Saturday, May 4, 2024

అమెరికాలోని ప్ర‌తినిధుల స‌భ‌లో.. దివాళి డే బిల్లు

దివాళి డే యాక్ట్ పేరిట కాంగ్రెస్ స‌భ్యురాలు గ్రేస్ మేంగ్ అమెరికాలోని ప్ర‌తినిధుల స‌భ‌లో బిల్లుని ప్ర‌వేశ‌పెట్టారు.దాంతో దీనిపై అమెరికాలో సర్వత్రా హర్షం వ్యక్తమ‌యింది. ప్రపంచంలోని కోట్లాది మందికి దీపావళి ఎంతో ముఖ్యమైన పర్వదినం. అమెరికాలోనూ కొన్ని వేల కుటుంబాలు ఈ పండుగ జరుపుకుంటాయ‌ని మేంగ్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ రోజుకున్న ప్రాముఖ్యతపై అమెరికన్లలో అవగాహన పెంచేందుకు తొలి అడుగుగా ఈ బిల్లును సిద్ధంగా చేశాను అని ఆమె తెలిపారు. ఈ బిల్లుపై న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నీఫర్ రాజ్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. దీపావళి ప్రాముఖ్యాన్ని, దక్షిణాసియా వారిని గుర్తిస్తూ ఓ రాష్ట్రం మొత్తం ఈ ఏడాది ఏకతాటిపైకి రావడం మనం చూశాం.

ఈ స్ఫూర్తిని కాంగ్రెస్ సభ్యురాలు మెంగ్ జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. దీపావళిని జాతీయ సెలవుదినంగా ప్రకటించేందుకు చారిత్రక బిల్లును ప్రవేశపెట్టారు అని కొనియాడారు. న్యూయార్క్‌ స్టేట్ సెనేటర్ జెరెమీ కూనీ కూడా మెంగ్‌ను ప్రశంసించారు. దీపావళిని సెలవుగా ప్రకటిస్తే ఈ పండుగ నిర్వహించుకునే వారిని గౌరవించినట్టు అవుతుంది. అంతేకాకుండా, అమెరికన్లకు పెద్ద సంప్రదాయానికి ప్రచారం కల్పించినట్టు అవుతుంద‌న్నారు. ఈ బిల్లును అమెరికా చట్టసభలు ఆమోదిస్తే అధ్యక్షుడు ఆమోదముద్ర వేస్తారు. దీంతో, దీపావళికి అమెరికాలో 12వ దేశవ్యాప్త హాలిడేగా గుర్తింపు దక్కుతుంది. ఈ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం కోసం గట్టి కృషి చేస్తానని బిల్లును ప్రతిపాదించిన గ్రేస్ మెంగ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement