Wednesday, May 1, 2024

పాకిస్థాన్ లో విధ్వంసం.. తమ పౌరులకు జాగ్రత్తలు చెప్పిన దేశాలు

ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తో పాకిస్థాన్ అట్టుడికిపోతోంది. ఆయ‌న మ‌ద్ద‌తుదారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. దాంతో దేశ వ్యాప్తంగా మొబైల్..ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను ఆపివేశారు. కాగా ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ను నియంత్రణలో ఉంచినట్టు ‘డాన్’ పత్రిక తెలిపింది. ఇంటర్నెట్‌ను నిలిపివేయడం, సోషల్ మీడియాపై నియంత్రణ భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం తప్ప మరోటి కాదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తం చేసింది. వీటిపై నిషేధాన్ని ఎత్తివేయాలని, సేవలను పునరుద్ధరించాలని కోరుతూ పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్స్, అంతర్గత శాఖ మంత్రిత్వశాఖను కోరినట్టు తెలిపింది. దేశం మొత్తం అల్లకల్లోలంగా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లో ఉన్న తమ పౌరులకు ప్రపంచ దేశాలు జాగ్రత్తలు చెబుతున్నాయి. అమెరికా, కెనడా, యూకే తదితర దేశాలు తమ పౌరుల కోసం ట్రావెల్ అడ్వైజరీని జారీ చేశాయి. అల్లర్లు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి.

పాకిస్థాన్ లో ఉన్న అమెరికన్లు మరింత జాగ్రత్తగా ఉండాలని, తమ పాస్ పోర్ట్ లను వెంట తీసుకెళ్లాలని అమెరికా రాయబార కార్యాలయం సూచించింది. దేశంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు సంబంధించి రిపోర్టులు తెప్పించుకుంటున్నట్లు తెలిపింది. అల్లర్ల నేపథ్యంలో అన్ని సమావేశాలను రద్దు చేసినట్లు వివరించింది. ఆందోళనలకు దూరంగా ఉండాలని యూకే ఫారెన్ కామన్వెల్త్ అండ్ డెవలప్ మెంట్ ఆఫీస్ (ఎఫ్ సీడీఓ) తమ పౌరులకు సూచించింది. స్థానిక వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, నిరసనలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల నుంచి వెంటనే దూరంగా వెళ్లాలని హెచ్చరించింది. శాంతియుత నిరసనలు కూడా క్షణాల వ్యవధిలో హింసాత్మకంగా మారే అవకాశం ఉందని చెప్పింది. పాకిస్థాన్ లో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని, కిడ్నాప్ లు జరగొచ్చని కెనడా తన పౌరులను హెచ్చరించింది. పాకిస్థాన్ లో ఉంటున్న కెనెడియన్లు జాగ్రత్తగా ఉండాలని, రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement