Saturday, April 27, 2024

దేవాలయంలో రోత ప‌నులా? గులాబీ నేతల బ‌రితెగింపు.. ఎక్క‌డంటే..

ఏజెన్సీ విద్యార్థులకు దూరమై.. కడుభారంగా మారిన ప్రైవేట్‌ విద్యను చేరువ చేసిన విద్యాలయం సాక్షిగా పేకాట జోరు కొనసాగుతోంది… ఎంతోమంది తలరాతలు మార్చిన సరస్వతీ నిలయంలో రోత పనులకు పాల్పడుతూ కొందరు ప్రబుద్ధులు విద్యాలయ చరిత్రను మసకబారుస్తున్నారు… పదే పదే పోలీసులకు పట్టుబడుతున్నా.. రాజకీయ నేపథ్యం ఉండటంతో వెరవకుండా తిరిగి అవే ఛీ..కటి పనులను నిస్సిగ్గుగా నిర్వహిస్తూ వస్తున్నారు… కళాశాల నిర్వాహకులే జూద క్రీడకు తెరలేపడంతో పాటు.. పాతిక సంవత్సరాలకు పైగా చరిత్ర గలిగిన విద్యాసంస్థను జూదశాలగా మార్చడం పట్ల పూర్వ విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు… నిందితులుగా దొరుకుతున్న వారిలో కొందరు అధికార పార్టీ పట్టణ కీ నేతలు కావడంతో పాటు.. పగలంతా అక్రమ దందాలు రాత్రయితే రమ్మీ ఆడుతూ పోలీసులకు పట్టుబడుతుండటం పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు…

ప్రభ న్యూస్‌ రూరల్‌ బ్యూరో, ఉమ్మడి ఖమ్మం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గంలో పదో తరగతి తరువాత చదువులకు దూరం కావాల్సిన పరిస్థి తులు నెలకొన్న సమయంలో మణుగూరు కేంద్రంగా ఆధునిక విజ్ఞాన దేవాలయంగా శ్రీవిద్య జూనియర్‌ కళాశాల వెలిసింది. ఈ విద్యాసంస్థల ప్రారంభం నుంచే వేలాదిమందికి ఉన్నత చదువులనందించడంతో పాటు, వారి తలరాతను సైతం మార్చి వేసింది. ఈ విద్యాలయం చరిత్ర ప్రస్తుతతరం నిర్వాహకుల కార ణంగా మసకబారుతోంది. మణుగూరు పట్టణంలో అధికార పార్టీ రాజకీయ నాయకులుగా చెలామణి అవుతున్న కొందరు, దేవాలయంలాంటి విద్యాసంస్థ ప్రాంగణంలో రోత పనులతో రోజంతా గడుపుతూ, చెడ్డపేరు తీసుకువస్తున్నారు.

పేకాట క్లబ్‌గా మారిన విద్యాలయం
మణుగూరు, పినపాక, అశ్వాపురం పూర్వమండలాల పరిధిలో ఎంతో మందికి ఉన్నత విద్యనందించిన శ్రీవిద్య కళాశాలల నిర్వాహకుల తీరు విస్మయం కలిగిస్తోంది. ఇప్పటికే పేకాట ఆడుతూ పలుమార్లు నిర్వాహకులు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ వారి తీరు మారక పోవడంతో పాటు, ఓ కీ నేత అండతో తిరిగి యదావిధిగా అసాంఘిక కార్యక్రమాలు కొనసాగిస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు నేతల తీరు, ఇక్కడ సాగుతున్న పేకాట జోరు ఇదే సంస్థ లో చదివి, ఉన్నతులుగా ఎదిగిన ఎంతోమందిని కలవరపాటుకు గురిచేస్తోంది.

పగలంతా సెటిల్‌మెంట్లు.. రాత్రయితే రమ్మీ
మణుగూరు పట్టణంలో అధికార పార్టీలో కీలక రాజకీయ నేతలుగా వ్యవహరిస్తున్న పలువురు నాయకులు పగలంతా నూటికి రూ.5, 6 చొప్పున వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ, ఆయా తగదాల సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారు. వారు రాత్రి కాగానే శ్రీవిద్య విద్యాసంస్థ లకు చేరుకొని చదువులమ్మ తల్లి ప్రాంగణంలో రమ్మీ ఆడుతూ రంజుగా ఎంజాయ్‌ చేస్తున్నారు. అధికార పార్టీ పట్టణ కీలక నేతలుగా ఉన్న వీరంతా పేకాట స్థావరంగా విద్యాలయాన్ని మార్చడం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ వడ్డీ వ్యాపారం, ఆపై సెటిల్‌మెంట్లతో అధికార పార్టీలో రాజకీయ నేతల అవతారమెత్తిన వారికే పలు కీలక పదవులు ఎలా ఇస్తున్నారంటూ జనం ఆక్షేపిస్తున్నారు. రాజకీయ నేతలంటే ఆదర్శంగా ఉండే కాలం చెల్లిందని, అడ్డగోలు దందాలు, రమ్మీ ఆటలు, రమ్‌ మత్తులో మునగటం ప్రస్తుతం పరిపాటిగా మారిందని, పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పోలీసుల చర్యలు భేష్‌.. అయినా తగ్గని నేతల తీరు
నీచపు పనులతో నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ, గులాబీ పార్టీ నేతలుగా ఎదిగి రాజకీయాల్లో కారు మబ్బులు పట్టిస్తున్న సదరు పట్టణ నేతలు పవిత్ర దేవాలయాన్ని కలుషితం చేస్తున్న తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఏఎస్పీ శభరీష్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ నరేష్‌ నేతృత్వంలో ఇటీవల పకడ్బంధీగా దాడి చేసి, కేసులు నమోదు చేసి పట్టణ ప్రజల చేత శభాష్‌ అనిపించుకున్నారు. అయినప్పటికీ ఓ కీలక నేత రంగప్రవేశం చేసి, పోలీసులు ఏమీ చేయలేరని, మీకు నచ్చినట్లు ఆడుకోమంటూ భరోసా కల్పించడంతో తిరిగి మూడు ముక్కలాట యథేచ్ఛగా సాగుతోంది. జనం ఛీకొడుతున్నా వెరవకుండా జుగుప్సాకరమైన ప నులతో తులసివనంలో గంజాయి మొక్కలుగా మారిన నాయకులకు అడ్డుకట్ట వేయాలంటే శ్రీవిద్య కళాశాలలకు అందుబాటులో పోలీస్‌ పికేట్‌ ఏర్పాటు చేయాలంటూ జనం కోరుతున్నారు. పికెట్‌ ఏర్పాటు చేయాలని జనం కోరేంతగా సాగుతున్న జూద క్రీడకు పోలీసులు అడ్డుకట్ట వేయాలని, రాజకీయాలకతీతంగా చర్యలు తీసుకోవాలని మణుగూరు పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement