Monday, April 29, 2024

Exclusive – వృద్దులు కాదు…వార‌ధులు…

న్యూఢిల్లీ , ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ఆవతరించింది. అయితే రెండు దశాబ్దాల్తో పోలిస్తే ఇక్కడ జననాల రేటు తగ్గింది. అదేసమయం లో జీవన ప్రమాణాలు పెరిగాయి. అలాగే ఆయుర్దా యంలోవృద్ధి నమోదైంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువతున్న దేశం భారతే. అయితే ఈ హోదా భారత్‌కు దీర్ఘకాలం కొనసాగే అవకాశాలైతే లేవు. ప్రస్తతుం దేశ జనాభాలో 25ఏళ్ళ లోపు వయస్కులు 41శాతం ఉన్నారు. 25నుంచి 64ఏళ్ళలోపు వయస్కులు 52శాతం ఉన్నారు. 65 ఏళ్ళపైబడ్డ వృద్ధులు మొత్తం జనాభాలో ఇప్పుడు ఏడు శాతం మాత్రమే. అయితే జననాల రేటు రాన్రా ను తగ్గుతుండడంతో ప్రస్తుతం 28 సంవత్సరాలుగా ఉన్న భారతీయు సగటు వయసు రానున్న 30 ఏళ్ళలో 58 ఏళ్ళకు పెరగనుంది. అప్పటికి దేశ జనాభాలో 24శాతం మంది వృద్ధులుంటారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వృద్ధుల సంక్షేమా నికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నాయి. అయితే భారత్‌లో వృద్ధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తు న్నాయి. మానవ సమాజంలో వృద్ధుల్ని అనుభవం, జ్ఞానం, వారసత్వ సంపదలకు ప్రతీకలుగా భావిస్తా రు. సంస్కృతిని భవిష్యత్‌ తరాలకందించే వారధులు గా పరిగణిస్తారు. మానవ జీవనంలో వృద్ధాప్యం అని వార్యమైన తప్పించుకోలేని దశ. అయితే భారత్‌లో ప్రభుత్వాలు ఈ వాస్తవాన్ని విస్మరించాయి. వృద్ధుల హక్కుల్ని కాలరాస్తున్నాయి. వార్ని మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

ఈ దేశంలో 65ఏళ్ళు దాటిన పౌరులందర్నీ చంపేయండంటూ రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్‌ ఓ దశలో పార్లమెంట్‌లోనే ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడంతో దేశవ్యాప్తంగా వృద్ధుల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న అనుచిత వైఖరి ఒక్కసారిగా వెల్లడైంది. వివిధ దేశాల్లో వృద్ధుల్ని సీనియర్‌ సిటిజన్లుగా, మార్గదర్శకులుగా భావిస్తుంటే, ఇక్కడ వృద్ధాప్యాన్ని ఓ నేరంగా పరిగణిస్తున్నారు. దేశంలో 70ఏళ్ళపైబడ్డ వృద్ధులకు ఆరోగ్య బీమా పొందే అర్హత లేదు. నెలవారీ చెల్లింపులక నుగుణంగా రుణంపొందే అవకాశం లేదు. వారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ మంజూరు కాదు. వారికెవరూ ఏ పని ప్రత్యేకంగా కేటాయించరు. దీంతో వారు మరొకరిపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. లేకుంటే వారి మనుగడ సాధ్యం కావడం లేదు. పదవీ విరమణ చేసేవరకు వారు ప్రభుత్వానికి అన్నిరకాల పన్నులు, బీమా ప్రీమియంలు చెల్లిస్తారు. వృద్ధులయ్యాక కూడా వారు కొనుగోలు చేసే ప్రతి వస్తువుపైన పన్నులు కడతారు. కానీ వృద్ధుల కోసం ప్రభుత్వం మాత్రం ఎటువంటి ప్రయోజనాలు కల్పించదు. గతంలో రైల్వేల్లో అమలైన 50శాతం రాయితీని కూడా కోవిడ్‌ పేరిట నిలిపేశారు. రాజకీయాల్లో ఉన్న వృద్ధులు ఎమ్‌పిలు, ఎమ్మెల్యేలే కాదు.. ఏ పదవినైనా అధిష్టించొచ్చు. వారికి ప్రభుత్వం జీతభత్యాలు చెల్లిస్తుంది.

కానీ సాధారణ వృద్ధులు ఏ పనికీ పనికిరారన్న భావం ప్రభుత్వాల్లో ఏర్పడిపోయింది. ఈ వృద్ధుల్ని తమ పిల్లలు పట్టించుకోని పరిస్థితుల్లో వారంతా అనాధాశ్రమాల వైపు పరుగులెడుతున్నారు. వృద్ధుల్ని కేవలం ఓటర్లుగానే చూస్తున్న ప్రభుత్వాలు వారంతా ఏకతాటిపైకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడితే జరిగే పరిణామాల్ని ఊహించుకోలేకపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వృద్ధులకు ప్రభుత్వాల్ని మార్చే శక్తి ఉంది. అందుకు అవసరమైన జీవితకాల అనుభవముంది. వృద్ధుల్లో 90శాతం మంది స్వీయపోషణకే ఆసక్తి చూపుతున్నారు. కుటుంబ సభ్యులు లేదా మరొకరిపై ఆధారపడ్డం వారికేమాత్రం ఇష్టంగాలేదు. వృద్ధులు కొన్ని రాయితీల కోసం దేశవ్యాప్తంగా పలు సందర్భాల్లో ఉద్యమాలు నిర్వహించారు.

తమకు హోదా ప్రకారం పెన్షన్‌ ఇవ్వాలని, రైల్వే, బస్సు, విమాన ప్రయాణాల్లో రాయితీలు కల్పించాలని, చివరి శ్వాస వరకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమా కల్పించాలని, కోర్టు కేసుల్లో ముందస్తు ప్రాధాన్యతనివ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం 15 ఏళ్ళ కాలపరిమితి నిండిన వాహనాల లైసెన్స్‌ను ప్ర భుత్వం రద్దు చేస్తోంది. అయితే వయసులో ఉండగా కొనుగోలు చేసిన వాహనాలపై పదేళ్ళలో కేవలం 40నుంచి 50వేల కిలోమీటర్లు మాత్రమే వీరు ప్రయాణస్తున్నారు. బాధ్యతల్నుంచి వైదొలగిన అనంతరం వీటిపై జీవితాన్ని అనుభవించే దశలో వీటి లైసెన్స్‌ రద్దు చేయడాన్ని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. వృద్ధులకు చెందిన వాహనాల కాలపరిమితి విషయంలో ప్రభుత్వం సమీక్ష జరపాలని కూడా వీరు కోరుతున్నారు.

అనాధలుగా వృద్ధులు
భారత్‌లో వృద్ధుల్ని అనుత్పాదక వర్గంగా పరిగణిస్తున్నారు. వార్ని భారంగా భావిస్తున్నారు. దేశంలో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. కేంద్రక కుటుంబాలు ఆవిర ్భవించాయి. దీంతో వృద్ధులు అనాధలవుతున్నారు. ఆధునిక పాశ్చాత్య జీవనంపై ఆసక్తి పెంచుకున్న సమాజం వృద్దుల్ని పట్టించుకోవడంలేదు. వారి సామాజిక, ఆర్ధిక భద్రతల్ని పరిగణనలోకి తీసుకోవడంలేదు. కుటుంబ సభ్యులుకూడా వృద్ధుల అవసరాల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారు. వారికి కడుపు నిండా తిండిపెట్టడం లేదు. అవసరానికి తగ్గ మందులు కొనడం లేదు. పైగా భావోద్వేగాల్తో బెదిరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వార్ని తిట్టడం, కొట్టడం, అరవడం వంటి చర్యలు కూడా భారత్‌లో చాలా చోట్ల కనిపిస్తాయి.

- Advertisement -

హక్కులపై ఐరాస తీర్మానం
వాస్తవానికి ఐక్యరాజ్యసమితి వృద్ధుల కోసం కొన్ని హక్కుల్ని నిర్దేశించింది. ఈ మేరకు 1991లోనే కొన్ని ప్రత్యేక తీర్మానాలు చేసింది. వీటి మేరకు ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కగిలిన దేశాలన్నీ వృద్దుల సంక్షేమానికి కొన్ని ప్రత్యేక పథకాల్ని అమలు చేయాలి. వృద్దులు సమాజంలో గౌరవంగా జీవించగలిగే పరిస్థితి కల్పించాలి.కుటుంబ, సామాజిక ఒత్తిళ్ళకు దూరంగా స్వతంత్రంగా జీవించే హక్కులివ్వాలి. వారికి ప్రభుత్వం ఆర్థిక ఆసరా అందించాలి. వృద్దుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. అలాగే భారత రాజ్యాంగంలోని 41వ నిబంధన ప్రకారం వృద్దులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిరకాల సహాయ, సహకారాల్ని అందించాలి. వారి బాధ్యతను భుజానవేసుకోవాలి. వారి సంక్షేమానికవసరమైన పథకాలు అమలు చేయాలి.

అలాగే భారత్‌ పార్లమెంట్‌ 1950లో వృద్ధాప్య పింఛన్‌ చట్టాన్ని తెచ్చింది. 1956లో హిందూ దత్తత నిర్వహణ చట్టాన్ని, 2007లో తల్లిదండ్రుల, వృద్ధుల సంక్షేమం, నిర్వహణ చట్టాన్ని చేసింది. ఈ చట్టాల మేరకు తమ సంతానం నుంచి అన్నిరకాల సహాయాన్ని పొందే హక్కు తల్లిదండ్రులు కలిగుంటారు. వృద్ద తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తే ఆ సంతానాన్ని ఈ చట్టంలోని సెక్షన్‌ 20(3)ప్రకారం శిక్షించొచ్చు. అలాగే ఆ వృద్ధులు గతంలో సంతానానికిచ్చిన ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. అవసరమైన చోట ప్రభుత్వాలే వృద్దాశ్రమాల్ని ఏర్పాటు చేసి వృద్ధులకు సంరక్షణ కల్పించాలని కూడా ఈ చట్టాల ఉద్దేశ్యం. ఈ చట్టాల్ని పటిష్టంగా అమలు చేస్తే దేశంలో వృద్దుల పట్ల నిరాధరణ తగ్గుతుంది. సంతానం, సమాజం కంటే కూడా ప్రభుత్వాలకు వీరి పట్ల ఎక్కువ బాధ్యతుంది. వృద్దులకు జీవిత, ఆరోగ్య బీమా సదుపాయాల్తో పాటు రుణాన్ని పొందే హక్కు కల్పిస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సామాజిక భద్రత ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement