Tuesday, April 30, 2024

మువ్వన్నెల జెండా రూపుదిద్దుకుని నేటితో వందేళ్లు

భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చే మహా ఉద్యమంలో ఎన్నో ఘట్టాలకు ప్రతీకగా నిలిచింది మన జాతీయ పతాకం. రెపరెపలాడుతున్న మన జాతీయ పతాకాన్ని చూస్తే ప్రతి భారతీయుడి గుండెలో దేశభక్తి ఉప్పొంగడం ఖాయం. మూడు రంగుల మువ్వన్నెల జెండా రూపుదిద్దుకుని నేటితో వందేళ్లు పూర్తవుతోంది. 1906లో కోల్‌కతాలో 22వ అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు నిర్వహించారు. దాదాబాయి నౌరోజీ ఈ సభలకు అధ్యక్షత వహించారు. అయితే సభ ప్రారంభానికి ముందు బ్రిటీష్ వారి జెండాకు వందనం చేయాల్సి రావడంతో పింగళి వెంకయ్య కలత చెంది మనకు ఎందుకు జాతీయ పతాకం ఉండకూడదు అని ఆ సభలోనే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆయన్ను కాంగ్రెస్ పార్టీ కీలక సభ్యుడిగా నియమించింది. అనంతరం జాతీయ పతాక ఆవశ్యకతను గుర్తిస్తూ పింగళి వెంకయ్య దేశమంతా పర్యటించి 1916లో ‘ఏ నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా’ అనే ఆంగ్ల పుస్తకాన్ని తయారు చేశారు.

విజయవాడలో గాంధీ సమక్షంలో జెండాకు బీజం

అటు 1921, మార్చి 31న అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరారు. మహాత్ముడు సూచించిన ప్రకారంగానే వెంకయ్య ఒక జెండాను సమకూర్చారు. అనంతరం వచ్చిన ఆలోచనల మేరకు, సత్యం, అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా, వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించారు.

కాగా జాతీయ పతాకానికి, కాంగ్రెస్ జెండాకు మధ్య వ్యత్యాసం ఉండాలని 1947, జూలై 22న జాతీయ పతాకంలో కాషాయం, తెలుపు, ముదురు ఆకుపచ్చ రంగుల పట్టీలతో.. మధ్యలో నీలిరంగులో అశోకుని ధర్మచక్రం ఉండేలా అప్పటి అధికారులు నిర్ణయం తీసుకుని జాతీయ జెండాలో పలు మార్పులు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement