Wednesday, May 8, 2024

నాపై లైంగిక దాడి జ‌ర‌గలే.. ఫిర్యాదుపై యూటర్న్‌ తీసుకున్న టెన్నిస్ స్టార్..

చైనీస్‌ టెన్నిస్ స్టార్ పెంగ్‌ షువాయి తన మాటలపై యూటర్న్ తీసుకుంది. చైనాకు చెందిన ఓ ప్ర‌ముఖ నేత త‌న‌ను లైంగికంగా వేధించిన‌ట్లు గ‌తంలో చేసిన ఆరోప‌ణ‌లపై మాట మార్చింది. త‌న‌పై లైంగిక దాడి జ‌ర‌గలేద‌ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పిందీ అమ్మడు. అంతేకాకుండా తాను సేఫ్‌గానే ఉన్నట్లు పేర్కొంది. మాజీ వింబుల్డన్‌, ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ ఛాంపియన్‌ అయిన పెంగ్‌ షువాయి మాట మార్చడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై నిజమేంటో నిర్భయంగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

చైనా కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ లీడ‌ర్‌ అయిన జాంగ్ గ‌వోలీ తనపై లైంగిక దాడికి పాల్పడ్డార‌ని నవంబర్ 2న టెన్నిస్ స్టార్‌ పెంగ్‌ షువాయి సోషల్ మీడియాలో ఆరోపణలు చేసింది. జాంగ్ గ‌వోలీ తనతో శృంగారం చేయాలని బలవంతం చేశాడని, ఏడేళ్ల‌ క్రితం తనతో ఓసారి శృంగారంలో పాల్గొన్నాని తెలిపింది. అయితే ఆ త‌ర్వాత‌ పెంగ్‌ షువాయి ఆ పోస్టులు డిలీట్ చేసింది. కొన్ని రోజుల‌కు ఆమె అదృశ్యం కావడంతో పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. ఈ విషయంలో అంతర్జాతీయ టెన్నిస్‌ స్టార్లు నోవాక్ జకోవిచ్, సెరీనా విలియమ్స్, నవోమి ఒసాకా సైతం ఆందోళన వ్యక్తం చేశారు. పెంగ్‌ ఎక్కడున్నారు, విచారణ జరపాలని కోరారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ వీడియోలో మాట్లాడిన పెంగ్‌ షువాయి తాను అసలు ఎవరిపై ఆరోపణలు చేయలేదని చెప్ప‌డం గ‌మ‌నార్హం. అందుకు సంబంధించిన వార్తను సింగపూర్‌కు చెందిన ఓ ప్రముఖ చైనా దినపత్రిక ప్రచురించింది. ‘నేను ఒక ముఖ్యమైన విషయం అందరికి చెప్పాలనుకుంటున్నా. నేనెప్పుడూ ఎవరిపై లైంగిక వేధింపుల ఆరోపణలు, ఫిర్యాదులు చేయలేదు. ఈ విషయాన్ని స్పష్టంగా తెలియ‌జేస్తున్నా’ అని పెంగ్ తెలిపింది. అయితే చైనా మాజీ వైస్‌ ప్రీమియర్‌ జాంగ్‌ గవోలీపై చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. అది తన వ్యక్తిగత విషయమని, దాన్ని ప్రజలంతా తప్పుగా అర్థం చేసుకున్నార‌ని పేర్కొంది.

పెంగ్‌ షువాయి బాహ్య ప్రపంచానికి కనపడకుండా పోయేసరికి చైనాకు చెందిన ఓ అధికారిక పత్రిక ఆమె క్షేమంగానే ఉన్నట్లు డబ్ల్యూటీఏ చీఫ్‌ స్టీవ్‌ సైమన్‌కు ఈమెయిల్‌ చేసింది. దీనిపై అప్పుడు స్టీవ్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఆమె ఈమెయిల్‌ స్క్రీన్‌షాట్లను వీడియోలో చూపించగా.. అది తాను స్వయంగా రాసిందేనని తాజాగా పెంగ్‌ స్పష్టం చేశారు. ఆ సమయంలో పెంగ్‌ కనపడకపోవడంపై ఏమైనా కారణం ఉందా? అని వీడియోలో ఒక వ్యక్తి ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని, తాను ఎప్పుడూ స్వేచ్ఛగానే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. మొత్తానికి పెంగ్‌ యూటర్న్‌ తీసుకోవడంతో.. దీని వెన‌కాల ఏం జరిగిందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement