Tuesday, April 23, 2024

ఈటల రాజీనామా ఆమోదం… హుజురాబాద్ కు ఉప ఎన్నిక తథ్యం

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు. శనివారం ఉదయం అమరవీరులకు నివాళులు అర్పించిన ఈటల స్పీకర్ ఫార్మాట్ లో రూపొందించిన తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి అందించారు. ఆ రాజీనామా పత్రాన్ని పరిశీలించిన స్పీకర్ పోచారం ఆమోద ముద్ర వేశారు. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం సీటు ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ రాజీనామా చేసినట్లు పేర్కొంది. హుజురాబాద్ ఎమ్మెల్యే సీటు ఖాళీ అయినట్లు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ అసెంబ్లీ కార్యాలయం తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఏడేళ్లల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తొలి టీఆరెస్ ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ నిలిచారు. ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఇది మూడో సారి. తెలంగాణ ఉద్యమంలో 2008 , 2010లో రెండు సార్లు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తాజాగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

అంతకుముందు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా సందర్భంగా ఈటల మాట్లాడుతూ, హుజూరాబాద్ లో కౌరవులకు, పాండవులకు మధ్య యుద్ధం జరగబోతోందని తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక యావత్ తెలంగాణ ప్రజలకు, కేసీఆర్ కుటుంబానికి మధ్య పోరాటం వంటిదని పేర్కొన్నారు. తెలంగాణ‌లో నియంతృత్వ పాల‌న కొన‌సాగుతోందన్నారు. తాను ప్ర‌జ‌ల మద్దతుతోనే ఇన్నాళ్లూ ఎన్నిక‌ల్లో గెలుస్తూ వ‌స్తున్నానని అన్నారు.ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి తనకు ఇన్నాళ్లు టీఆర్ఎస్ పార్టీ బీఫాం ఇచ్చి ఉండొచ్చు కానీ, తాను గెలుస్తున్న‌ది మాత్రం ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతోనే అని స్పష్టం చేశారు. అధికార దుర్వినియోగం చేసి టీఆర్ఎస్ ఉప ఎన్నిక‌లో గెల‌వాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోందని ఈటల ఆరోపించారు. 

భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొన్న ఈటలను సీఎం కేసీఆర్ తన మంత్రివర్గం నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈటల బీజేపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 14న ఈటల సహా ఆయన అనుచరులు బీజేపీలో చేరనున్నారు. శనివారం సాయంత్రం ఈటల ఢిల్లీ వెళ్లనున్నారు.  ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఈటల వర్గం అన్ని ఏర్పాట్లు చేసుకుంది.  ఆయన వెంట రమేశ్ రాథోడ్, ఏనుగు రవీందర్ రెడ్డి వంటి నేతలు కూడా హస్తిన వెళ్లి బీజేపీలో చేరనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement