Sunday, April 28, 2024

ఈ ఆటోడ్రైవర్.. కరోనా రోగుల పాలిట ఆపద్బాంధవుడు

కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో పక్కవారికి సాయం చేసేందుకు భయపడి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. కరోనా వైరస్ కొంద‌రికి కాసులు కురిపించే వ్యాపారంగా మారిపోయింది. ముఖ్యంగా అంబులెన్సులు, ఆస్ప‌త్రుల సిబ్బంది అయితే క‌రోనా పేరుతో అందిన‌కాడికి దండుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఎవ‌రైనా క‌రోనా వ‌చ్చిందనే అనుమానంతో టెస్టులు చేయించుకోవాల‌ని ఏదైనా డ‌యాగ్నోసిస్ సెంట‌ర్‌కు వెళ్లాల‌నుకుంటే.. అస‌లు రేటుకు 10 రెట్ల ఛార్జీలను ఆటోలు, ప్రైవేట్ క్యాబ్‌లకు స‌మ‌ర్పించుకోవాల్సి వ‌స్తోంది. దేశ‌వ్యాప్తంగా ఇప్పుడు ఇవే ప‌రిస్థితులే నెల‌కొన్నాయి. ఇలాంటి స‌మ‌యంలో జార్ఖండ్‌కు చెందిన‌ ఆటో డ్రైవ‌ర్ ర‌వి అగ‌ర్వాల్ మాన‌వత్వం ఇంకా బ‌తికే ఉంద‌ని నిరూపిస్తున్నాడు.

క‌రోనా రోగులు ఆస్ప‌త్రుల‌కు వెళ్లేందుకు వాహ‌నాలు దొర‌క్కపోవడంతో చావుబ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడే ప‌రిస్థితుల‌ను చూసి రవి అగర్వాల్ చలించిపోయాడు. త‌న‌ వంతుగా ఏదైనా సాయం చేయాల‌న్న ఆలోచ‌న‌తో.. త‌న ఆటోలో క‌రోనా సోకిన వారికి ఉచిత ప్ర‌యాణం అంటూ బోర్డు పెట్టాడు. దీంతో చాలా మంది అత‌ని ఆటోలో స‌కాలంలో ఆస్ప‌త్రికి వెళ్లి ప్రాణాలు నిలుపుకుంటున్నారు. ఏప్రిల్ 15 నుంచి ఇలా ఉచిత సేవ‌లు అందిస్తున్నాడు. సోష‌ల్ మీడియాలోనూ త‌న ఫోన్ నెంబ‌ర్‌ను పెట్టి.. అవ‌స‌ర‌మైన వారు కాల్ చేయాల‌ని చెప్తున్నాడు. ర‌వి అగ‌ర్వాల్ సేవాగుణంపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. కరోనా బాధితులు అయితే దేవుడు ఆటో డ్రైవ‌ర్ రూపంలో మన ముందుకు వచ్చాడని కొనియాడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement