Sunday, June 16, 2024

Special Story: పుకార్ల పుట్ట…అనర్థాలచెత్త బుట్ట!

- Advertisement -

(న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి)

ప్రపంచంలో మరే దేశంలో లేని స్థాయిలో భారత్‌లోని సామాజిక మాధ్య మాలు అవాస్తవాల్ని వండి, వార్తలుగా వారుస్తున్నాయి. జనాన్ని ఆకర్షించే విధంగా కాప్షన్‌లు, థంబ్‌నైల్స్‌ పెట్టి మార్కెటింగ్‌ చేసుకుంటున్నాయి. ఈ ప్రక్రియలో సమాజానికొస్తున్న నష్టాన్ని ఈ సోషల్‌ మీడియా నిర్వాహకులు ఎవరూ బేరీజు వేసుకోవడం లేదు. వాస్తవానికి.. అవాస్తవానికి మధ్యనున్న సన్నటి వ్యత్యాసాన్ని చెరిపిపారేస్తున్నారు. ఈ చర్యలతోఇప్పటికే వీటికి విశ్వసనీయత పోయింది. అయినా గజనీ మహ్మద్‌, ఘోరీ మహ్మద్‌ మాదిరిగా పాఠకులపై దండెత్తుతూనే ఉన్నారు. వీరి ప్రయత్నాల మధ్య సాధారణ ప్రజలు నలిగిపోతున్నారు. ఈ వార్తల్లో వాస్తమెంతో ధ్రువీకరించుకోలేక ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో తెలీక మానసిక అలజడికి లోనవుతున్నారు.
ఆమధ్య బ్రతికుండగానే అబ్దుల్‌కలామ్‌ను సోషల్‌ మీడియా మూడుసార్లు చంపేసింది. మదర్‌ థెరిస్సా కాలం చేశారంటూ మూడుసార్లు సోషల్‌ మీడియా హోరెత్తించింది. కాస్త అస్వస్థతతో ఉన్న సెలబ్రిటీలు, సినీనటుల్ని వాస్తవ మర ణంకంటే ముందే ఐదారుసార్లు చంపేస్తోంది. పలు సందర్భాల్లో ఈ సెలబ్రిటీలు టీవీ ల ముందుకొచ్చి తామింకా బ్రతికే ఉన్నామంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్ప డుతోంది. దివంగత కళాతపస్వి విశ్వనాథ్‌ ఆరోగ్యంగా ఉన్నప్పుడే సోషల్‌ మీడియా ఆయన మరణించారంటూ పెద్దెత్తున ప్రచారం చేసింది. ఇలాంటి పరిస్థితి పట్ల గద్గద స్వరంతో విశ్వనాథ్‌ టీవీల ముందు ఆవేదన వ్యక్తపర్చడం ఇప్పటికీ అందరికీ గుర్తుంటుంది.

ఇక ఎన్నికల్లో ఈ సోషల్‌ మీడియా చేస్తున్న పైశాచిక ప్రచారం ఆషామాషీగా లేదు. ఈ సోషల్‌ మీడియా నిర్వాహకులే పార్టీల పరంగా అభ్యర్థుల్ని ఖరారు చేస్తు న్నారు. వీరే అభ్యర్థులకు బి ఫారాలిచ్చేస్తున్నారు. ఆఖరకు ప్రజలు ఫలానా వారికే ఓట్లెశారంటూ ప్రకటించేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ ఇంకా లెక్కింపు ప్రక్రియ మొ దలెట్టకముందే ఫలానావారు ఇంత మెజార్టీతో గెలిచేశారంటూ ప్రచారంలోకి తెచ్చే స్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేసేందుకు జరు గుతున్న ప్రయత్నాల్లో మేలుకంటే కీడే ఎక్కువగా ఉంటోంది. ఇందుక్కారణం సామాజిక మాధ్యమాల నిర్వహణకు ఎలాంటి చట్టబద్ధమైన నియంత్రణ లేకపో వడమే. ఏ చట్టం ప్రకారం కూడా దీన్ని మీడియాగా పరిగణించే వీల్లేదు. ఇవి ఏ చట్టం ప్రకారం ప్రభుత్వాధికారుల ప్రత్యక్ష నిర్వహణలోకి రావడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని అవాస్తవాల్ని పెద్దెత్తున ప్రచారం చేయడం ద్వారా సామాజిక గుర్తింపు కోసం ఈ నిర్వాహకులు ప్రాకులాడుతున్నారు. ఈ క్రమంలో సమాజానికి తాము చేస్తున్న కీడును వీరెవరూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. వ్యవస్థల్ని, ఆఖరకు ప్రభుత్వాల్ని కూడా తామే శాసించాలన్న స్థాయికి చేరుతున్నారు.

రాజకీయ పార్టీలు అభ్యర్థులు, నాయకులు కూడా సొంతంగా సామాజిక మాధ్యమ నిర్వహణా సంస్థల్ని నెలకొల్పుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్టూడియో కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. కొంతమంది నిపుణుల్ని నియ మిం చుకుని ప్రత్యర్థులపై పనిగట్టుకుని విమర్శలు చేయిస్తున్నారు. లేనిపోని ఆరోపణలు గుప్పిస్తున్నారు. వ్యక్తిగత జీవితాల్ని బజారుకీడుస్తున్నారు. కుటుంబ సభ్యులపై కూడా అనుచితంగా సామాజిక మాధ్యమాల ద్వారా దాడులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో పలువురి వ్యక్తిత్వాలు బజారున పడుతున్నాయి. వారు అనవసర నిందల్ని మోయాల్సి వస్తోంది. రాజకీయంగానే కాకుండా సామాజికంగా, కుటుంబపరంగా వీరు విలువను కోల్పోవాల్సి వస్తోంది. ఇటువంటి వ్యక్తుల చర్యలపై చట్టబద్ధంగా పోరాడేందుకు తగిన అవకాశాలిప్పుడు కొరవడ్డాయి. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకునే ఎన్నికల్లో ప్రత్యర్థుల్ని నైతికంగా దెబ్బతీసేందుకు అనైతికంగా అవా స్తవాల్ని ప్రచారం చేస్తూ వీరు పబ్బం గడుపుకుంటున్నారు.

గతంలో ప్రభుత్వాలు ఈ సామాజిక మాధ్యమాల ముక్కులకు తాళ్ళేయాలని ప్రయత్నించాయి. అయితే పార్టీల మధ్య సమన్వయం కొరవడ్డంతో ఆ ప్రయత్నం సాగలేదు. ఇప్పటికీ సామాజిక మధ్యమాల నిర్వాహకులపై పలురకాల కేసులు నమోదౌతున్నాయి. అయితే సమాజానికి వీరు చేస్తున్న కీడుతో పోలిస్తే వాటి సంఖ్య నామమాత్రమే. స్పష్టమైన సెక్షన్ల మేరకు శిక్షలు విధించే అవకాశాల్లేకపోవడంతో వీరంతా చిన్న చిన్న జరిమానాలతో బయటపడుతున్నారు. తిరిగి తమ వ్యాపకాన్ని కొనసాగిస్తున్నారు. సోషల్‌ మీడియాను ఆలంబనగా చేసుకుని కొందరు ఉన్న తస్థాయికి ఎదిగారు. అలాగే సమాజంలో పలురకాల మార్పులకు కూడా దోహద పడుతున్నారు. విద్యార్థులకు అంతర్జాతీయ సమాచారాన్ని అరచేతిలో అందుబా టులోకి తెస్తున్నారు. వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లోని నూతన ఆవిష్కరణలు, మార్పుల్ని ఎప్పటికప్పుడు ఔత్సాహికులకు చేరవేస్తున్నారు. ఇలా.. విద్యా రంగంలో సామాజిక మాద్యమాలు ఓ విప్లవానికి దోహదపడుతున్నాయి. అయితే సామాజిక రంగంలో మాత్రం వీటి పాత్ర అత్యంత హేయంగా ఉంటోందన్న విమర్శలొస్తున్నాయి.

సిక్స్‌ డిగ్రీస్‌తో మొదలై… వాట్సాప్‌తో పరాకాష్టకు…
ప్రస్తుతం దేశంలో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, ఎక్స్‌ (ట్విట్టర్‌), లింక్డ్‌ ఇన్‌ వంటి సామాజిక మాధ్యమాల్ని విరివిగా వినియోగిస్తున్నారు. అయితే వీటన్నిటికంటే ముందే 1997 లో ”సిక్స్‌ డిగ్రీస్‌” పేరిట మొట్టమొదటి సామాజిక మాధ్యమాన్ని ఆండ్రూవిండ్రీచ్‌ ప్రారంభించారు. ఇది 10మిలియన్ల మందికి చేరువైంది. అయితే 2001లో ఈ సంస్థ మూతబడింది. ఆ తర్వాత 2002లో ఫ్రెండ్‌స్టర్‌, 2003లో లింక్డ్‌ఇన్‌, 2004లో మైస్పే స్‌, ఫేస్‌బుక్‌, 2005లో యుట్యూబ్‌, 2006లో ట్విట్టర్‌ (ప్రస్తుతం ఇదే ఎక్స్‌గా మా రింది), 2010లో ఇన్‌స్టా గ్రామ్‌లు మొదలయ్యాయి. వీటన్నింటిని ఆ తర్వాత వచ్చిన వాట్సప్‌ దాటేసింది. ఇదే క్రమంలో స్నాప్‌ఛాట్‌, టిక్‌టాక్‌లు మార్కెట్లోకి అడుగెట్టాయి. ఈ సామాజిక మాద్యమాలన్నీ కేవలం కొన్ని మాసాల వ్యవధిలోనే కోట్లాది మంది సభ్యుల్ని ఆకర్షించాయి. అయితే అంతే త్వరగా వీటిపై విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా వీటి ద్వారా వ్యక్తిగత డేటా చౌర్యం జరుగుతోందన్న ఆరోప ణలు వెల్లువెత్తాయి. అలాగే వీటి ద్వారా విద్వేషపూరిత ప్రసంగాలు ప్రచా రమయ్యాయి. వీటి వినియోగంతో మానసిక ఆరోగ్యంపై చెడుప్రభావం మొద లైంది. తప్పుడు సమాచార వ్యాప్తితో సమాజంలో అంతర్గత ఘర్షణలు చోటు చేసు కున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా సమాజంలోని గుర్తు తెలియని వ్యక్తు లతో పరిచయాలు పెరిగాయి. ఇది సైబర్‌ మోసాలు పెరిగేందుకు దారితీసింది.

అయినా ఆదరణ…
అయినా సామాజిక మాధ్యమాల వినియోగం రోజురోజుకు పెరుతోంది. ప్రస్తు తం ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మందికి పైగా వీటిని వినియోగిస్తున్నారు. ఒక్కో సామాజిక మాధ్యమ వినియోగదారుడు సగ టున 6.6 వేర్వేరు సామాజిక మాధ్య మాల్ని వాడుతున్నారు. 16 నుంచి 70ఏళ్ళ వయస్సు వరకు ఓ వ్యక్తి జీవించాడని భావిస్తే అతని జీవితకాలంలో 5.7 సంవత్సరాల కాలం పూర్తిగా సామాజిక మాధ్య మాల వినియోగంలోనే గడిచిపోతోంది.
సోషల్‌ మీడియా వినియోగంలో భాగంగా స్నేహితులు పెరుగుతున్నారు. అయితే వారంతా వాస్తవ స్నేహితులు కాదు. దీంతో ఈ స్నేహాల కారణంగా పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. అపరిచితుల కారణంగా పలునష్టాలు ఎదు రౌతున్నాయి. పలు సందర్భాల్లో కేసుల్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. సోషల్‌ మీడియాను అతిగా విశ్వసించడం, భయపడ్డం కారణంగానే ఆత్మహత్యలు పెరు గుతున్నాయి. ఆన్‌లైన్‌లో వస్తున్న సమాచారంలో 43 శాతం అవాస్తవమైనదేనని అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు ధ్రువీకరించాయి. అలాగే అమెరికన్‌ అసో సియేషన్‌ ఆఫ్‌ సూచిడాలజి నివేదిక మేరకు 14ఏళ్ళ పిల్లల్లో సామాజిక మాధ్య మాల కారణంగా ఆత్మహత్యల సంఖ్య 50 శాతం పెరిగింది. పెద్దల్లోనూ దీని ప్రభా వం తీవ్ర ప్రతికూలంగా ఉంటోంది. ఈ సామాజిక మాధ్యమ ప్రచార సాధనాలపై ప్రభుత్వాలు నియంత్రణ విధించాలి. ఇందుకోసం చట్టాల్ని సవరించాలి. వీటన్నింటిని చట్టాల పరిధిలోకి తీసు కురావాలి. అవాస్తవ ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే.. వీటికి అడ్డు కట్ట పడుతుందని సామాజిక నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement