Sunday, April 28, 2024

కార్యకర్త చెంప పగలకొట్టిన పీసీసీ అధ్యక్షుడు

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఓ కార్యకర్తపై చేయిచేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శుక్రవారం మాండ్యలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత మద్దెగౌడను డీకే శివకుమార్‌ పరామర్శించడానికి వెళ్లగా.. పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. డీకే శివకుమార్ నడుస్తుండగా, ఓ కార్యకర్త ఆయన తన భుజం మీద చెయ్యి వేసి ఫోటో తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో  డీకే శివకుమార్ సహనం కోల్పోయారు. తన భుజం మీద చేయి వేసేందుకు ప్రయత్నించిన ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. హద్దుమీరి ప్రవర్తించాడని , తనకు కనీస మర్యాద ఇవ్వలేదని ఆ కార్యకర్తపై మండిపడ్డారు. పార్టీ అధ్యక్షుడి వైఖరితో బిత్తరపోయిన ఆ కార్యకర్త అక్కడి నుంచి ముందుకు వచ్చేశాడు.  కార్యకర్తను డీకే చెంప మీద కొట్టిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ఈ ఘటనపై కర్ణాటక బీజేపీ వెంటనే విమర్శల దాడి మొదలుపెట్టింది. డీకే శివకుమార్ సొంత పార్టీ కార్యకర్తపైనే జులుం ప్రదర్శించారని, కార్యకర్తలంటే డీకే శివకుమార్‌కు చాలా చులకన అని బీజేపీ నేతలు విమర్శించారు. గతంలో ఆయన ఇలాగే ప్రవర్తించారని ఆరోపించారు. జనబాహుళ్యంలో ఎలా నడుచుకోవాలో తెలియని వ్యక్తి ఇవాళ ఓ పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడని విమర్శించారు.

అయితే భౌతికదూరం పాటించకపోవడంతోనే కార్యకర్తను మందలించినట్టు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ వివరించారు. సదరు వీడియోను సామాజిక మాధ్యమాల్లో సర్కులేట్ చేయవద్దని కోరారు. అయితే నెటిజన్లు మాత్రం తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: జ‌గ‌న్‌, ష‌ర్మిల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు లేవు: ఏపీ డిప్యూటీ సీఎం

Advertisement

తాజా వార్తలు

Advertisement