Wednesday, May 1, 2024

ఆ దమ్ము, ధైర్యం బీజేపీకి లేదు: గుత్తా సుఖేందర్ సవాల్

కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని శాసన మండలి మాజీ చైర్మన్,ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేంద్రం కేటాయించే నిధుల్లో కోత పెడుతున్నదని మండిపడ్డారు.రాష్ట్ర విభజన హామీలను కేంద్రం ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి..  ఉత్సవ విగ్రహంలా మారిపోయాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పట్టవని విమర్శించారు. కేంద్ర సర్కారు తెలంగాణ రాష్ట్రంపై అక్కసు,వ్యత్యాసం చూపెడుతున్నదని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం గురించి మాట్లాడితే బీజేపీ వాళ్ళు పెడర్థాలు తిస్తున్నరని గుత్త ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నో సార్లు రాజ్యాంగాన్ని పున:సమీక్షించారని గుర్తుచేశారు. అంబెడ్కర్ స్పూర్తితోనే రాజ్యాంగంలో పున:సమీక్షలు జరుగుతాయని, అందులో తప్పు ఏముందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఎం తప్పు లేదన్నారు. తెలంగాణ బీజేపీ వాళ్లకు దమ్ము ఉంటే బయ్యారం స్టీల్ ప్లాంట్, సాగు నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా,గిరిజన యూనివర్సిటీని  తీసుకురావాలని సవాల్ విసిరారు.

ప్రభుత్వ సంస్థలు అమ్మడమే బీజేపీ పనిగా పెట్టుకుందని గుత్తా విమర్శించారు. బీజేపీ పాలనలో అంబానీలు, ఆదానీలు తప్ప పేద ప్రజలు ఎవ్వరు బాగు పడలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది అని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి చూసి ఓర్వలేక బీజేపీ కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం తెలంగాణ బీజేపీ ఎంపీలకు లేదన్నారు. చవకబారు ఆరోపణలను బీజేపీ నాయకులు ఆపాలి అని హితవు పలికారు. చేతకాని దద్దమ్మలా బీజేపీ వాళ్ళు అవాకులు చవాకులు పేళుతున్నారని మండిపడ్డారు. చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చమంటే కూడా బీజేపీ వాళ్లకు చేతకావడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది మాట్లాడినా.. వివాదం చేయడమే  బీజేపీ వాళ్ళు పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ వాళ్లకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని గుత్తా సుఖేందర్ రెడ్డి హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement