Wednesday, May 1, 2024

Suicide: జాబ్​ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న గ్రాడ్యుయేట్​.. వరంగల్​ వాసిగా గుర్తింపు

తెలంగాణలోని సికింద్రాబాద్‌లో 22 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అతని డెడ్​బాడీని గురువారం రాత్రి పోలీసులు కనుగొన్నారు. సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్‌లోని ఓ లాడ్జిలో ఈ గ్రాడ్యుయేట్​ శవమై కనిపించాడు. ఉద్యోగం దొరక్క, కుటుంబ సభ్యులకు తెలియకుండా చేసిన అప్పుల వల్లే అతడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డట్టు ప్రాథమికంగా తెలుస్తోంది.

కాగా, మృతుడు వరంగల్ జిల్లాకు చెందిన లక్ష్మీసాయిగా పోలీసులు గుర్తించారు. ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగవేటలో ఉన్నాడని, ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నట్టు ఇంటి నుంచి హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్‌లోని గురుద్వారా సాహెబ్‌ సమీపంలోని ఓ హోటల్‌లో దిగాడు. రెండు రోజులుగా హోటల్​లోని తన గది నుంచి బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో గురువారం రాత్రి బలవంతంగా తలుపులు తెరిచి చూడగా శవమై కనిపించాడు.

మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో అతను సోమవారమే చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. డెడ్​బాడీని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిని సందర్శించిన గోపాలపురం పోలీసులకు అతను రాసిన సూసైడ్ నోట్‌ లభించింది. అందులో ”నేను తిరిగి చెల్లించలేని అప్పు చేశాను. ఎన్నో అబద్ధాలు చెప్పి ఉచ్చులో పడ్డాను. దయచేసి నన్ను క్షమించండి” అని ఉంది.

గమనిక: ఎవరిలోనైనా ఆత్మహత్యా ధోరణులు కనిపించానా.. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిస్తే.. ఆత్మహత్య నిరోధక సంస్థల హెల్ప్ లైన్ నంబర్‌లు కొన్ని ఇక్కడ ఇస్తున్నాం.. వారికి ఫోన్​ చేయడం ద్వారా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన నుంచి కాపాడవచ్చు..

  1. తెలంగాణ: రోషిణి ఫౌండేషన్ (040-66202000) – 9AM – 11 PM
  2. స్నేహ ఫౌండేషన్- 044-24640059 – 24×7
  3. ఆస్రా: 022 2754 6669, 24×7
Advertisement

తాజా వార్తలు

Advertisement