Monday, April 29, 2024

Theaters : ఏపీలో సినిమా థియేటర్లు బంద్.. పలు జిల్లాల్లో సీల్!

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారంపై వివాదం కొనసాగుతోంది.  రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గించడంతో థియేటర్ల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. ఆర్థిక భారాన్ని మోయలేక.. థియేటర్లను నడపడం తమవల్ల కాదంటూ యజమానులే స్వచ్ఛందంగా మూసేశారు. ప్రభుత్వం నిర్ణయంతో ఏపీలోని గ్రామ పంచాయతీల పరిధిలో నడిచే 55 థియేటర్లు ఇప్పటికే మూతపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలో 45 థియేటర్లు బంద్ అయ్యాయి. అనంతపురం, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో థియేటర్లను యజమానులే స్వచ్ఛందంగా మూసేశారు.

మరోవైపు నిబంధనల పేరిట అధికారులు థియేటర్లలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో 11 థియేటర్లను అధికారులు సీల్ చేశారు. ఓ థియేటర్లకు రూ.20 వేల జరిమానా విధించారు. చిత్తూరు జిల్లాలో 18, విజయనగరంలో 6, పశ్చిమగోదావరి జిల్లాలో 3, కర్నూలులో ఒక థియేటర్ ను అధికారలు సీల్ వేశారు. కడపలో ఐదు థియేటర్లు మూసివేయాలని అధికారుల నోటీసులు ఇచ్చారు.

మరోవైపు థియేటర్లు సీల్ చేయడాన్ని విజయవాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వ్యతిరేకిస్తోంది. జేసీకి మాత్రమే సీల్ చేసే అధికారం ఉందని వారు అంటున్నారు. థియేటర్ మూసివేయాలంటే 15 రోజుల ముందు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ చెబుతున్నారు. హైకోర్టులో కేసు ఉండగా తనిఖీలు సరికాదని తెలిపారు.

రాష్ట్రంలో థియేటర్లు మూత పడడంతో సినీ ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అఖండ, పుష్ప చిత్రాలు థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఈ రోజు నానా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదలైంది. అయితే, పలు థియేటర్లను మూసివేయడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గువుతున్నారు. ప్రభుత్వం నిర్ణయంపై నిన్న హీరో నాని కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ తగ్గాక కొద్ది రోజుల క్రితం పున: ప్రారంభం అయిన థియేటర్లకు అఖండ, పుష్ప చిత్రాలు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ప్రభుత్వం ఇటీవల తెచ్చిన జీఓ 35తో థియేటర్ల యజమానులపై పిడుగు పడినట్లయింది. జీఓ 35 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ఏసీ థియేటర్లలో టికెట్ల ధరలు రూ.10, రూ.15, రూ.20.. నాన్‌ ఏసీ థియేటర్లలో రూ 5, రూ.10, రూ.15.. మున్సిపాలిటీల్లో రూ.30, రూ.50, రూ.70.. కార్పొరేషన్‌ పరిధిలోని థియేటర్‌లలో రూ.40, రూ.60, రూ.100లకు విక్రయించాలని ప్రభుత్వం పేర్కొంది. అయితే, తగ్గించిన ధరలతో వచ్చే ఆదాయం నిర్వహణ ఖర్చులకు కూడా సరిపోదని యజమానులు స్వయంగా థియేటర్లకు తాళాలు వేసి మూసివేస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement