Tuesday, May 21, 2024

జన్‌పథ్ బంగ్లా నుంచి చిరాగ్‌ పాశ్వాన్‌ను ఖాళీ చేయించిన ప్ర‌భుత్వం

దివంగత కేంద్ర మాజీ మంత్రి రామ్‌ విలాస్ పాశ్వాన్‌ కుమారుడు, ఎంపీ చిరాగ్‌ పాశ్వాన్‌ను ప్రభుత్వ బంగ్లా నుంచి ఖాళీ చేయించారు. దీని కోసం బుధవారం ఉదయం ఆ బంగ్లాకు ఒక బృందాన్ని పంపి చిరాగ్‌ సామగ్రిని అక్కడి నుంచి తొలగించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశ రాజధాని ఢిల్లీలోని 12 జన్‌పథ్‌ రోడ్డులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధికార నివాసానికి సమీపంలోని బంగ్లాను కేంద్ర మంత్రులకు కేటాయిస్తారు. లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) వ్యవస్థాపకుడు రామ్‌ విలాస్ పాశ్వాన్‌ ఈ బంగ్లాను చాలా ఏండ్లుగా వినియోగించారు. 2020 అక్టోబర్‌లో ఆయన చ‌నిపోయారు. దీంతో పాశ్వాన్‌ కుమారుడు చిరాగ్‌ ఈ బంగ్లాలో ఉంటున్నారు.

అయితే దీన్నీ ఖాళీ చేయాల‌ని కేంద్ర గృహ మంత్రిత్వశాఖకు చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్‌ గత ఏడాది నోటీసు ఇచ్చింది. మరోవైపు లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఢిల్లీ కార్యాలయం చిరునామాగా ఈ బంగ్లానే పేర్కొన్నారు. ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, సమావేశాలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. అయితే రామ్‌ విలాస్ పాశ్వాన్‌ మరణాంతరం కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌, సోదరుడు పశుపతి కుమార్‌ పరాస్‌ మధ్య విభేదాలొచ్చాయి. కాగా, కేంద్ర మంత్రి అయిన పశుపతి కుమార్‌ పరాస్‌, ఎల్జేపీని పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రామ్‌ విలాస్ పాశ్వాన్‌ బంగ్లాలో ఉంటున్న చిరాగ్‌ పాశ్వాన్‌ను తాజాగా అక్కడి నుంచి ఖాళీ చేయించిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement