Wednesday, May 1, 2024

Demonetisation: నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ.. కేంద్రం, ఆర్‌బీఐకి నోటీసులు జారీ

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2016లో తీసుకున్న పెద్దనోట్లరద్దు అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లపై విచారణ జరుపుతామని తెలిపింది. ఈ క్రమంలో నోట్లరద్దు నిర్ణయానికి ముందు చేసిన కసరత్తుకు సంబంధించిన అన్ని వివరాలతో అఫిడవిట్లను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు, భారతీయ రిజర్వు బ్యాంకును సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. అటార్నీ జనరల్‌ ఆర్‌ వేంకటరమణి, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ, ఈ అంశం విద్యా సంబంధిత అంశంగా మారిందని, పెద్ద నోట్లను రద్దు చేసి ఆరేళ్లు గడిచిపోయిందని అన్నారు.

వెంటనే సీనియర్‌ న్యాయవాదులు చిదంబరం, శ్యామ్‌ దివాన్‌ పిటిషనర్ల తరపున వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ నిర్ణయం చెల్లుబాటుపై సవాలు చేయడానికి ఇప్పటికీ అవకాశం ఉందన్నారు. కార్యనిర్వాహక ఆదేశాల ద్వారా కరెన్సీ నోట్లను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ఈ సమస్య భవిష్యత్తుకు కూడా సంబంధించినదని పేర్కొన్నారు. పాలనాపరమైన అంశాలపై విచారణ ద్వారా విలువైన కోర్టు సమయం వృథా చేయరాదని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సూచించారు. దీనిపై పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు.

ఈ కేసులన్నింటినీ రాజ్యాంగ ధర్మాసనం ముందు పెట్టాలని అంతకు ముందు బెంచ్‌ సూచించగా, ధర్మాసనం సమయం వృథా చేయొద్దనడం ఆశ్చర్యం కలిగిస్తోందని వాదించారు. ఇది పాలనా వ్యవహారం కాదని, దీనిపై న్యాయస్థానం కచ్చితంగా విచారణ జరపాల్సిందేనని చిదంబరం అభిప్రాయపడ్డారు.

లక్ష్మణరేఖ పరిధిపై అవగాహన ఉంది..
ప్రభుత్వ విధాన నిర్ణయాలను న్యాయ సమీక్షచేసే అంశంపై లక్ష్మణరేఖ ఎక్కడుందో తమకు అవగాహన ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 2016లో కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయం కేవలం పాలనాపరమైన అంశమా? లేక మరేదైనానా అనే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. నోట్ల రద్దు నిర్ణయం రాజ్యాంగ బద్ధతను సవాల్‌చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్‌ ఎఎస్‌ నజీర్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ ప్రారంభించింది. తమ ముందుకు వచ్చిన కేసుకు సమాధానం ఇవ్వడం తమ బాధ్యతని ధర్మాసనం ఈ సందర్భంగా వెల్లడించింది.

- Advertisement -

కేంద్రం నిర్ణయం పాలనాపరమైనదా.. కాదా .. న్యాయ సమీక్ష పరిధికి మించినదా అనే విషయాలను పరిశీలించి సమాధానం ఇవ్వాల్సి ఉంది. అందుకే వాదనలు వినాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ విధానం, దాని స్వేచ్ఛ అనేది ఇందులో ఒక అంశం మాత్రమే. కేవలం ప్రభుత్వం తీసుకువచ్చిన విధానాన్ని మాత్రమే పరిశీలిస్తాం. ఈ క్రమంలో లక్ష్మణరేఖ ఎక్కడివరకు ఉందో మాకు తెలుసు అని జస్టిస్‌ ఎఎస్‌ నజీర్‌, జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ ఎఎస్‌ బోపన్న, జస్టిస్‌ వి. రామసుబ్రహ్మణ్యమ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement