Sunday, December 8, 2024

డాగ్స్​ సీక్రెట్​.. వాసన కాదు, వాయిస్​ వింటేనే గుర్తిస్తాయట..

పెంపుడు జంతువుల్లో డాగ్​ (కుక్క) ఎంత విశ్వాసంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఒక్కసారి దానికి మనం కొంచెం ఫుడ్​పెడితే చాలు.. దాని జీవితాంతం మనకు విశ్వాసం చూపుతూనే ఉంటుంది. ఇంట్లో పెంచుకునే పెట్​ నుంచి.. వీధి కుక్కల వరకూ మనం ఎప్పుడు కనిపించినా తోక ఊపుతూ మన చుట్టూ తిరుగుతుంటాయి. అయితే.. కుక్కలకు సంబంధించిన ఓ సరికొత్త అంశాన్ని పరిశోధకులు వెలుగులోకి తెచ్చారు. అదేంటంటే.. ఇప్పటిదాకా అందరూ కుక్కలు మనుషుల వాసనల ఆధారంగా వారిని గుర్తిస్తాయని అనుకున్నారు. కానీ, దీనికి డిఫరెంట్​గా ఉంది వారి పరిశోధనల్లో తేలిన అంశం..

కుక్కలు వాసనలను బట్టి యజమానులను గుర్తించవని, తమ యజమాని గొంతు ఎలా ఉన్నా గుర్తుపట్టగలవని తేలిందని కుక్కలపై పరిశోధన జరిగిన ఆండిక్స్ అటిలా తెలిపారు. తమ పరిశోధనల్లో ఇదే తేలిందని చెప్పారు. ఈ పరిశోధనలో భాగంగా 28 కుక్కలను వాటి యజమానులతో కలిసి ఓ ల్యాబ్‌కు తీసుకువచ్చారు హంగేరీలోని బుడాపెస్ట్ లోని ఐయోట్వోస్ లోరాండ్ యూనివర్సిటీ పరిశోధకులు. 28 కుక్కలను, వాటి యజమానులను ల్యాబ్‌లో దాక్కుని ఆడుకోవడానికి ఆహ్వానించారు. కుక్కలు తమ యజమానులను కనుగొనే పనిలో ఉండగా, కొందరు అపరిచితులను కూడా అక్కడ ఉంచారు. ఇప్పుడు ఆ కుక్కలకు యజమాని గొంతు, అపరిచితుని గొంతు వినపించారు.

యజమాని గొంతును 14 మంది అపరిచితుల స్వరాలతో మిక్స్ చేశారు.82% కేసులలో కుక్కలు తమ యజమానిని కనుగొన్నాయని పరిశోధకులు తెలిపారు. కుక్కలు శబ్దం ద్వారా మాత్రమే యజమానిని గుర్తిస్తాయని, వాసన ద్వారా కాదని శాస్త్రవేత్తలు తెలిపారు. చివరి రెండు రౌండ్‌లలో యజమాని స్వరాన్ని వినిపించారు. కుక్కలు ఆ గొంతును గుర్తుపట్టి యజమాని ఎక్కడ ఉన్నాడో గుర్తించాయి.  ఐయోట్వోస్ లోరాండ్ యూనివర్శిటీకి చెందిన ఎథాలజీ విభాగంలోని సీనియర్ పరిశోధకుడు తమస్ ఫరాగో మాట్లాడుతూ ఈ ప్రయోగంలో కుక్కలు వాటి వాసనపై ఎక్కువ ఆధారపడకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వాయిస్‌లో తేడాలు ఉన్నా కుక్కలు తమ యజమానిని గుర్తించినట్లు పరిశోధకుల బృందం కనుగొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement