Friday, April 26, 2024

గిరిజనులను మోసం చేయొద్దు, ఆదివాసీలను ఆగంజేస్తే ఊరుకోం.. మావోయిస్టుల లేఖ

హరితహారం పేరుతో గిరిజనులను అడవికి దూరం చేసే పనిలో టీఆర్​ఎస్​ ప్రభుత్వం ఉందని, అట్లాంటి పనులు సాగనివ్వబోమని హెచ్చరించింది మావోయిస్టు పార్టీ. ఈమేరకు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్​ పేరిట ఓ లేఖ మీడియాకు చేరింది. మావోయిస్టు లేఖలో ఏముందంటే..

‘‘సామ్రాజ్యవాదుల, కార్పోరేట్ల దోపిడీ ప్రయోజనాల కోసం ప్రకృతి వనరులను ధారదత్తం చేయడానికి అడివితో పెనవేసుకొని ఉన్న ఆదివాసుల జీవితాలను కేసిఆర్ ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేస్తుంది. హరితహారం పేరుతో అడవులపై పూర్తి హక్కులు, అర్హతలు కలిగి ఉన్న ఆదివాసీలను అడవి నుండి తరిమివేసే కుట్రలు జరుగుతున్నాయి. ఇప్పటికే అసిఫాబాద్ జిల్లాలో టైగర్ జోన్ పేరుతో ఆదివాసీ గూడాలను ఖాళీ చేయించడం ద్వారా, వారి జీవితాలను చిన్న భిన్నం చేశారు. ఆదివాసీ వ్యతిరేకి అయిన కేసిఆర్ ఇప్పుడు హరితహారం పేరుతో ఆదివాసీలను హననం చేయడానికి రూపకల్పన చేశారు. దీనితో హరితహారంకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూమి పోరాటాలు ప్రతి రోజు ఏదో ఒక చోటున మిలిటెంటుగా కొనసాగుతున్నాయి.

తరాలుగా సాగుచేసుకుంటున్న భూముల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఫారెస్టు శాఖ అధికారులు ద్వారా దౌర్జన్యంగా మొక్కలు నాటడం, కంచెలు వేయడం, ట్రెంచీలు తవ్వించడం వంటివి చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన ప్రజలపై దాడులు కొనసాగుతున్నాయి. ప్రజలను మానసికంగా వేధించడం, భౌతిక దాడులకు పాల్పడుతూ భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం కోయపోచగూడాలో హక్కు పత్రాలు కలిగి ఉన్న 300 ఎకరాల భూమిలో నివాసాలు ఏర్పర్చుకుంటున్న ఆదివాసీలపై పోలీసులు, ఫారెస్టు అధికారులు కలిసి మహిళలని కూడా చూడకుండా దాడులు చేసి, ఇండ్లను కూల్చి అక్రమ కేసులు బనాయించారు.

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడి గూడెంలో రైతులు విత్తనాలు వేస్తుండగా ఫారెస్టు అధికారులు అడ్డుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుబల్లి, ఆళ్లపల్లి, చింతలపాడు,రాయిపాడు, ముత్తాపురం, బర్లగూడెం, సత్యనారయణ పురం గ్రామాలలో మొక్కలు నాటుతుండగా ప్రజలు తిరగబడ్డారు. ఇలా వరంగల్, ములుగు, భూపాలపల్లి, అసిఫాబాద్, ఆదిలాబాద్, వనపర్తి, మహబూబ్ నగర్ వంటి ఏజెన్సీ జిల్లాల్లో ఎక్కడో ఒక్క చోట ఫారెస్టు జులుం, దౌర్జన్యాలు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసులకు రక్షణ కరవైంది.

తమ స్వయం ప్రత్తి కోసం బ్రిటిష్ వలస పాలన నుండి మొదలు ఇప్పటికి జల్, జంగల్, జమీన్ ఆత్మగౌరం కోసం ఆదివాసులు పోరాడుతూనే ఉన్నారు. ఆదివాసీల విరోచిత పోరాటాల ఫలితంగా 1/70 చట్టం, పెసా చట్టం 1996, ఎఫ్తార్ఎ, అటవీ హక్కుల చట్టం 2006 వంటి పలు ఆదివాసీ చట్టాలు రూపుదిద్దుకున్నాయి. కానీ, ఆ చట్టాలను అమలు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా కాలరాసివేసి అమాయక ఆదివాసులను బలవంతంగా గెంటివేసే పథకాలు రూపొందిస్తున్నది. ఆదివాసీల సొంత భూములను ఆదివాసేతరులు అప్పు వడ్డీ కిందికి బలవంతంగా లాక్కోవడంతో పోడు భూములపై ఆధారపడి జీవనం గడుపుతున్నారు.

- Advertisement -

ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలివ్వకుండా అక్రమంగా మొక్కలు నాటడం, కంచెలు వేయడం, కందకాలు త్రవ్వడం చేస్తున్నారు. హక్కు పత్రాల కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ ఇప్పటికీ హక్కు పత్రాలు ఇవ్వడం లేదు. బహుళజాతి సంస్థల లాభాల కోసం అడవులను ధారదత్తం చేసి హరితహారం, పచ్చదనం అంటూ నీతి మాటలు చెపుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మూలంగా పోడు భూముల సమస్య జీవన మరణ సమస్యగా మారింది. అందుకే పోడు భూముల పట్టాల కోసం ఆదివాసీలు మిలిటెంట్గా పోరాడుతున్నారు.

ఇదే పోరాట సాంప్రదాయాన్ని పోడు భూములకు పట్టాలు సాధించుకునే వరకు మరింత మిలిటెంట్ కొనసాగించండి. జల్, జంగిల్, జమీన్ ఆత్మగౌరవం కోసం కొమరంభీం పోరాట సంకల్పాన్ని, సంప్రదాయాన్ని కొనసాగించండి. దున్నే వారికే భూమి నినాదంతో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేపట్టండి. పోడు భూముల రైతులపై సాగుతున్న అటవీ శాఖ అధికారులు, పోలీసుల దాడులు ఆపుకోవాలి. ఆదివాసీలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి బాధ్యులైన అధికారులపై ఎస్టీ, ఎసీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి. సాగులో ఉన్న పోడుదారులందరికి 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలివ్వాలి. హరిత నిధి పేరుతో విద్యార్థుల వద్ద వసూలు చేయడాన్ని నిలిపి వేయాలి.”అని
మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ రాసిన లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement