Friday, May 3, 2024

Inivitation – ఎన్డీఎ స‌మావేశానికి జ‌న‌సేన‌కు ఆహ్వానం ..

న్యూఢిల్లి, ఆంధ్రప్రభ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డియే జులై 18న నిర్వహంచ తలపెట్టిన కీలక సమావేశానికి జనసేనాని ఆహ్వానం అందుకున్నారు. గతంలో ఎన్డియేలో భాగస్వాములుగా ఉండి దూరమైన రాజకీయ పార్టీలతోపాటు భావసారూప్యత కల్గిన పార్టీలను సమావేశానికి ఆహ్వానించిన బీజేపీ, కొంతమంది పాత మిత్రులకు మాత్రం ఇంకా ఆహ్వానం పంపలేదని తెలిసింది. అందులో తెలుగుదేశం పార్టీ ఉంది. కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం అందిందని, సమావేశంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొంటారని కూడా చర్చ జరిగింది. అయితే అదే రోజు తమకు ఆహ్వానం అందలేదని టీడీపీ నేతలు, రాష్ట్ర బీజేపీ నేతలు స్పష్టత నిచ్చారు. ఐక్యతారాగం వినిపిస్తూ భారతీయ జనతాపార్టీని ఓడించ డమే లక్ష్యంగా జట్టుకడుతున్న ప్రతిపక్షాలకు ధీటుగా ఎన్డిdయేను బలోపేతం చేసేందుకు కసరత్తు మొదలుపెట్టిన కమలనాథులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీకి ఆహ్వానం అందిస్తూ వెళ్తున్నారు. తమిళనాడు లో మిత్రపక్షాలు అన్నాడీఎంకే, టీఎంసీ, పీఎంకే పార్టీలకు ఆహ్వానం అందించారు.

అన్నాడీఎంకే, తమిళ్‌మనీలా కాంగ్రెస్‌ నేత జీకే వాసన్‌, పీఎంకే నేత అన్భుమణి రాందాస్‌కు ఈ ఆహ్వానాలు అందాయి. అయితే అన్నాడీఎంకేకు చెందిన పన్నీర్‌ సెళ్వంకు మాత్రం బీజేపీ నుంచి ఆహ్వానం అందలేదు. బీహార్‌లో జనతాదళ్‌(యునైటెడ్‌) ఎన్డియే నుంచి దూరమైన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కొత్త మిత్రులను వెతుక్కునే పనిలో కమలనాథులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌జనశక్తి పార్టీతో పాటు ఆ రాష్ట్ర మాజీ సీఎం జితెన్‌ రామ్‌ మాంజీ (హందుస్తానీ ఆవామ్‌ మోర్చా)కు కూడా ఆహ్వానం పంపించారు. పంజాబ్‌లో పాత మిత్రులు ‘శిరోమణి అకాలీదళ్‌’కు కూడా ఆహ్వానం పంపినట్టు తెలిసింది.

మహారాష్ట్రంలో శివసేన ఎన్డియేకు దూరమైన తర్వాత ఆ పార్టీలో చీలికవర్గం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేనతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ, తాజాగా ఎన్సీపీలోనూ అజిత్‌ పవార్‌ నేతృత్వంలో చీలిక వర్గాన్ని ప్రోత్సహంచి ప్రభుత్వంలో చేర్చుకుంది. 18 నాటి ఎన్డియే మిత్రపక్షాల భేటీకి ఈ రెండు చీలిక వర్గాలకు ఆహ్వానం పంపినట్టు తెలిసింది.

టీడీపీకి నై జనసేనకు సై
తెలంగాణలో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తు లేదు. ఏపీలో బీజేపీతో కలిసి సాగుతున్న ‘జనసేన’ను కూడా తెలంగాణలో దరి చేర్చుకోలేదు. ఈ పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలో బీజేపీతో జట్టుకట్టే మిత్రపక్షమేదీ లేదని స్పష్టమైంది. కానీ ఏపీలో ప్రస్తుతానికి బీజేపీతో కలిసి సాగుతున్న జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌కు బీజేపీ అగ్రనాయకత్వం నుంచి పిలుపు అందినట్టు తెలిసింది. తెలుగుదేశంతో జట్టుకట్టేందుకు ఉవ్విళ్లూరుతూ బీజేపీని కూడా అటువైపుగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న జనసేనాని ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఓకే చెప్పినట్టు కూడా తెలిసింది. అయితే తనతో పాటు జనసేనలో నెంబర్‌ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్‌ను కూడా అనుమతించాలని కమలనాథులను విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. మరోవైపు బీజేపీకి పాత మిత్రులైన టీడీపీకి ఆహ్వానం విషయంలో కాషాయదళం అంత సుముఖంగా లేదని తెలిసింది. అందుకే ఇప్పటి వరకు ఆహ్వానం పంపలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సమావేశానికి ఇంకా కొద్ది రోజుల సమయం ఉందని, ఈలోగా ఆహ్వానం పంపే అవకాశం కూడా లేకపోలేదని మరికొందరు చెబుతున్నారు. ఏపీలో తమతో స్నేహానికి అటు టీడీపీ, ఇటు వైఎస్సార్సీపీ రెండూ ఆసక్తి చూపుతున్నాయని, ఈ పరిస్థితుల్లో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement