Friday, April 26, 2024

భారత్‌-రష్యా.. బంధం సుస్థిరం.. పుతిన్‌తో ద్వైపాక్షిక భేటీలో మోడీ..

న్యూఢిల్లీ : భౌగోళికంగా ఎన్నో రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయని, కానీ భారత్‌-రష్యా మధ్య సంబంధాలు సుస్థిరంగానే ఉన్నాయని ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అభిప్రాయపడ్డారు. కీలక ఒప్పందాలతో.. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం అయ్యారు. ఢిల్లిdలోని హైదరాబాద్‌ హౌస్‌లో ఇద్దరు నేతల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. దీనికి ముందు.. ఢిల్లిd విమానాశ్రయానికి చేరుకున్న పుతిన్‌కు భారత్‌ ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలికారు. అనంతరం హైదరాబాద్‌ హౌస్‌కు వెళ్లారు.

ఒప్పందాలపై సంతకాలు
రక్షణ, వాణిజ్య, టెక్నాలజీ రంగాల్లో పలు ఒప్పందాలపై ఇరు దేశాల నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంతకాలు చేశారు. కరోనా నుంచి ఎదురయ్యే సవాళ్లు ఉన్నప్పటికీ.. భారతదేశం-రష్యా సంబంధాల వృద్ధి వేగంలో ఎటువంటి మార్పు ఉండదని ఇరు దేశాల అధినేతలు ప్రకటించారు. తమ ప్రత్యేక, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పటిష్టంగా కొనసాగుతోందంటూ భారత్‌, రష్యా ప్రకటించాయి. ఈ భేటీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. గత కొన్ని దశాబ్దాల్లో ప్రపంచం అనేక మార్పులను చూసిందని, వివిధ రకాల భౌగోళిక రాజకీయ సమీకరణాలు ఉద్భవించాయని పేర్కొన్నారు. అయితే భారతదేశం, రష్యాల స్నేహం స్థిరంగా ఉందంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత్‌, రష్యా మధ్య సంబంధం అంతర్జాతీయ స్నేహానికి ఒక ప్రత్యేక నమూనా అంటూ నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు.

రష్యాతో నిరంతరం స్నేహం
భారత్‌తో 5 బిలియన్‌ డాలర్ల డిఫెన్స్‌ డీల్‌పై మోడీతో పుతిన్‌ చర్చలు జరిపారు. ఎల్‌ఏసీ దగ్గర చైనా దురాక్రమణపై కూడా ఇరు దేశాల నేతలు చర్చల్లో ప్రస్తావించారు. కరోనాపై భారత్‌-రష్యా కలిసి పోరాటం చేశాయని మోడీ, పుతిన్‌ పేర్కొన్నారు. 74 ఏళ్ల నుంచి భారత్‌-రష్యా మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయని, రష్యాతో స్నేహం నిరంతరం కొనసాగుతుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సోమవారం సాయంత్రం ఢిల్లిdకి చేరుకున్నారు. అయితే.. రెండేళ్ల తరువాత.. మోడీ, పుతిన్‌ ప్రత్యక్షంగా కలుసుకున్నారు. 21వ వార్షిక భారత్‌-రష్యా శిఖరాగ్ర సమావేశంలో మోడీ, పుతిన్‌ రక్షణ, వాణిజ్య, టెక్నాలజీ, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు.

రూ.5కోట్లతో ఏకే-203 రైఫిళ్లు
రూ.5,124 కోట్లతో భారత్‌లో 6 లక్షల కలష్నికోవ్‌ ఏకే-203 రైఫిళ్ల తయారీ, స్వల్ప దూరంలోని శత్రు లక్ష్యాల నాశనం కోసం రష్యా నుంచి రూ.11,262 కోట్లతో గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు భారత్‌, రష్యా మధ్య ఒప్పందాలు జరిగాయి. కనుచూపు మేరలోని శత్రు విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను కూల్చి వేయడానికి ఉపకరించే ఇగ్లా-ఎస్‌ విమాన విధంసక క్షిపణులనూ రష్యా నుంచి భారత్‌ సమీకరించనుంది. భుజం మీద నుంచి ప్రయోగించే ఇగ్లా-ఎస్‌ క్షిపణి తయారీ, పలు అంశాలపై ఇరు దేశాల అధినేతలు చర్చించారు. భారత్‌, రష్యా సైనిక దళాలు మరింత తరచుగా.. ఉన్నత స్థాయిలో సంయుక్త విన్యాసాలు జరిపే విషయంలోనూ మోడీ, పుతిన్‌ భేటీలో అంగీకారం కుదిరే అవకాశం ఉంది. రష్యా నుంచి రూ.40వేల కోట్లతో భారత్‌ కొనుగోలు చేసిన ఎస్‌-400 ట్రయంఫ్‌ క్షిపణి వ్యవస్థల బటాడా ప్రక్రియను వేగవంతం చేయడానికి కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది.

విదేశాంగ మంత్రుల భేటీ
ఢిల్లిdలోని సుష్మా స్వరాజ్‌ భవన్‌లో రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లవ్రోవ్‌తో భారత్‌ విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ సమావేశం అయ్యారు. ఇరువురు ప్రపంచ రాజకీయ అంశాలపై చర్చించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ముందే లవ్రోవ్‌ భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా 2 ప్లస్‌ 2 భేటీ జరిగింది. మోడీతో పుతిన్‌ కీలక భేటీకి ముందు ఇరువురు కీలక అంశాలపై చర్చించారు. అదేవిధంగా ఇరు దేశాల రక్షణ శాఖ మంత్రులు కూడా ఇందులో భాగస్వాములయ్యారు. ఇరు దేశాల మధ్య 2 ప్లస్‌ 2 చర్చలు జరగడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఇలాంటి చర్చలు అమెరికాతోనే జరిపింది.

- Advertisement -

చైనా చొరబాటుపై రాజ్‌నాథ్‌ ప్రస్తావన
రష్యా మంత్రులతో జరిగిన భేటీలో.. చైనా చొరబాటు అంశాన్ని భారత్‌ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లేవనెత్తారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న పరిస్థితులను ప్రస్తావించారు. చైనా ఆర్మీ ఆగడాలను వివరించారు. ప్రతీ రంగంలో శత్రువులకు తగిన సమాధానం చెప్పగల శక్తి, సామర్థ్యాలు తమకు ఉందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా పలు రక్షణ శాఖ ఒప్పందాలపై చర్చించారు. మొత్తం ఐదు ఎస్‌400 క్షిపణుల సకాలంలో సరఫరా, తదుపరి రెండు ఎస్‌400ల విస్తరణలో రష్యా ద్వారా సమర్థవంతమైన సహాయాన్ని అందించడం వంటివి ఉన్నాయి. భారత్‌-రష్యా మధ్య ఇప్పటికే 20 సార్లు వార్షిక సదస్సులు జరిగాయి. ఇది 21వ భేటీ. సాధారణంగా ఈ వార్షిక సదస్సు.. ఒకసారి రష్యాలో జరిగితే మరో ఏడాది భారత్‌లో జరుగుతుంది. అయితే గతేడాది ఈ సదస్సు భారత్‌లో జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement