Friday, April 19, 2024

Spl Story: హార్ట్​ ఎటాక్​, కార్డియాక్​ అరెస్ట్​ ఈ రెండూ ఒకటి కాదా? ఏది చాలా డేంజ‌రంటే!

ప్రముఖ సింగర్ కేకే మరణంతో సంగీత ప్రపంచం విషాదంలో ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన కార్డియాక్ అరెస్టుతో చ‌నిపోయిన‌ట్టు తెలుస్తోంది. కార్డియాక్ అరెస్టును చాలా మంది గుండెపోటుగా భావిస్తారు. నిజానికి ఈ రెండూ వేరనే చెబుతున్నారు వైద్య నిపుణులు.. గుండె పోటు, కార్డియాక్ అరెస్టు రావడానికి కారణాలు కూడా వేరు వేరనే అంటున్నారు.

అమెరికాన్ హార్ట్ అసోసియేషన్ చెబుతున్న దాని ప్రకారం ‘‘కార్డియాక్ అరెస్టు వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు ముందస్తుగా కనిపించవు. ఇది హఠాత్తుగా వచ్చేస్తుంది. అది మరణానికి కూడా దారితీస్తుంది. కానీ, గుండె పోటు మాత్రం కొన్ని ప్రాథమిక లక్షణాలను చూపిస్తుంది. కార్డియాక్ అరెస్టు సంభవిస్తే ఆ వ్యక్తికి చ‌నిపోయే చాన్సెస్ చాలా ఎక్కువ. నిజానికి ప్రతి మరణానికీ చివర దశ కార్డియాక్ అరెస్టు అనే చెప్పాలి. అంటే ఓ వ్యక్తి సాధారణంగా మరణించినా లేక ఏదైనా అనారోగ్యంతో మరణించినా చివరలో జరిగేది కార్డియాక్ అరెస్టే. ఇదే కొందరిలో హఠాత్తుగా దాడి చేసి ప్రాణాలు తీస్తుంది” అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. కార్డియాక్ అరెస్టు అంటే గుండె కొట్టుకోవడం హఠాత్తుగా ఆగిపోవడం. గుండెకు రక్త ప్రసరణ హఠాత్తుగా ఆగిపోయినా కూడా ఇట్లాగే జరుగుతుంది. ముందు హార్ట్ ఎటాక్ వచ్చి చివరికి, అది కార్డియాక్ అరెస్టుగా కూడా మారొచ్చు. రక్తంలో గడ్డకట్టడం కూడా దీనికి కారణం కావచ్చు. కార్డియాక్ అరెస్టు వచ్చాక బతికే చాన్సులు చాలా తక్కువ. ప్రపంచంలో కార్డియాక్ అరెస్టు బారిన పడిన వారిలో బతికి బయటపడ్డ వారి శాతం కేవలం ఒకటి మాత్రమే అంటే అందరూ దీని గురించి అర్థం చేసుకోవాలి. అదెంత ప్రాణాంతకమైన పరిస్థితో అన్నది తెలుసుకోవాలి. కార్డియాక్ అరెస్టు రావడానికి ఇంకా అనేక కారణాలు కూడా ఉంటాయని చెబుతున్నారు గుండె వైద్య నిపుణులు.

హార్ట్ ఎటాక్ వచ్చే ముందు చాలా మందిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిపై అవగాహన ఉన్న వాళ్లు వెంటనే జాగ్రత్త పడతారు. ఒక్కోసారి జాగ్రత్త తీసునేంత సమయం కూడా ఉండదు. కానీ, హార్ట్ ఎటాక్ వచ్చాక బతికే చాన్స్​ మాత్రం చాలా ఎక్కువే ఉంటుంది. కరోనరీ రక్తనాళంలో క్లాట్లు ఏర్పడినప్పుడు రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది. అలాంటప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. హార్ట్ ఎటాక్ వచ్చాక కూడా కొందరు రోగులకు స్పృహ ఉంటుంది. గుండెల్లో తీవ్రమైన నొప్పిగా అనిపిస్తుంది. గుండె బలహీనంగా మారిపోతుంది. హార్ట్ ఎటాక్ వచ్చినప్పటికీ మిగతా శరీర భాగాలకు రక్త సరఫరా జరుగుతూనే ఉంటుంది. ప్రపంచంలో ఏటా కోటిన్నర మందికి పైగా కేవలం గుండె సంబంధ వ్యాధులు కారణంగా మరణిస్తున్నట్టు అంచనా.

– ఆంధ్రప్రభ డిజిటల్​ మీడియా / వెబ్​ డెస్క్​

Advertisement

తాజా వార్తలు

Advertisement