Friday, May 17, 2024

పరీక్షా కాలం! టెన్త్‌ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి.. పరీక్షా సమయం అరగంట పెంపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వచ్చే నెలలో జరగనున్న పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా విద్యా శాఖాధికారులను ఆదేశించారు. ఐదు లక్షలకు పైగా విద్యార్థులు మే 23 నుంచి జూన్‌ ఒకటవ తేదీవరకు జరిగే పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని పాఠశాల విద్య సంచాలకుల కార్యాలయంలో జరిగిన జిల్లా విద్యా శాఖాధికారుల సమావేశంలో పదో తరగతి పరీక్షల ఏర్పాట్లు, ఇంగ్లీష్‌ మీడియం బోధన, టెట్‌ పరీక్ష నిర్వహణ, మన ఊరు-మన బడి పనులపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో పదవ తరగతి పరీక్షలను ఆరు పేపర్లలోనే నిర్వహించబోతున్నామని మంత్రి తెలిపారు.

విద్యార్థుల సౌకర్యార్ధం మొత్తం సిలబస్‌లో 70 శాతం సిలబస్‌తోపాటు, పరీక్షా సమయాన్ని కూడా అరగంట పెంచామని, ప్రశ్నాపత్రంలో అధిక ఛాయిస్‌ కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి, పరీక్షలు సజావుగా సాగే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా విద్యా శాఖాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, పాఠశాల విద్యను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు వసతులను కల్పించేందుకు మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించామని మంత్రి తెలిపారు. రానున్న విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలల్లో మార్పు కనిపించాలని మంత్రి సూచించారు. మూడేళ్ళలో అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థ పాఠశాలల్లో మౌళిక వసతుల అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని మంత్రి తెలిపారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నామని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఆంగ్ల మాధ్యమంలో బోధించే విధంగా అవసరమైన శిక్షణను రానున్న విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి అయ్యేలా చూడాలని కోరారు. నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను సజావుగా జరిగేలా, దానికి సంబంధించి పరీక్షా కేంద్రాల ఎంపిక, నిర్వహణలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా విద్యా శాఖాధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement