవేళ జననం తరువాత ఏవైనా సమస్యలు వస్తే.. దానికి నవజాత శిశువును ఆస్పత్రిలో చేర్పించాల్సి వస్తే.. వాటికి అయ్యే ఖర్చులు కూడా ఇది కవర్‌ చేస్తుంది. ఈ కవర్‌ పుట్టుక నుంచి 90 రోజుల పాటు లభ్యం అవుతుంది. ఈ అవధి బీమా చేస్తున్న కంపెనీల మధ్య మారుతూ ఉండొచ్చు. కొన్ని ప్లాన్‌లు పాపాయికి 90 రోజుల వరకు తప్పనిసరి అయిన వ్యాక్సినేషన్లకు కూడా అయ్యే ఖర్చులను కవర్‌ చేస్తాయి. ఇండియన్‌ పీడియాట్రిక్‌ అసోసియేషన్‌ కూడా సిఫార్సు చేయబడిన, మెటర్నిటీ ఖర్చులు కవర్‌ చేయబడిన టెటానస్‌, హెపటైటిస్‌, మీజిల్స్‌, టైఫాయిడ్‌ మొదలైన వాటికి వ్యాక్సినేషన్లకు ఈ కవర్‌ లభ్యం అవుతుంది.

- Advertisement -

ఒక్కో కంపెనీలో.. ఒక్కో లిమిట్‌..

మెటర్నిటీ కవర్‌కి ఒక సబ్‌ లిమిట్‌ ఉంటుందని గమనించాలి. మీ బేస్‌ హెల్త్‌ ప్లాన్‌కు బీమా చేసిన మొత్తం రూ.5లక్షలు అయితే.. దాని అర్థం మెటర్నిటీ సంబంధిత ఖర్చులకు పూర్తి రూ.5లక్షలు మీకు ఉంటాయని కాదు. మెటర్నిటీ సబ్‌ లిమిట్‌ ప్రత్యేకించి.. మీ పాలసీ డాక్యుమెంట్లలో పేర్కొనబడుతుంది. మెటర్నిటీ వెయిటింగ్‌ పీరియడ్‌ క్లాజు ఉంటుంది. మీరు పాలసీ తీసుకున్న తరువాత కొంత కాలానికి ఒక క్లెయిమ్‌ను ఫైల్‌ చేయగలరు. ఈ వెయిటింగ్‌ పీరియడ్‌ వివిధ బీమా కంపెనీలకు, ప్రోడక్టులకు వేరుగా ఉంటాయి. సాధారణంగా ఈ వ్యవధి 9 నెలల నుంచి 8 ఏళ్ల వరకు ఉంటుంది. గ్రూప్‌ మెడికల్‌ పాలసీలు కూడా ఎటువంటి వెయిటింగ్‌ పీరియడ్‌ లేకుండా 1వ రోజు నుంచే మెటర్నిటీ కవర్‌ చేయవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement