Monday, April 29, 2024

TS | గ్రూప్‌-1 ప్రిలిమ్స్ మళ్లీ నిర్వహించాల్సిందే.. టీఎస్‌పీఎస్‌సీ అప్పీల్‌ను కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు విషయంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌సీఎస్‌సీ)కు హైకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను మళ్లిd నిర్వహించాల్సిందేనని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఈమేరకు స్పష్టం చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఇటీవల ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌ సమర్థించడంతో టీఎస్‌పీఎస్‌సీ బోర్డు సందిగ్ధంలో పడింది. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌ నిలిపివేస్తుందని భావించిన టీఎస్‌పీఎస్‌సీకి షాక్‌ తగిలినట్లయింది.

టీస్‌పీఎస్‌సీ చేసిన అప్పీల్‌ను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసింది. దీంతో ఏంచేయాలనే దానిపై టీఎస్‌పీఎస్‌సీ బోర్డు తర్జనభర్జన పడుతోంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో లోపాలున్నాయని, దాన్ని రద్దు చేసి మళ్లిd నిర్వహించాలని హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్‌లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. పరీక్షలో బయోమెట్రిక్‌ వివరాలు తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా హాల్‌టికెట్‌ నంబర్‌ లేకుండానే ఓఎంఆర్‌ షీట్లు ఇచ్చారని కోర్టు దృష్టికి అభ్యర్థులు తీసుకెళ్లారు. అభ్యర్థుల పిటిషన్‌పై కొన్ని రోజులుగా విచారణ జరిపిన హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేసి మళ్లిd నిర్వహించాలని ఇటీవల తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు టీఎస్‌పీఎస్‌సీ సోమవారం అప్పీల్‌ చేసింది. దీంతో దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను మళ్లిd నిర్వహించాల్సిందేనని బుధవారం నాడు తీర్పును వెలువరించింది.

పరీక్ష రద్దుపై విచారణ చేపట్టిన డివిజన్‌ బెంచ్‌ టీస్‌పీఎస్‌సీపై ప్రశ్నల వర్షం కురిపించింది. నోటిఫికేషన్‌లో ఇచ్చిన విధంగా అభ్యర్థుల నుండి బయోమెట్రిక్‌ తీసుకోవాలని కోర్టు పేర్కొంది. నిబంధనలను టీఎస్‌పీఎస్‌సీ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో నిర్వహించిన పరీక్షల్లో అమలు చేసిన బయోమెట్రిక్‌ వివరాలను కోర్టు ఆదేశాలమేరకు టీఎస్‌పీఎస్‌సీ సమర్పించింది. ఈ మేరకు ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత సింగిల్‌ జడ్డి బెంచ్‌ ఇచ్చిన తీర్పు సబబే అని డివిజన్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది.

- Advertisement -

సుప్రీం కోర్టుకు వెళ్తే ఎలా ఉంటుంది?….
మొదటి సారి పేపర్‌ లీక్‌తో గ్రూప్‌-1 రద్దు…రెండోసారి కూడా బయోమెట్రిక్‌ కారణంగా పరీక్షను రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో టీఎస్‌పీఎస్‌సీ సందిగ్ధంలో పడింది. ఏం చేయాలనేదానిపైన టీఎస్‌పీఎస్‌సీ తర్జనభర్జన పడుతోంది. పరీక్ష రాసిన 2.32 లక్షల మంది అభ్యర్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారడంతో మరోవైపు ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. టీఎస్‌పీఎస్‌సీని ప్రక్షాలళన చేయాలని, కమిషన్‌ ఛైర్మన్‌ జనార్థన్‌ రెడ్డి రాజీనామా చేయాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తున్నాయి. మొదటి సారి పేపర్‌ లీకైనప్పుడే దానికి బాధ్యతవహిస్తూ ఛైర్మన్‌ రాజీనామాకు సిద్ధమయ్యారనే కథనాలు వినిపించాయి. కానీ ఆయన చేయలేదు. ఇప్పుడు రెండోసారి కూడా తన రాజీనామా అంశం తెరమీదకు వస్తోంది.

ఇదిలా ఉంటే, ఈ క్రమంలో డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో సవాల్‌ చేయాలా? వద్దా? లేకుంటే పరీక్షను మళ్లిd నిర్వహించాలా? అన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదే అంశంపై చర్చించేందుకు టీఎస్‌పీఎస్‌సీ పాలకమండలి బుధవారం అత్యవసరంగా సమావేశమైంది. ఒకవేళ సుప్రీం కోర్టుకు వెళ్తే అక్కడ కూడా హైకోర్టును సమర్థిస్తూ తీర్పు వస్తే ఎలా అన్న దానిపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడోసారి పరీక్షను నిర్వహిస్తే అది వ్యయప్రయాసలతో కూడిన పనవుతుందని భావిస్తోంది. దీనికి తోడూ అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. వెరసి టీఎస్‌పీఎస్‌సీపై అభ్యర్థుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. పరీక్షలను సజావుగా నిర్వహించలేదనే అపవాదును మూట్టగట్టుకున్నట్లు అయింది.
ఎన్ని సార్లు రాయాలి.. ఎన్ని సంవత్సరాలు చదవాలి?…

తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తొలిసారిగా 503 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను 2022, ఏప్రిల్‌ 26న టీఎస్‌పీఎస్‌సీ జారీచేసింది. దీనికి 3,80,081 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా గతేడాది అక్టోబర్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్షను 2.85 లక్షల మంది రాశారు. ఆ తర్వాత పేపర్‌ లీక్‌ అయినట్లు తేలడంతో ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసింది. దీంతో పరీక్షను మళ్లిd ఈ ఏడాది జూన్‌ 11న ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షను 2.32 లక్షల మంది రాశారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక కీని కూడా టీఎస్‌పీఎస్‌సీ ఇప్పటికే విడుదల చేసింది. పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ సహా పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ జరిపిన కోర్టు ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్‌ బెంచ్‌, డివిజన్‌ బెంచ్‌ రెండూ కూడా తీర్పు వెలువరించడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మళ్లిd పరీక్ష రాయాలా? అన్న నైరాశ్యంలో ఉన్నారు. ఇప్పటికే రెండు సార్లు రాశామని, డబ్బు సమయం వృథా అయినట్లేనా? అని ప్రశ్నిస్తున్నారు. తప్పు టీఎస్‌పీఎస్‌సీది శిక్ష తమకా అని పలు విద్యార్థి సంఘాలు, పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది అభ్యర్థులు ఉద్యోగాలకు సెలవులు పెట్టి, రాజీనామా చేసి మరీ గ్రూప్‌-1కు ప్రిపేరయ్యారు. తీరా ఫలితాలు వెలువరించే సమయానికి టీఎస్‌పీఎస్‌సీ నిర్లక్ష్యం కారణంగా పరీక్ష రద్దు కావడం బాధాకరంగా ఉందంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement